- తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీకి వినతి..
- విజ్ఞప్తి చేసిన మాజీ ఏపీవీసీసీ చైర్మన్, బక్క జడ్సన్..
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్, ప్రభుత్వ సలహాదారు డా. కె. కేశవరావు, సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ ఎస్. రాములు నాయక్, మోతె శోభన్ రెడ్డి లకు ఉద్యమకారులకు న్యాయం చేయాలని కోరుతూ బక్క జడ్సన్ విజ్ఞప్తి చేశారు..
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన చారిత్రాత్మక ఉద్యమంలో విద్యార్థులు, నిరుద్యోగ యువత, ప్రభుత్వ ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, పార్ట్‌టైమ్ టీచర్లు, గెస్ట్ లెక్చరర్లు, రైతులు, మహిళలు, కళాకారులు, ప్రకటన రంగ ప్రతినిధులు, ప్రజా సంఘాలు ముందువరుసలో నిలబడి అపార త్యాగాలు చేశారు. స్వయం పాలన, “నీళ్లు–నిధులు–నియామకాలు” అనే మహోన్నత లక్ష్యాల సాధన కోసం వారు ఎన్నో కష్టనష్టాలు భరించారు.
ముఖ్యంగా నిరుద్యోగ యువత తెలంగాణ ఏర్పడిన తర్వాత తమకు న్యాయం జరుగుతుందనే ఆశతో ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. గ్రూప్–1 పరీక్షల సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే పరీక్షలు రాస్తామని చెబుతూ ప్రశ్నాపత్రాలను చించి “జై తెలంగాణ” నినాదాలతో పరీక్షా కేంద్రాల నుంచి బయటకు వచ్చిన సంఘటనలు ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయి.
అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగింది. 2016 గ్రూప్–1 పరీక్షల వివాదాలు, 2022 ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలతో వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తు దెబ్బతింది. తెలంగాణలోని 33 జిల్లాల్లో సుమారు 3.50 లక్షల ప్రభుత్వ ఖాళీలు ఉన్నాయని పలు వర్గాలు పేర్కొంటున్నప్పటికీ, వాటిని భర్తీ చేయడంలో తగిన చర్యలు చేపట్టలేదు. ఎన్నికల సమయంలో ప్రకటించిన 2 లక్షల ఉద్యోగాలు, నెలకు రూ. 4,000 నిరుద్యోగ భృతి వంటి హామీలు కూడా ఇప్పటికీ అమలు కాలేదు.
“నీళ్లు–నిధులు–నియామకాలు” అనే ఉద్యమ నినాదంలో “నిధులు” అంశంపై కూడా ప్రజల్లో అనేక ప్రశ్నలు ఉన్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి భారీ ప్రాజెక్టుల వ్యయాలు, అప్పులు, నిధుల వినియోగం, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన సాంకేతిక వైఫల్యాలు, మునిగిపోయిన భారీ పంపుల కారణాలు, బాధ్యులపై తీసుకున్న చర్యలపై ప్రభుత్వం సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయాలి.
తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగులు సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ వంటి కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే ప్రస్తుతం ఐదు డీఏలు పెండింగ్‌లో ఉండటం, కొత్త పీఆర్సీ అమలు కాకపోవడం, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు గ్రాట్యుటీ, జీపీఎఫ్, కమ్యూటేషన్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి ప్రయోజనాలు సకాలంలో అందకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సీపీఎస్ ఉద్యోగులను ఓపీఎస్‌లోకి మారుస్తామని ఇచ్చిన హామీ కూడా అమలు కాలేదు.
తెలంగాణ ఉద్యమంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, పార్ట్‌టైమ్ టీచర్లు, గెస్ట్ టీచర్లు, పార్ట్‌టైమ్ లెక్చరర్లు, గెస్ట్ లెక్చరర్లు ఉద్యోగ భద్రత లేకపోయినా ఉద్యమంలో తెగించి పాల్గొన్నారు. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా వారు నేటికీ సమయానికి జీతాలు అందక, మధ్యవర్తి ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల దోపిడీకి గురవుతూ అత్యంత దయనీయ పరిస్థితుల్లో జీవిస్తున్నారు. వీరి సమస్యలను ప్రత్యేకంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపేలా కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కోరుతున్నాము.
అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో అడ్వర్టైజింగ్ రంగం అత్యంత కీలక పాత్ర పోషించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి పొందుతున్నప్పటికీ తెలంగాణ ఆత్మగౌరవం కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి హోర్డింగ్, బ్యానర్, ఫ్లెక్సీ ద్వారా ఉద్యమ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత స్థానిక అడ్వర్టైజింగ్ సంస్థలు ఆశించిన అవకాశాలు పొందలేదనే ఆవేదన వ్యక్తమవుతోంది. ఈ రంగంలో స్థానికులకు న్యాయం జరిగేలా విధానపరమైన చర్యలను కమిటీ పరిశీలించాలి.
అలాగే తెలంగాణ ఉద్యమానికి సాంస్కృతిక బలం చేకూర్చిన “జై బోలో తెలంగాణ” సినిమా ప్రత్యేక గుర్తింపుకు అర్హమైనది. ఆ చిత్రం ఉద్యమానికి కొత్త ఊపును తీసుకువచ్చింది. ఆ చిత్ర దర్శకుడు శంకర్ జాడే వంటి ఉద్యమ సాంస్కృతిక యోధుల సేవలను గుర్తించి, వారికి తగిన గౌరవం, ప్రోత్సాహం, అవసరమైన సహాయ సహకారాలు అందాయా అనే అంశాన్ని కూడా కమిటీ పరిశీలించాలని వినమ్రంగా కోరుతున్నాము.
ఉద్యమ సమయంలో రైతుల నుండి సేకరించిన వేల ఎకరాల భూములను పరిశ్రమల పేరుతో వివిధ సంస్థలకు కేటాయించారు. ఆ భూములపై ఎన్ని పరిశ్రమలు స్థాపించబడ్డాయి, ఎంతమందికి ఉపాధి కల్పించారు, వినియోగం కాని భూముల పరిస్థితి ఏమిటి అనే అంశాలపై పూర్తి వివరాలతో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అన్ని వర్గాల ఉద్యమకారులకు అధికారిక గుర్తింపు కల్పించాలి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఖాళీలను నిర్దిష్ట కాలపరిమితిలో భర్తీ చేయాలని సిఫార్సు చేయాలి. నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ, సీపీఎస్ రద్దు వంటి ఎన్నికల హామీల అమలుకు చర్యలు సూచించాలి. కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి భారీ ప్రాజెక్టులపై సమగ్ర విచారణ జరిపి శ్వేతపత్రం విడుదల చేయాలని సిఫార్సు చేయాలి. పెండింగ్ డీఏలు, పీఆర్సీ, పదవీ విరమణ ప్రయోజనాలను వెంటనే విడుదల చేయాలని సూచించాలి.
ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు సిఫార్సు చేయాలి.
పరిశ్రమల పేరుతో కేటాయించిన భూముల వినియోగం, ఉద్యోగాల కల్పనపై సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయాలని సూచించాలి. తెలంగాణ ఉద్యమానికి సేవలందించిన కళాకారులు, సాంస్కృతిక కార్యకర్తలు, ప్రకటన రంగ ప్రతినిధులకు తగిన గుర్తింపు, సంక్షేమ చర్యలు కల్పించాలని సిఫార్సు చేయాలి. తెలంగాణ ఉద్యమ ఆశయాల అమలుపై సమగ్ర అధ్యయనం చేసి ప్రజలకు నివేదిక విడుదల చేయాలి.
తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారుల త్యాగాలకు నిజమైన గౌరవం చెల్లించాలంటే ఉద్యమ ఆశయాలను సంపూర్ణంగా అమలు చేయడం అత్యంత అవసరం. నేటికీ అనేక ఉద్యమకారుల జీవితాల్లో ఆవేదన, నిరాశ, అన్యాయం కొనసాగుతూనే ఉన్నాయి. అందువల్ల ఈ అంశాలను కమిటీ అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి ప్రభుత్వానికి సమగ్ర సిఫార్సులు చేయాలని వినమ్రంగా ఆయన విజ్ఞప్తి చేశారు..
