- జూలై 19… మంగళ్ పాండే జయంతి
బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కోసం అలనాడు జరిగిన పోరాటంలో ఎందరో ధీరులు ప్రాణాలర్పించారు. తెల్ల దొరలపై యుద్ధాన్ని ప్రకటించిన తొలి స్వాతంత్య్ర సమర యోధుడు మంగళ్ పాండే. ప్రాణాలకు లెక్కచేయక (బ్రిటీష్ వారి మీద తుపాకీ ఎక్కు పెట్టిన ధైర్యవంతుడు.
బ్రిటిష్ వారి పెత్తనానికి తలవొగ్గి వాళ్ళు చేస్తున్న అరాచకాలు, అవమానాలు మౌనంగా భరించిన భారతీయుల ఆలోచనలను స్వేచ్ఛా స్వాతంత్య్రాల వైపు మళ్లించిన ఘనత నిజంగా మంగళ్ పాండేదే.
బ్రిటిష్ రాజ్ నుండి దేశాన్ని విడిపించేందుకు తన ప్రాణాలను అర్పించిన స్వాతంత్య్ర సమర యోధుడుగా మంగళ్ పాండే భారత చరిత్రలో ప్రసిద్ధి చెందాడు. 1857 నాటి తిరుగు బాటులో ఆయన కీలక పాత్ర పోషించాడు. మూడు పదుల వయసుకు చేరకుండానే ఉరికంబం ఎక్కేందుకు ఏమాత్రం వెనకడుగు వేయని ధైర్యవంతుడు, తన త్యాగం దేశంలోని యువతను మేల్కొలుపు తుందని, విశ్వసించాడు. తన ఆత్మ త్యాగం మరిందరో వీరులకు స్ఫూర్తిని కలిగిస్తుందని, అలా స్ఫూర్తిని పొంది భరతమాత దాస్య విముక్తికి అంకితం అవుతారని, ఆ దిశగా యత్నం చేస్తారని భావించాడు.

సుమారు రెండు శతాబ్దాలు మన దేశాన్ని పాలించిన శ్వేత జాతీయులపై తిరుగు బాటును ప్రకటించిన తొలి స్వాతంత్ర్య సమర యోధుడు మంగళ్ పాండే. మంగళ్ పాండే 1827 జూలై 19 న నేటి ఉత్తర ప్రదేశ్ నందు గల పైజాబాద్ జిల్లాలోని సుర్హపుర అను గ్రామంలో ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. 22 సంవత్సరాల వయసులో మంగళ్ పాండే తనకు తెలిసిన వ్యక్తి ద్వారా తాను సిపాయిగా చేరాడు. శిక్షణ అనంతరం పాండేని 34 బెంగాల్ రెజిమెంట్ లోని 6వ కంపెనీకి సిపాయిగా పంపించారు.
సెలవులకు ఇళ్లకు వెళ్లి వచ్చిన సైనికుల ద్వారా బ్రిటీషు వారి దోపిడీలు, దేశమంతటా చెలరేగుతున్న స్వాతంత్ర్య ఉద్యమం గురించి వార్తలు అందుతుండేవి. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న స్థానిక పాలకులు సంఘటితంగా బ్రిటిషు వారిపై 1857 మే 31 న తిరుగుబాటు జరపాలని నిర్ణయించు కున్నారు. ఈ తిరుగు బాటుకు నాయకత్వం వహించిన వారిలో ఝాన్సీ రాణి లక్ష్మిబాయి, తాంతియా తోపె, బహుదూర్ షా తదితరులు ఉన్నారు.
తుపాకీ తూటాల తయారీలో గోవు, పంది కొవ్వు వాడుతున్న విషయం సైనికులకు తెలిసి లోలోపల రగిలి పోయారు. గోమాంసం వాడకం గురించి తెలుసుకున్న మంగళ్ పాండే ఉడికి పోయి, తోటి సైనికులతో తిరుగు బాటుకు పథకం వేశాడు. ఈ విషయం బ్రిటిషు అధికారులు మార్చి 29 న గుర్తించారు. తమ తమ తుపాకీలను సిద్ధంగా ఉంచుకొని, కన్పించిన బ్రిటిషు అధికారినల్లా కాల్చి పారేయాలని తోటి సైనికులందర్నీ ఉత్తేజ పర్చాడు. ఈ లోగా అధికారి వాగ్ రావటం మంగళ పాండే అతని మీద తూటా పేల్చటం జరిగింది, కానీ అది గురితప్పి అతని గుర్రానికి తగిలింది.

చేతి పిస్టల్ తో కాల్పులు జరిపాడు వాగ్. తప్పించుకున్న మంగళ్ పాండే తిరగబడి, తన తుపాకీ తో కొట్టబోయాడు. అప్పటికే చేరుకున్న శార్జంట్ హ్యూసన్ వచ్చి పాండే చేతిలోని తుపాకీని నెట్టి పారేశాడు. పాండేను అరెస్ట్ చేయమని అధికారులు ఆదేశించినా ఎవ్వరూ ముందుకు రాలేదు. తెల్లవారి చేతికి చిక్కటం ఇష్టం లేక, తన తుపాకీతో తానే కాల్చుకాగా, ఆ బుల్లెట్ గాయం చేసింది, కానీ ప్రాణం తీయలేదు. తర్వాత భయంతో అతన్ని బ్రిటిషు అధికారులు సమీపించి ఆస్పత్రికి తరలించారు.
వారం రోజుల్లో కోలుకున్న మంగళ్ పాండే మీద రాజద్రోహం, తిరుగుబాటు నేరాలు మోపి కోర్టులో హాజరు పరిచారు. వీలైనంత త్వరగా విచారణ ముగించటం, ఉరిశిక్ష విధించటం ఆంగ్లేయ పాలకుల దుర్నీతికి పరాకాష్ఠ. అదే జరిగింది. విచారణలో మంగళ్ పాండే ధైర్యంగా ఇలా ప్రకటించాడు… “నేను చేసిన తిరుగుబాటు నా దేశం కోసం, నా ధర్మం కోసం చేశాను.

ఇది నా స్వప్రేరణతో నా మాతృభూమి కోసం చేశాను, అంతే కానీ దీనికి మరెవ్వరినీ బాధ్యులని చేయొద్దు”. విచారణ పూర్తిచేసి, ఏప్రిల్ 18న ఉరితీయాలని ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటికే తిరుగుబాటు వార్త వ్యాపించి, అనేక రెజిమెంట్లలో చైతన్యం మొదలయ్యింది. మరో వైపు అనేక రాజ సంస్థానాలు, సంస్థానాల్లోని ప్రజలు తిరుగుబాటుకు ఏకమయ్యారు. భారత దేశమంతా ప్రథమ స్వతంత్ర్య సంగ్రామానికి తెర లేచింది. మంగళ్ పాండే ఉరి ప్రభావంతో సైనికుల్ని అణచి వేయటానికి ఏప్రిల్ 8 నే ఉరిశిక్షను అమలు చేశారు. మంగళ్ పాండే ప్రభావమున్న సైనిక కంపెనీని పూర్తిగా రద్దు చేశారు.
2005 లో మంగళ్ పాండే పై ఒక హిందీ సినిమా తీసారు. భారత ప్రభుత్వం మంగళ్ పాండే గౌరవార్థం, అక్టోబరు 5, 1984 న ఒక తపాళా దీని చిత్రకారుడు ఢిల్లీ కి చెందిన సి.ఆర్. ప్రకాశ్.బిళ్ళను విడుదల చేసింది.
భారత దేశ స్వాతంత్ర్య పోరాటపు తొలిసారి తిరుగుబాటు బావుటా ఎగురవేసిన వీరునిగా, మంగళ్ పాండే… 1857 నాటి తిరుగు బాటుకు మూలమైన వాడు, బ్రిటీష్ సిపాయిగా పనిచేస్తూ బ్రిటీష్ పాలకుల మీద తిరుగు బాటు చేసిన సాహసిగా, తొలి స్వాతంత్ర్య సమర యోధుడిగా చిర కాలం గుర్తుండి పోతాడు.

