Wednesday, May 27, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంCorruption | తెలంగాణలో అవినీతి వైరస్..!

Corruption | తెలంగాణలో అవినీతి వైరస్..!

  • ఏసీబీ వలలో వరుసగా అవినీతి అధికారులు..
  • అయినా, అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట ఎక్కడ?
  • పట్టుపడుతున్నా అధికారుల్లో భయం శూన్యం
  • కూలీ రైతు నుంచి బడా బాబుల వరకూ..
  • ఫైలు కదలాలంటే నోట్ల కట్టలు తప్పనిసరి..
  • ప్రభుత్వ నిఘా వ్యవస్థ ఎక్కడని ప్రజల ప్రశ్న..
  • అవినీతిపై ఉక్కుపాదం మోపాలన్న ప్రజలు..

ఎక్కడ చూసినా ఒకే కథ.. లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారులు.. ఇళ్లలో బయటపడుతున్న నగదు కట్టలు.. బంగారం, భూముల పత్రాలు, బినామీ ఆస్తులు.. ఇవి చూస్తుంటే ప్రభుత్వ ఉద్యోగం కొంతమందికి ప్రజాసేవ కాదు.. “అక్రమ సంపాదనకు ఓపెన్ లైసెన్స”గా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి..

అవినీతి నిరోధక శాఖ దాడులు జరుగుతున్నా, ప్రభుత్వాలు పారదర్శకత గురించి ఎంతగా మొత్తుకుంటున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ‘లంచాల’ దందా యథేచ్ఛగా సాగుతోంది. అధికారులు నేరుగా రంగంలోకి దిగకుండా కిందిస్థాయి సిబ్బందిని, కొన్నిచోట్ల ఉద్యోగ సంఘాల ప్రతినిధులనే మధ్యవర్తులుగా మార్చుకొని సరికొత్త వసూళ్ల నెట్‌వర్క్‌ను నడుపుతున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. గ్రామ పంచాయతీ పనుల బిల్లుల నుంచి రిటైర్డ్ ఉద్యోగుల హక్కుల వరకు ప్రతి ఫైలుకూ ఒక ‘ధర’ ఫిక్స్ చేసి మరీ వసూలు చేస్తున్న వైనంపై ‘ఆదాబ’ అందిస్తున్న ప్రత్యేక కథనం..

- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో అవినీతి ఇప్పుడు ఒక్కో శాఖలో దాగి ఉన్న సమస్య కాదు.. ప్రభుత్వ యంత్రాంగాన్నే లోపల నుంచి కొరుకుతున్న మహమ్మారిగా మారిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నిర్వహిస్తున్న వరుస దాడుల్లో రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, రిజిస్ట్రేషన్, విద్యుత్, పోలీసు, పంచాయతీ రాజ్ వంటి పలు శాఖలకు చెందిన అధికారులు చిక్కుతుండటం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో స్పష్టం చేస్తోంది.

రోజుకో అధికారి.. కోట్ల ఆస్తులు.. బంగారం.. నగదు.. బినామీ లావాదేవీలు.. ఇవన్నీ ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కొత్త వార్తలు కావడం లేదు. ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రజాసేవ అనే భావన మాయమై… ఎంత వసూలు చేయగలం అనే దిశగా కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు తీవ్రమవుతున్నాయి.

ప్రభుత్వం లక్షల్లో జీతాలు, అలవెన్సులు, ఉద్యోగ భద్రత, పెన్షన్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ.. కొంతమంది అధికారులు మాత్రం అవినీతినే అదనపు ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. ఫైలు కదలాలంటే డబ్బు.. సర్టిఫికెట్ రావా లంటే డబ్బు.. బిల్లు పాస్ కావాలంటే డబ్బు.. రైతుకు పాస్‌బుక్ కావాలన్నా, పేదవాడికి సంక్షేమ పథకం అందాలన్నా లంచం అనే గేటు దాటాల్సిందేనన్న పరిస్థితి నెలకొంది.

రోజంతా కూలి చేసి వచ్చిన రైతు.. అప్పుల్లో కూరుకుపోయిన సామాన్యుడు.. ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న వృద్ధుడు.. అందరి బలహీనతలనే కొంతమంది అధికారులు డబ్బు సంపాదించే అవకాశాలుగా మార్చుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. లంచం ఇవ్వకపోతే పని జరగదు అనే భయం ప్రజల్లో బలపడటం అత్యంత ప్రమాదకర సంకేతంగా భావిస్తున్నారు.

ఏసీబీ అధికారులు దాదాపు ఎక్కడో ఒకచోట దాడులు నిర్వహిస్తూ అవినీతి అధికారులను అరెస్టు చేస్తున్నారు. కోట్ల రూపాయల ఆస్తులు బయటపడుతున్నాయి. కానీ ఈ దాడు లు అవినీతి అధికారుల్లో భయాన్ని కలిగించడం లేదనే అభిప్రా యం పెరుగుతోంది. ఎందుకంటే.. ఒక అధికారి పట్టుబడితే, మరుసటి రోజే మరో శాఖలో అదే తరహా అవినీతి బయట పడుతోంది.

అంటే అవినీతి వ్యక్తిగత స్థాయిని దాటి.. వ్యవస్థలో భాగమైందా? అనే అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. సామాన్య ఉద్యోగి కొన్ని లక్షలు లేదా కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు కూడబెట్టడం వెనుక కేవలం అతడి తెలివి మాత్రమే ఉండదని రాజకీయ, సామాజిక వర్గాలు అభిప్రాయపడుతు న్నాయి. ఒక శాఖలో అవినీతి బహిరంగ రహస్యంగా మారినా.. పై అధికారు లు గుర్తించకపోవడం ఎలా సాధ్యమవుతోందని ప్రశ్నిస్తున్నారు.

ఈ అవినీతిపై ప్రభుత్వం సరైన నిఘా పెట్టడం లేదా..? లేక ఈ అవినీతి సొమ్ములో పైస్థాయిలకు కూడా వాటాలు వెళ్తున్నాయా..? అనే ప్రశ్నలు తలెతుత్తున్నాయి.. అధికా రుల జీవనశైలి ఒక్కసారిగా మారడం, కోట్ల విలువైన భూములు కొనుగోలు చేయడం, బినామీ ఆస్తులు పెరగడం వంటి అంశా లపై నిరంతర పర్యవేక్షణ ఎందుకు ఉండడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ అవినీతి వ్యవస్థ వల్ల ఎక్కువ నష్టపోతున్నది సామాన్య ప్రజలే.

ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లే ప్రతి వ్యక్తి ఎంత ఇవ్వాలి? అనే మానసిక ఒత్తిడితోనే అడుగు పెడుతున్న పరిస్థితి ఏర్పడింది. అవినీతి అధికారులను కేవలం సస్పెండ్ చేయడం లేదా బదిలీ చేయడం సరిపోదని నిపుణులు చెబుతున్నారు. అక్రమ ఆస్తుల స్వాధీనం, వేగవంతమైన విచారణ, ఉద్యోగాల తొలగింపు, ప్రజలకు పారదర్శక సేవలు అందించే డిజిటల్ వ్యవస్థ బలోపేతం చేయాలని సూచిస్తున్నారు…

మొన్నటికి మొన్న రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ కే. వంశీ మోహన్‌పై అవినీతి నిరోధక శాఖ విస్తృత స్థాయిలో దాడులు చేపట్టింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భాగంగా అతడిని అదుపులోకి తీసుకున్నారు.. అదేవిధంగా మంగళవారం రోజు శామీర్పేట్ మండలాఫీసులో ఏసీబీ దాడులు నిర్వహించించి ఎమ్మార్వో సుచరితతో పాటు ఆర్డిఓ కీసర రాజేష్ లను లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.. ఇలా ఒక్కటి కాదు, రెండు కాదు.. వందల సంఖ్యలో అవినీతి అధికారులు ఏసీబీకి చిక్కుతూనే ఉన్నారు.. కానీ ఏమి జరుగుతోంది.. కేవలం సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటున్నారు..

తిరిగి కొన్ని నెలల్లో విధుల్లో చేరుతున్నారు సస్పెండ్ అయిన అధికారులు.. మాకేమవుతుంది..? అయితే సస్పెండ్ అవుతాం.. కోర్టులకు వెళ్తాము తిరిగి విధుల్లో చేరతాం అనే ధీమా వారిలో పేరుకుపోయింది.. అలా కాకుండా అవినీతి వ్యవహారంలో దొరికిపోయిన అధికారులను విధులనుంచి పూర్తిగా తొలగించాలి.. కఠినమైన శిక్షలు అమలు చేయాలి అప్పుడే కొంతమేర అవినీతి తగ్గుముఖం పడుతుందని విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు..

పట్టుబడ్డ ఎమ్మార్వో సుచరిత, ఆర్దీఓ కీసర రాజేష్

మేడ్చల్ ` మల్కాజిగిరి జిల్లాలోని శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో ఈ తనిఖీలు చేపట్టారు. అనంతరం మీడియాతో ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ.. శామీర్‌పేట మండలం ఆలియాబాద్ ప్రాంతంలో సుమారు 30 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించి రైతు కన్సల్టెంట్ నుంచి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.

ఎకరానికి రూ.1 లక్ష చొప్పున మొత్తం రూ.30 లక్షలు డిమాండ్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. ఈ వ్యవహారంలో తహసీల్దార్ డ్రైవర్ ద్వారా రూ.2 లక్షలు తీసుకుం టుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కార్యాలయంలోని కీలక పత్రాలు, భూ అనుమతులకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నామని, ఎమ్మార్వో సుచరితతో పాటు ఆర్డిఓ కీసర రాజేష్ పలువురు సిబ్బందిని విచారించామని తెలిపారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.

ఏసీబీ వలలో మరో అవినీతి చేప..

ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. భూముల సర్వే చేయడానికి ఫిర్యాదుదారుడి నుంచి లంచం తీసుకుంటూ జోగు లాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల సర్వేయర్ బ్రహ్మయ్య అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. తన భూమిని సర్వే చేయాల్సిందిగా మండల సర్వేయర్ బ్రహ్మయ్యను బాధితుడు ఆశ్రయించగా రూ. 10 వేలు లంచం డిమాండ్ చేశారు.

లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో పక్కా వ్యూహం మేరకు పట్టుకున్నారు. నిందితుడి నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు, ఆయనపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం ఏసీబీ కోర్టుకు తరలించను న్నారు. అవినీతికి పాల్పడితే ఎంతటి వారైనా వదిలేది లేదని అధికారులు హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News