- జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణమే స్పందించాలని సూచించారు. మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.


ఈ కార్యక్రమంలో ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సమర్పించారు.
ప్రజావాణి కార్యక్రమం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేసి సమయానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు ప్రభుత్వ వసతి గృహాలను నిరంతరం తనిఖీ చేయాలని తెలిపారు.


అలాగే, ముఖ్యమంత్రి బాసర పర్యటనను విజయవంతంగా నిర్వహించినందుకు అధికారులను అభినందించారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించినందుకు సంబంధిత అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
