సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బీసీ నేతల పత్రికా సమావేశం
సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం బీసీ ఇంటలెక్షువల్ ఫోరం పత్రికా సమావేశం(Press meet) జరిగింది. బీసీ పొలిటికల్ ఫ్రంట్ సంయుక్తాధ్వర్యంలో ఎస్.దుర్గయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ భేటీలో ముఖ్య అతిథులుగా రిటైడ్ ఐఏఎస్ టి.చిరంజీవులు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగొని బాలరాజ్ గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్ ఏలికట్టే విజయ్ కుమార్ గౌడ్ మాట్లాడారు.
విజయ్ కుమార్ గౌడ్ ఏమన్నారంటే..
‘కులగణన చేస్తామని చెప్పి BC–OBC కాలమ్ తొలగించడం మోసం. BJP, కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటల్లోనే కులగణన ఉంది. అమల్లో మాత్రం శూన్యం. BCలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారు. BC ఉద్యమం జరుగుతున్నా BJP రాష్ట్ర నాయకత్వం స్పందించలేదు. కాంగ్రెస్, BJP రెండు పార్టీల విధానం BC వ్యతిరేకమే. మునిసిపల్ ఎన్నికలకు ముందు BC సమాజానికి ఈ మూడు పార్టీలు క్షమాపణ చెప్పాలి. కులగణన లేకుండా రిజర్వేషన్ ఎలా కేటాయిస్తారు? Dedication Commission రిపోర్టును పబ్లిక్ డొమైన్‌లో పెట్టలేదు. ఏ కులం జనాభా ఎంత ఉందో చెప్పకుండా 30% BC రిజర్వేషన్(BC Reservatins) ఇచ్చారు. 42% BC రిజర్వేషన్ హామీని కాంగ్రెస్ అమలుచేయలేదు. సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్ లేకుండా ఎన్నికలు పెట్టారు. మునిసిపల్ ఎన్నికలకు అడుగడుగునా తొందర ఎందుకు? నిధులు లేవని చెప్పి ఎన్నికలు పెట్టిన పార్టీ.. ఇప్పుడు ఎందుకు ఎన్నికలు నిర్వహిస్తోంది?.
BCల జనాభా లెక్కలు బయటపెడితే పెద్దల లెక్కలు బయటపడతాయన్న భయం. గత ప్రభుత్వం లెక్కలు పెట్టలేదు. ఇప్పటి ప్రభుత్వం కూడా అదే చేస్తోంది. తమిళనాడులో BC రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఇక్కడ ఎందుకు కాదు. 9వ షెడ్యూల్, రాజ్యాంగ సవరణ ద్వారా ఇక్కడ కూడా సాధ్యమే. అధికార పార్టీకి రాజకీయ సంకల్పం లేకపోవడమే సమస్య. ఇప్పటికీ BCలను 31%–30%కే పరిమితం చేశారు. కార్పొరేటర్లలో 18–28%, సర్పంచ్‌లకు 15% మాత్రమే ఇచ్చారు. జనరల్ సీట్లు మాత్రం పటేలు, పట్వారీల చేతుల్లోకి వెళ్తున్నాయి. గ్రామాల్లో BCలు జనరల్ సీట్లలో పోటీ చేసి 52% గెలిచారు. అదే భయంతో పట్టణాల్లో మళ్లీ BC వాటా తగ్గించారు. BC సమాజం ఊరుకోదు. రాజకీయంగా చైతన్యవంతమైంది. మునిసిపల్ ఎన్నికల్లో SC, ST, BCలు ఐక్యంగా పోటీ చేస్తారు. జనాభా ఎంత ఉందో అంతే హక్కు కావాలనేదే మా డిమాండ్. అధికారం ప్రజలదే. ఇది హెచ్చరిక కాదు. సంకల్పం’ అని అన్నారు.
బాలగోని బాలరాజ్ గౌడ్ మాట్లాడుతూ..
‘ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన ప్రధాన ఉద్దేశం రెండు అంశాలు. ఒకటి.. జనగణనలో కులగణన తప్పనిసరిగా జరగాలి. రెండు.. మునిసిపాలిటీల్లో బీసీలకు 42% రిజర్వేషన్ వెంటనే అమలుచేయాలి. కానీ ఈ రెండు అంశాలపైన కాంగ్రెస్, బీజేపీ కలిసి బీసీలను మోసం చేస్తున్నాయి. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా మాట ఇచ్చింది. కులగణన చేసిన తర్వాత బీసీల జనాభా ప్రకారం 42% రిజర్వేషన్ ఇస్తాం అని. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ కూడా జిత్నా హిస్సేదారి–ఉత్నా భాగ్యదారి అని స్పష్టంగా చెప్పారు. కానీ.. వాస్తవమేంటి?. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు కేవలం 17% రిజర్వేషనే ఇచ్చారు. అయినా కూడా తెలంగాణలో బీసీలు చైతన్యంతో 52% స్థానాలు గెలిచి చూపించారు. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటోంది?. కుల గణనలో బీసీలు 56% అని తేలినా రిజర్వేషన్ మాత్రం 31% మాత్రమే అంటోంది. ఇదే సమయంలో EWSలకు 10% రిజర్వేషన్ ఇస్తోంది. ఇది బహుజనులకు జరిగిన ఘోర అన్యాయం.
ఇక.. బీజేపీ సంగతి చూస్తే ఎలక్షన్‌ల ముందు కులగణన చేస్తాం అంటోంది. ఎలక్షన్‌లు అయిపోగానే కొత్త కొత్త కండిషన్లు పెడుతుంది. ఎస్సీ, ఎస్టీలను లెక్క చేస్తామంటోంది. బీసీలను మాత్రం Othersలో కలిపి మోసం చేస్తోంది. 70 కోట్ల బహుజనుల ఓట్లతో అధికారంలోకి వచ్చి అదే బహుజనులను మోసగించడం బీజేపీ, కాంగ్రెస్ నైజం. అసెంబ్లీలో మాటలకే పరిమితమయ్యాయి. అమల్లో బీసీలకు ఒక్క రూపాయి న్యాయం జరగలేదు. అందుకే మేం ఈరోజు స్పష్టంగా చెబుతున్నాం. తెలంగాణలో కులగణనలో తేలిన 56% బీసీ జనాభా ప్రకారం మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో 56% రిజర్వేషన్ ఇవ్వాలి. మహిళా రిజర్వేషన్ పేరుతో OC మహిళలను బీసీ సీట్లలో కూర్చోబెట్టే కుట్రలను ఆపాలి. ఈ పోరాటానికి మా వెంట నిలబడుతున్నది మాజీ ఐఏఎస్ అధికారి, రాజ్యాంగ నిపుణుడు చిరంజీవులు. ఆయన నాయకత్వంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్, బీసీ ఇంటెలెక్ట్యువల్ ఫోరం నిరంతరం బహుజనుల హక్కుల కోసం పోరాడుతున్నాయి.
రాబోయే రోజుల్లో మేం ఢిల్లీకి వెళ్లి ప్రతిపక్షాలు, అధికార పార్టీల్లోని బీసీ ఎంపీలను కలిసి మా డిమాండ్లను గట్టిగా వినిపిస్తాం. అవసరమైతే బీసీల స్వతంత్ర రాజకీయ వేదికను కూడా నిర్మించి, మన వాటా మనమే సాధించుకుంటాం. తెలంగాణ బడుగు బలహీన వర్గాలందరికీ మా విజ్ఞప్తి. ఈ పోరాటంలో మాకు అండగా నిలవండి. బీసీల గెలుపు కోసం మేం మీ వెంటే ఉంటాం’ అని అన్నారు.
టి.చిరంజీవులు మాట్లాడుతూ..
‘ఈరోజు ఈ మీటింగ్‌లో మూడు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఒకటి.. మునిసిపల్ ఎన్నికల్లో బీసీలకు జరిగిన ఘోర ద్రోహం. రెండు.. కేంద్ర ప్రభుత్వ కులగణన(Caste Census) మోసం. మూడు.. తెలంగాణలో 21 బీసీ ఫెడరేషన్లకు నిధుల విడుదల చేయని వైనం. మునిసిపల్ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అని చెప్పి మోసం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చట్టపరంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చకుండా మోసపూరితంగా ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చింది. ఇది ఒక్క పార్టీ తప్పు కాదు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు ద్రోహం చేశాయి. చట్టపరంగా సాధ్యం కాకపోతే పార్టీ పరంగా అయినా 42% ఇస్తాం అని మీరే చెప్పారు. ఇప్పుడు బీసీల జనాభా 56%. ఇప్పటికే చట్టపరంగా 30% ఉంది. ఓపెన్ కేటగిరీలో కనీసం 25% బీసీలకు ఇవ్వాలి.
బీసీ ద్రోహ పార్టీలుగా మేం ప్రజల్లో చిత్రీకరిస్తాం. ఎన్నికల్లో ఆ పార్టీలకు ఓటు వేయొద్దని ప్రచారం చేస్తాం. నామినేషన్ షెడ్యూల్ ప్రజల మీద దౌర్జన్యం. 28న నోటిఫికేషన్. 29 నుంచే నామినేషన్లు. అదే సమయంలో సమ్మక్క సారలమ్మ జాతర. తెలంగాణ జనాభాలో మూడో వంతు అక్కడే ఉంటుంది. ఇదేనా ప్రజాపాలన?. జాతర చేసుకునే హక్కు కూడా ప్రజలకు లేదా?. జనరల్ సీట్లలో బీసీల పోరాటం. ప్రతి జనరల్ స్థానంలో బీసీలు తప్పకుండా నామినేషన్ వేయాలి. ఓసీలకు వాకోవర్ ఇవ్వొద్దు. ఎక్కడ బీసీలు నిలబడతారో అక్కడ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కలిసి ఓటేయాలి. బహుజన ఐక్యతే మా బలం. చెన్నూరు మునిసిపాలిటీలో బీసీ మహిళా రిజర్వేషన్ స్థానాన్ని నకిలీ బీసీ సర్టిఫికెట్‌తో కొట్టేయాలని ప్రయత్నించారు. బెదిరింపులు వస్తే మాకు ఫోన్ చేయండి.
బీసీ ఐక్యవేదిక మీ వెంటే ఉంటుంది. కులగణనపై కేంద్ర ప్రభుత్వ మహా మోసం చేసింది. బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు కులగణన చేస్తామన్నారు. అధికారంలోకి రాగానే మౌనం పాటిస్తున్నారు. 2011లో చేయాల్సిన కులగణనను సోషియో ఎకనామిక్ సర్వేగా మార్చి 5000 కోట్లు ఖర్చు పెట్టి చెత్తకుప్పలో వేశారు. ఇప్పుడు 2024 హౌస్ లిస్టింగ్ నోటిఫికేషన్‌లో SC/ST అడుగుతున్నారు. BCని ఉద్దేశపూర్వకంగా తీసేశారు. ఇది స్పష్టమైన కుట్ర. బీసీ నిధుల దోపిడీ. తెలంగాణ నిజాలు.. 12 ఏళ్లలో 28 లక్షల కోట్ల ఖర్చు. బీసీలకు ఇచ్చింది కేవలం 1% మాత్రమే. 68 వేల కోట్లు కేటాయిస్తే ఖర్చు పెట్టింది 28 వేల కోట్లు మాత్రమే. మిగిలిన డబ్బు ప్రాజెక్టుల పేరుతో దోపిడి. కమిషన్ల కోసం ప్రాజెక్టులు. బీసీలకు ఎండబెట్టడం. బీసీలు ఇక మౌనంగా ఉండరు. రిజర్వేషన్లు, కులగణన, నిధులు లేకపోతే రాజకీయంగా తగిన బుద్ధి చెబుతాం’ అని అన్నారు.
ఈ సమావేశంలో బైరు శేఖర్ గంగపుత్ర, అంబాల నారాయణ గౌడ్, చెన్ను శ్రీకాంత్, దామోదర్ గౌడ్, నాగభూషణం, గోలి యాదగిరి రజక, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
