Monday, December 8, 2025
EPAPER
HomeజాతీయంCounting | నేడే ఫలితాలు

Counting | నేడే ఫలితాలు

  • బీహార్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు రంగం సిద్దం
  • ఉదయం 8గంటలకు పోస్టల్ బ్యాలెట్తో ప్రారంభం
  • పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడే

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు పక్రియకు ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేసింది. శుక్రవారం ఉదయం 8.00 గంటలకు ఈ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు జరుపుతారు. అనంతరం అంటే.. 8.30 గంటలకు ఓట్లు లెక్కింపు ప్రారంభమవుతుంది. అందుకోసం 243 రిటర్నింగ్ అధికారులు, 243 పరిశీలకుల ఈ ఓట్ల లెక్కింపును పర్యవేక్షించనున్నారు. ప్రతి టేబుల్ వద్ద ఒక సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో- ఆబ్జర్వర్లతో సిబ్బందిని ఏర్పాటు చేశారు.

అందుకోసం ఎన్నికల సంఘం 4,372 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేసింది. అభ్యర్థులు నియమించిన 18 వేల మందికి పైగా ఏజెంట్స్ సైతం ఈ లెక్కింపు పక్రియను పర్యవేక్షిస్తారు. రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతలుగా పోలింగ్ నిర్వహించారు. నవంబర్ 6వ తేదీన 121 స్థానాలకు, నవంబర్ 11వ తేదీన 122 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఈ రెండు విడతల్లో ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు క్యూకట్టారు. దీంతో 67.13 శాతం పోలింగ్ నమోదయింది. 1951 తర్వాత.. ఆ రాష్ట్రంలో ఇంత భారీగా పోలింగ్ నమోదకావడం ఇదే తొలిసారి.

- Advertisement -

ఇక ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందంటూ ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ సర్వేలు స్పష్టం చేశాయి. మరి ఏ పార్టీకి ఓటరు పట్టం కట్టాడనే దానిపై శుక్రవారం సాయంత్రానికి స్పష్టత రానుంది. మరో వైపు ఈ అసెంబ్లీ ఎన్నికలతోపాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా ఇదేరోజు ప్రకటించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లును ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. అందులో హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం సైతం ఉంది. ఈ అసెంబ్లీ స్థానానికి మంగళవారం అంటే.. నవంబర్ 11వ తేదీన ఉప ఎన్నికను నిర్వహించారు.

ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఫలిస్తాయా

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న బిహార్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. సీఎం నితీశ్ కుమార్ తన అధికారాన్ని నిలబెట్టుకుంటారా? లేదా? అనేది నేటితో తేలిపోతుంది. ఎగ్జిట్ పోల్ సర్వేల ప్రకారం మళ్లీ ఎన్ఐఎ గెలుస్తుందని ప్రకటించారు. అయితే దీనిని తేజస్వియాదవ్ కొట్టి పారేశారు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేసి రికార్డు నెలకొల్పిన నితీశ్ కుమార్ ఈసారి గెలిస్తే సరికొత్త చరిత్ర సృష్టించిన వారవుతారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఎన్నికల సంఘం ఇటీవల తెలిపింది.

కౌంటింగ్ సెంటర్లలో రెండంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశామని వెల్లడించింది. మొదటి భద్రతా వలయంలో కేంద్ర పారామిలిటరీ దళాలు, ఆ తరువాత రాష్ట్ర పోలీసు బలగాలతో పహారాను ఏర్పాటు చేసినట్టు తెలిపింది. 24/7 సీసీటీవీ నిఘా కూడా ఉంటుందని వెల్లడించింది. ఇక ఓట్లు భద్రపరిచిన ప్రతి స్ట్రాంగ్ రూమ్ క్యాంపస్ వద్ద జిల్లా సీనియర్ అధికారుల పర్యవేక్షణలో ఓ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. జిల్లా ఎలక్షన్ ఆఫీసర్లు, రిటర్నింగ్ ఆఫీసర్లు స్ట్రాంగ్ రూమ్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఈసీ ఆదేశించింది.

ఈసారి ఎన్నికల్లో ఓటింగ్ భారీ స్థాయిలో నమోదైన విషయం తెలిసిందే. 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఓటింగ్ నిర్వహించగా రికార్డు స్థాయిలో 67.13 శాతం మేర పోలింగ్ జరిగింది. దీంతో, ప్రజాతీర్పుపై ఉత్కంఠ పతాకస్థాయికి చేరుకుంది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే క్లీన్ స్వీప్ చేస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ప్రతిపక్ష మహాగర్బంధన్ కూటమి నేత తేజస్వీ యాదవ్ మాత్రం ఈ అంచనాలను కొట్టిపారేశారు.

తమ కూటమి మంచి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు. సీఎం నితీశ్ సారథ్యంలోని జేడీ(యూ), బీజేపీతో సహా ఎన్డీయే (ఔఆం) కూటమిలోని ఐదు పార్టీలు బరిలో నిలిచాయి. జేడీ(యూ), బీజేపీలు 101 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. ఇక ఆర్ జేడీ, కాంగ్రెస్, సీపీఐ (ఎమ్ఎల్) లిబరేషన్, ఇతర లెఫ్ట్ పార్టీలు, వికాసిల్ ఇన్సాన్ పార్టీలు మహాగర్ బంధన్ (మహాకూటమి) ఏర్పడి ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News