Monday, February 23, 2026
Homeరంగారెడ్డిJawahar Nagar | మహనీయులకు 80వ జ్ఞానమాల కార్యక్రమం నిర్వహణ

Jawahar Nagar | మహనీయులకు 80వ జ్ఞానమాల కార్యక్రమం నిర్వహణ

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జవహర్ నగర్లోని బాలాజీ నగర్ చౌరస్తాలో ఆదివారం భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మహనీయులకు 80వ జ్ఞానమాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం అంశాలపై పలు ప్రసంగాలు నిర్వహించారు.

సమితి నిర్వాహకులు మహంకాళి భిక్షు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు గడిచినా రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను ప్రజలు పూర్తిస్థాయిలో అనుభవించే పరిస్థితి ఇంకా ఏర్పడలేదన్నారు. దేశాన్ని మనమే పాలిస్తున్నామని చెప్పుకుంటున్నా సామాజిక వివక్షత ఇంకా కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో హక్కులు నిర్దిష్టంగా పొందుపరిచినప్పటికీ వాటిని అమలు చేసే విధానంలో లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు.

- Advertisement -

B. R. Ambedkar రాజ్యాంగాన్ని రచించి పార్లమెంటులో ప్రవేశపెట్టిన సందర్భంలో సమానత్వం రాజ్యాంగంలో ఉన్నప్పటికీ సమాజంలో లేదని స్పష్టం చేశారని గుర్తు చేశారు. సామాజిక న్యాయం స్థాపించాలంటే రాజ్యాంగ హక్కులను అమలు చేయాలని, దళితులు రాజ్యాధికారం చేపట్టినప్పుడే వారి స్థితిగతులు మారుతాయని ఆయన అభిప్రాయాన్ని ప్రస్తావించారు.

నివాస హక్కు, కనీస వేతనాల చట్టం, సమాచార హక్కు, ఉపాధి హామీ చట్టం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నివారణ వంటి అంశాలు సమాజ మార్పుకు కీలకమని వక్తలు పేర్కొన్నారు. ప్రజలకు తమ హక్కులను అనుభవించేందుకు అనుకూల వాతావరణం కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ వ్యవస్థాపకులు రావులకోరు నరసింహ గౌడ్, కోయడ వెంకటేష్, కొమ్ము ఇలాకాంత్, బిర్రు యాకస్వామి, ఆనంద ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News