- సింగపూర్ ప్రతినిధులతో బాబు మీటింగ్..
- రాష్ట్రంలో ఉన్న సౌకర్యాలను వివరించిన సీఎం..
ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా సింగపూర్‌కు చెందిన పలు ప్రముఖ సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వారికి వివరించారు.
తన పర్యటనలో భాగంగా తొలిరోజు, ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థ వైసీహెచ్ గ్రూప్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ సునీల్ నంబియార్‌తో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో సప్లై చైన్, లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటుపై ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా, అత్యాధునిక సాంకేతికతతో కూడిన భారీ ఆటోమేటెడ్ సప్లై చైన్ సిటీని ఏపీలో నిర్మించే అంశంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. “ఆంధ్రప్రదేశ్‌కు వెయ్యి కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరం ఉంది. లాజిస్టిక్స్ రంగానికి ఇది ఎంతో అనుకూలం. మాకు జాతీయ రహదారులు, ఓడరేవులు, విమానాశ్రయాలు, రైల్వేలతో అద్భుతమైన కనెక్టివిటీ ఉంది. లాజిస్టిక్స్ వ్యయాన్ని తగ్గించేందుకు ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం” అని తెలిపారు.
