Homeసాహిత్యంLife | నిన్న - నేడు - రేపు

Life | నిన్న – నేడు – రేపు

  • (భూత – వర్తమాన – భవిష్యత్తు కాలాలు)

నిన్న…ఆశల పరిమళమై పూతగా పుట్టాను,
కలల తాకిడితో పిందెనయ్యాను,
కాలం ఒడిలో కాయగా ఎదిగాను
అందాలరూపమై ఆనందాలతావునై వెలిగిపోయాను.

Yesterday Today Tomorrow Life Reflection

నేడు… అనుభవాల మాధుర్యంతో పండిపోయాను,
ఆశల అధికభారంతో పుచ్చిపోయాను,
కోరికల తీరకపోవటంతో దిగులుపడ్డాను.
కాలం అద్దంలో నా రూపం చూసి కుమిలిపోయాను.

- Advertisement -

రేపు… జ్ఞాపకాల దొంతరలై రాలిపోతాను,
గర్వాల పొరల్ని విడిచి కుళ్లిపోతాను,
దేహాన్ని చాలించి మట్టిలో కలుస్తాను,
మరొక పూతకు మూలమైపోతాను.

నేను రాలిన చోటు శూన్యం కాదు
అక్కడే ఒక విత్తనం ఊపిరి పీల్చుకుంటుంది,
నేను కరిగిన మట్టిలో చీకటి ఉండదు
రేపటి వెలుగు మూలాలు వేసుకుంటుంది.

నేను లేనిక్షణమే ప్రకృతి ప్రతిచర్య తీసుకుంటుంది
రాతలు కూర్చి, చరిత్రపుటలకు ఎక్కిస్తుంది.
కాలం నన్ను తుడిచినా, అక్షరాలు నన్ను నిలుపుతాయి
నాశనమైనా నన్ను చిరకాలం కొనసాగిస్తాయి.

  • గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
- Advertisement -
RELATED ARTICLES

Latest News