Homeవరంగల్‌ఇసుక, బొగ్గు లారీల "దిగ్బంధనంలో ములుగు, భద్రాద్రి జిల్లాల సరిహద్దు రహదారులు"

ఇసుక, బొగ్గు లారీల “దిగ్బంధనంలో ములుగు, భద్రాద్రి జిల్లాల సరిహద్దు రహదారులు”

  • ప్రతీరోజు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్న స్థానిక,పర్యాటక, భక్తజన ప్రజలు
  • ఎటువైపు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని క్షణక్షణం భయం..భయం తో ప్రయాణిస్తున్న యాత్రికులు, పర్యాటకులు
  • ప్రమాదాలకు నిలయంగా ఏటూరునాగారం- మణుగూరు రాష్ట్రీయ ప్రధాన రహదారి
  • ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి తమను కాపాడాలని వేడుకుంటున్న ప్రజలు
  • చోటుచేసుకుంటున్న రోజుకు రెండు,మూడు ప్రమాదాలు

గోదావరి నది తీరప్రాంతo నుంచి ఇసుక,బొగ్గు,బూడిద లారీల నిరంతర రవాణా వలన ములుగు,భద్రాద్రి జిల్లాల పరిధిలోని సరిహద్దుప్రాంతాల్లో ఉన్న ఏటూరునాగారం వయా మంగపేట, పినపాక, మణుగూరు,అలాగే ఏడూల్లబయ్యారం వయా కరకగూడెం, తాడ్వాయి మండలాల ప్రజలు రెండేళ్లుగా ప్రతీ నిత్యం ఇరువైపులా ట్రాఫిక్ రద్దీ సమస్యలతో సతమతమవుతున్నారు. ఏటూరునాగారం, మంగపేట, పినపాక,మణుగూరు,కరకగూడెం, తాడ్వాయి అయిదు మండలాల్లోని ప్రజలు,రాష్ట్రంలో ని నలువైపులా నుంచి వచ్చే భక్తజన పర్యాటకులు ప్రధానంగా ఉన్న మూడు రహదారులు గుండా నిత్యం ప్రయాణిస్తుంటారు.

ప్రస్తుతం మూడు ప్రధాన రహదారులు కూడా వేలాది ఇసుక,బొగ్గు,బూడిద లారీల దిగ్బంధనంలో కొనసాగుతున్నాయి. దీంతో సాధారణ ప్రజలతోపాటు నిరంతరం ఈప్రాంతo లో ఉన్న మేడారం,లక్నవరం,భోగత జలపాతం, మల్లూరు హేమాచాల ఆలయం కి ప్రయాణిస్తున్న వందలాది వాహనాలు,వస్తున్న వేలాది మంది యాత్రికులు, పర్యాటకులు నానా అవస్థలు,తంటాలు పడుతున్నారు. కరకగూడెం, పినపాక మండలం నుంచి ఖమ్మం ఇతర ప్రాంతాలకు వెళ్లేవాళ్లు ఏడూళ్లబయ్యారం నుండి మణుగూరు వైపు ప్రయాణిస్తారు.

- Advertisement -

ఈ రహదారిలో నిత్యం బి టి పి ఎస్ కు బొగ్గు రవాణా చేసే బొగ్గు లారీలతో రహదారి రద్దీగా ఉంటుంది దీనికి తోడు రామానుజారం, సాంబాయిగూడెంతో పాటు మణగూరు మండలాలోని ఇతర ఇసుక రాంపులకు వచ్చే ఇసుక లారీలు ఈ రహదారి గుండా ప్రయాణం చేయడంతో మరింత ప్రమాదకరంగా మారింది. దీంతో మణుగూరు ఏడూళ్ల బయ్యారం రహదారి పై ప్రయాణించాలంటే ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సి వస్తుంది. మరో వైపు ఏడూళ్ల బయ్యారం నుండి ఏటూరునాగారం, వరంగల్ వైపు వెళ్లే ప్రధాన రహదారి ఇదే కావడం విశేషం.ఫలితంగా ఇసుక,బొగ్గు,బూడిద లారీలతో నిత్యం రద్దీగా మారుతుంది.

ఈ రహదారి పై జానంపేట దుగినేపల్లి, చేగర్శల,బ్రహ్మణపల్లి, రాజుపేట,రమనక్కపేట,వాడగూడెం, చుంచుపల్లి, మల్లూరు, మంగపేట, కమలాపురం, ఏటూరునాగారం వరకు ఉన్న ఆయా గ్రామాల వద్ద ప్రధాన రహదారిపై నిత్యం వందలాది ఇసుక లారీలు రహదారిని ఆక్రమించడం వలన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడవ రహదారి పినపాక, కరకగూడెం, తాడ్వాయి మండలాలను కలిపే ఏడూళ్ల బయ్యారం, తాడ్వాయి ప్రధాన రహదారి కూడా ఇప్పుడు ఇసుక లారీల రద్దీతో ప్రమాదకరంగా మారుతుంది. ఈ మూడు రహదారుల గుండా పినపాక మండలానికి రాకపోకలు సాగించే ప్రజలు నిత్యం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సి వస్తుంది.

ఈ రహదారులపై ప్రయాణం చేయాలంటే ఏ వైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు ఇసుక లారీల రాకపోకలు ఆగకుండా కొనసాగుతున్నాయి. స్కూల్‌కి వెళ్లే పిల్లలు, పనులకు వెళ్లే కార్మికులు, అత్యవసర సేవల కోసం వెళ్లే వాహనాలు కూడా ఈ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతున్నాయి. మణుగూరు ఏటూరునాగారం ప్రధాన రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతుండగా ఇప్పుడు ఏడూళ్ల బయ్యారం తాడ్వాయి ప్రధాన రహదారిగా ప్రమాదాలకు నిలయంగా మారే పరిస్థితి ఏర్పడుతున్నాయి.

ఈ రహదారిపై ఇసుక లారీలను నిలిపివేయాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గొడిశాల రామనాథం, ఉపసర్పంచ్ ల సంఘం జిల్లా అధ్యక్షులు అచ్చా నవీన్ కూడా అధికారులకు విజ్ఞప్తులు చేశారు. అయినప్పటికీ సమస్యకు పరిష్కారం కనిపించడం లేదు. ఈ సందర్భంగా ప్రజలు ఇసుక లారీల రాకపోకలకు నిర్దిష్ట సమయాలను నిర్ణయించాలని,గ్రామీణ రహదారులపై భారీ వాహనాల నియంత్రణ చేపట్టాలని, ఇసుక లారీల రవాణాకు ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోకపోతే, ఈ సమస్య మరింత తీవ్రమవుతుందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News