రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వండి
హైదరాబాద్ ఇందిరా పార్క్‌లో మహాధర్నా
హైదరాబాద్: 2024 మార్చి నుంచి 2025 అక్టోబర్ వరకు రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు(Retired Government Employees), ఉపాధ్యాయులకు (Teachers) బకాయిలు చెల్లించాలని పలువురు కోరారు. ఈ మేరకు వారు ఇవాళ హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌లో మహాధర్నా (MahaDharna) నిర్వహించారు. ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది.
మాజీ ఎమ్మెల్సీలు కోదండరాం(KodandaRam), పాతూరి సుధాకర్ రెడ్డి ప్రారంభించారు. సామాజిక కార్యకర్త బక్క జడ్సన్(Bakka Judson), జాతీయ పెన్షనర్ల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి జి.పూర్ణచంద్రరావు, చైర్మన్ లక్ష్మయ్య, తులసి సత్యనారాయణ, ఎంవీ నరసింగరావు, బకాయిల సాధన సమితి రాష్ట్ర నాయకులు కోహెడ చంద్రమౌళి, ధర్మేంద్ర, సత్యనారాయణ, ఉమ్మడి వరంగల్ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు కందుకూరి దేవదాసు తదితరులు పాల్గొన్నారు.

బకాయిలు సకాలంలో రాకపోవడంతో బ్యాంక్ రుణాలకు ఈఎంఐలు కట్టలేక, పిల్లల పెళ్లిళ్లు చేయలేక, చదువులు మధ్యలో ఆగిపోయి అవమాన భారంతో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. మరికొందరు వృద్ధాప్యంలో అనేక రకరకాల రుగ్మతలతో ఆసుపత్రుల పాలై ఖర్చులు భరించలేక నానా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కొందరు రుగ్మతలు వికటించి అసువులు బాసినట్లు తెలిపారు.
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 26 మంది పెన్షనర్లు చనిపోయారని వెల్లడించారు. రిటైర్ అయిన 14 వేల మందిలో దాదాపు వెయ్యి మందికి హైకోర్టు ఉత్తర్వులు, వ్యక్తిగత పరిచయాలు, ప్రయత్నాలతో బకాయిలు వచ్చాయని పేర్కొన్నారు. ఇంకా 13 వేల మందికి రావాల్సి ఉందని అన్నారు. ఒక్కొక్కరికి 35 లక్షల నుంచి 75 లక్షల వరకు బకాయి ఉందని, ఒక్కొక్కరికి 50 లక్షల చొప్పున 13 వేల మందికి రూ.6500 కోట్లు దాటవని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2 వేల మంది పెన్షనర్లు పాల్గొన్నారు.
