- భద్రతా వైఫల్యంపై ఆగ్రహం – ఆటోలో పారిపోతుండగా పట్టుకున్న బంధువులు
జనగామ జిల్లా కేంద్రంలోని చంపక్ హిల్స్ మాతా శిశు సంరక్షణ ఆస్పత్రి (ఎంసీహెచ్)లో ఎనిమిది రోజుల పసికందును అపహరించేందుకు ఓ మహిళ చేసిన యత్నం తీవ్ర కలకలం రేపింది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం, భద్రతా లోపాలు ఈ ఘటనతో బహిర్గతమయ్యాయి. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటాడి మహిళను పట్టుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం సలాక్పూర్ గ్రామానికి చెందిన చామంతుల కరుణాకర్, కీర్తన దంపతులు ఈ నెల 2న ప్రసవం కోసం ఎంసీహెచ్‌లో చేరారు. కీర్తనకు పండంటి మగబిడ్డ జన్మించగా, జాండీస్ సమస్యతో శిశువును నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు.


బుధవారం సాయంత్రం రఘునాథపల్లి మండలానికి చెందిన జ్యోతి అనే మహిళ, బాలింత బంధువులా నటిస్తూ వార్డు పరిసరాల్లో తిరిగింది. సిబ్బంది ఎలాంటి తనిఖీలు చేయకపోవడంతో, సాయంత్రం సమయంలో ఎస్ఎన్సీయూలోకి ప్రవేశించి బాక్సులో ఉన్న పసికందును టవల్లో చుట్టుకుని బయటకు తీసుకెళ్లింది. అనంతరం ఆటోలో ఎక్కి జనగామ వైపు బయలుదేరింది.
కొద్దిసేపటికి శిశువు కనిపించకపోవడంతో తల్లి కీర్తన ఆందోళనకు గురై కేకలు వేయగా, సెక్యూరిటీ సిబ్బంది, బంధువులు వెంటనే అప్రమత్తమయ్యారు. సెక్యూరిటీ గార్డు రాజు, తండ్రి కరుణాకర్, సిబ్బంది కలిసి బైకులపై ఆటోను వెంబడించి శివారులో అడ్డుకుని మహిళను పట్టుకున్నారు. మొదట బిడ్డ తనదేనని చెప్పిన ఆమె, అనంతరం ఒత్తిడికి తట్టుకోలేక నిజం ఒప్పుకుంది. శిశువును సురక్షితంగా తిరిగి ఆస్పత్రికి తీసుకువచ్చారు.



ఉద్రిక్తత – పోలీసుల జోక్యం
మహిళను తీసుకువచ్చిన అనంతరం ఆగ్రహంతో ఉన్న బంధువులు ఆమెపై దాడికి యత్నించగా, సమాచారం అందుకున్న సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్సై భరత్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మహిళను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
భద్రతా లోపాలపై విమర్శలు
ఈ ఘటనతో ఆస్పత్రి భద్రతా వ్యవస్థపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బంధువులా నటించిన మహిళను ఎవరూ ఆపకపోవడం, శిశువు చేతికి ఉన్న గుర్తింపు ట్యాగ్ తొలగించినా గమనించకపోవడం, ఎస్ఎన్సీయూలోకి నిర్బంధాలు లేకుండా ప్రవేశం కలగడం వంటి అంశాలు నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారాయి. సీసీటీవీ పర్యవేక్షణ ఉన్నప్పటికీ ఘటనను ముందుగా గుర్తించలేకపోవడం గమనార్హం.


దర్యాప్తు కొనసాగుతోంది
పసికందు అపహరణ యత్నంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మహిళ మానసిక పరిస్థితి, కుటుంబ నేపథ్యం తదితర అంశాలపై విచారణ కొనసాగుతోంది.


చర్యల డిమాండ్
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆస్పత్రిలో భద్రతా వ్యవస్థను పటిష్టం చేయాలని బంధువులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

