- ఉదయం 11:15 నుంచి 12:15 గంటల మధ్య..
- జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో ట్రయల్ రన్..
- ఇది కేవలం పరీక్షేనని, ప్రజలు ఆందోళన చెందవద్దు..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలోని మొబైల్ వినియోగదారులకు రేపు (మే 2 శనివారం) ఒక ప్రత్యేక హెచ్చరిక సందేశం రానుంది. పెద్ద బీప్ సౌండ్‌తో కూడిన ఈ సందేశం చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది కేవలం ప్రయోగాత్మకంగా పరీక్షించడంలో భాగమేనని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా అత్యవసర హెచ్చరికల వ్యవస్థను బలోపేతం చేసేందుకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు వెల్లడించింది.
వివరాల్లోకి వెళితే, శనివారం ఉదయం 11:15 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల మధ్యలో ఏపీ రాజధాని ప్రాంతాల్లోని అన్ని మొబైల్ ఫోన్లకు సెల్ బ్రాడ్‌కాస్ట్ టెక్నాలజీ ద్వారా ఒక టెస్ట్ మెసేజ్ పంపనున్నారు. విపత్తుల సమయంలో ప్రజలను తక్షణమే అప్రమత్తం చేసేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ వ్యవస్థను అభివృద్ధి చేశారు. “అప్రమత్తమైన పౌరులు, సురక్షితమైన దేశం” అనే నినాదంతో ఈ వ్యవస్థ పనిచేస్తుంది.
“ఇది భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం ద్వారా పంపబడిన నమూనా పరీక్ష సందేశం. దయచేసి ఈ సందేశాన్ని విస్మరించండి. మీ వైపు నుంచి ఎటువంటి చర్య అవసరం లేదు” అనే సమాచారంతో ఈ ఫ్లాష్ మెసేజ్ మొబైల్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఈ పరీక్ష ద్వారా నెట్‌వర్క్ సామర్థ్యాన్ని, హెచ్చరికలు చేరే వేగాన్ని అధికారులు అంచనా వేస్తారు. భవిష్యత్తులో తుపానులు, భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు తక్షణ సమాచారం అందించేందుకు ఈ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడనుంది.
