- రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నేరెళ్ల శారద..
- శుక్రవారం పదవీ బాధ్యతల స్వీకరణ..
- బుద్ధభవన్ లో అతిరథ మహారథుల మధ్య కార్యక్రమం..
- కాంగ్రెస్ పార్టీలో అజాత శత్రువుగా శారదకి మంచి పేరు..
- రాష్ట్ర మహిళల అభ్యున్నతి కోసం కృషి చేసిన నాయకురాలు..
- కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో శారదకు ఓక ప్రత్యేక స్థానం..
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమితులైన నేరెళ్ల శారద శుక్రవారం నాడు సికింద్రాబాద్ బుద్ధభవన్ రెండవ అంతస్తులో ఉన్న మహిళా కమిషన్ ప్రధాన కార్యాలయంలో లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు.. రేవంత్ రెడ్డి నాయకత్వంలో అకుంఠిత దీక్షతో పనిచేస్తున్న ఆమెకు రెండవసారి మహిళా కమిషన్ చైర్పర్సన్ గా అవకాశం లభించింది.. ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు..
సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, మహిళా హక్కుల పోరాట యోధురాలు నేరెళ్ల శారద(Nerella Sharada) రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా మరోసారి పదవీ బాధ్యతలు చేపట్టడం తెలంగాణ రాజకీయ, సామాజిక వర్గాల్లో హర్షం నింపింది. ఆమె ప్రయాణం కేవలం పదవుల వెనుకా కాదు, నిరంతరం మహిళా అభ్యున్నతి కోసం తపించే ఒక నిజమైన నాయకురాలి ప్రయాణం. పార్టీకి ఆమె చేసిన సేవ – నిబద్ధతకు నిలువెత్తు రూపం.. కష్టకాలంలోనూ పార్టీ జెండాను వీడకుండా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కోసం అంకితభావంతో పనిచేసిన అతికొద్ది మంది నాయకురాళ్లలో నేరెళ్ల శారద ముందు వరుసలో ఉంటారు.






కరీంనగర్ గడ్డపై నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, జడ్పీ అధ్యక్షురాలిగా అంచెలంచెలుగా ఎదిగారు. ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ కార్యదర్శిగా, టీపీసీసీ మహిళా అధ్యక్షురాలిగా ఆమె చేసిన సేవలు పార్టీ బలోపేతానికి ఎంతో తోడ్పడ్డాయి. ప్రజా సమస్యలపై, ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై ఎప్పుడూ ముందుండి పోరాటాలు నిర్వహించారు. ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీయడంలో ఆమె గళం ఎప్పుడూ గట్టిగానే వినిపించింది.
ఎంత పెద్ద పదవిలో ఉన్నా నేరెళ్ల శారద ప్రవర్తనలో ఎప్పుడూ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే తత్వమే కనిపిస్తుంది. ఆమెలోని మంచితనం, తోటివారితో ఆప్యాయంగా మాట్లాడే గుణం అందరినీ ఆకట్టుకుంటుంది. మహిళల హక్కుల పరిరక్షణ విషయంలో ఆమె ఎవరికీ వెరవరు. బాధితులకు అండగా నిలవడంలో ఆమె ప్రదర్శించే తెగువ అసాధారణం. మొదటి విడతలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ఆమె చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం, ఇప్పుడు రెండవసారి ఆమెకు ఈ బాధ్యతలు అప్పగించడం ఆమె పనితీరుకు నిదర్శనం.
మహిళలకు అన్ని రంగాల్లోనూ సమాన ప్రాధాన్యత దక్కాలని, వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని నమ్మబలికే నేరెళ్ల శారద లాంటి నాయకురాలు ఈ పదవిలో ఉండటం రాష్ట్రంలోని ఆడబిడ్డలకు కొండంత బలం. ఆమె రెండవ పర్యాయం కూడా మహిళల సంక్షేమం కోసం మరిన్ని చారిత్రక విజయాలు సాధించాలని, మరింత సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం!
పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం శారద మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో రెండవసారి మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ కి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి, మంత్రి పొన్నం ప్రభాకర్ కి, తనను ఆదరించిన ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, కార్యకర్తలకు, తెలంగాణ మహిళాలోకానికి కృతజ్ఞతలు తెలియజేశారు.. తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని, మహిళాభ్యుదయంకోసం నిరంతరం పాటుపడతానని, పార్టీకోసం కష్టపడి పనిచేస్తానని తెలియజేశారు.. నేరెళ్ల శారద నియామకంపై సర్వత్రా హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి..(https://epaper.aadabhyderabad.in/), (Youtube)
