- బికెఎంయు జాతీయ కార్యవర్గ సభ్యులు వెంకట్రాములు.
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు, రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు గురువారం ఇచ్చిన సార్వత్రిక సమ్మెలో గల్లీ నుండి ఢిల్లీ వరకు కోట్లాదిమంది కార్మికులు కర్షకులు శ్రమజీవులు పాల్గొని జయప్రదం చేసిన వారందరికి భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు తాటిపాముల వెంకట్రాములు అభినందనలు తెలియజేశారు.
కార్మికులను బానిసలుగా చేసే, సంఘటిత, అసంఘటితరంగ కార్మిక హక్కులు కాలరాసే నాలుగు లేబర్ కోడ్స్ రద్దుచేసి గతంలోని కార్మిక చట్టాలను అమలు చేయాలని, కోట్లాదిమంది రైతు కూలీల పొట్ట కొట్టే విబి-జి రామ్ జీ చట్టం రద్దుచేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించి 200 రోజులు పనులు కలిగించి రోజుకు రూ.700 కూలీ ఇవ్వాలని, జాతీయ విత్తన చట్టం రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టం రద్దు చేయాలని, రైతు పండించిన అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు కలిపించాలని, కార్మికులకు కనీస వేతనం 26,000 చెల్లించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, కాంట్రాక్ట్ -అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజ్ చేయాలని తదితర డిమాండ్స్ సాధనకై దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వగా కోట్లాదిమంది సమ్మెలో, నిరసన ప్రదర్శనలలో పాల్గొని సమ్మెను సంపూర్ణంగా జయప్రదం చేశారన్నారు.
నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ బడా పారిశ్రామికవేత్తల అనుకూల విధానాలకు స్వస్తిపలకాలని , సార్వత్రిక సమ్మె ప్రభావాన్ని చూసైనా కార్మిక కర్షక ప్రజావ్యతిరేక విధానాలను విడనాడకపోతే పోరాటాలు తీవ్ర రూపందాలిస్తే అందుకు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రానున్న కాలంలో పోరాటాలను మరింత వుదృతంగా నిర్వహించేందుకు సమాయత్తం కావాలని వెంకట్రాములు పిలుపునిచ్చారు.
