- దక్షిణాదికి అన్యాయం జరిగితే యుగోస్లేవియా పరిస్థితే: చింతా మోహన్
లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) విషయంలో కేంద్ర ప్రభుత్వం తొందరపడుతోందని, పార్లమెంటు స్థానాలను 800కి పెంచితే దేశ సమతుల్యత తీవ్రంగా దెబ్బతింటుందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ హెచ్చరించారు. గురువారం దిల్లీలోని ఆంధ్రాభవన్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డీలిమిటేషన్ కారణంగా ఉత్తర, దక్షిణ భారతాల మధ్య అసమతుల్యత పెరిగితే దేశానికి యుగోస్లేవియా లాంటి గతే పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాతలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జవహర్లాల్ నెహ్రూ తదితరులు ఎంతో ముందుచూపుతో రూపొందించిన 543 స్థానాల వ్యవస్థను మార్చడం ఏమాత్రం సరికాదన్నారు.
ఇదే సమయంలో చారిత్రక తిరుచానూరు దళిత ఆలయ ప్రవేశ ఘటనను ఆయన ప్రస్తావించారు. 1925 అక్టోబర్ 13న ఆలయంలోకి మురుగన్ అనే దళితుడు ప్రవేశించి హారతి ఇవ్వగా, అప్పటి చట్టాల ప్రకారం అరెస్టయిన అతడిని కోర్టులో సి.రాజగోపాలాచారి వాదనలు వినిపించి కాపాడారని గుర్తుచేశారు. ఆ తర్వాత గాంధీజీ సత్యాగ్రహంతో మరో 33 మంది దళితులకు ఆలయ ప్రవేశం దక్కిందని, ఈ ఘట్టానికి వందేళ్లు నిండుతున్న సందర్భంగా అక్టోబరు 11, 12, 13 తేదీల్లో తిరుపతిలో ‘దళిత ఆలయ ప్రవేశ శతాబ్ది ఉత్సవాలు’ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 46 ప్రకారం ఎస్సీ, ఎస్టీల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉన్నా.. ఏపీలో ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు పేరుకే పరిమితమయ్యాయని చింతా మోహన్ విమర్శించారు. గత వైకాపా, ప్రస్తుత తెదేపా ప్రభుత్వాలు ఆ సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల తీరుపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందని, ఒకప్పుడు తమను విమర్శించిన గ్రామీణ ప్రజలే ఇప్పుడు కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
