- సంచలన విషయాలు వెల్లడించిన మాజీ ఎఫ్బీఐ ఏజెంట్..Dawood Ibrahim
- కరాచీలోని క్లిష్టం ప్రాంతంలో నివసిస్తున్న దావూద్..
అండర్‌వరల్డ్ డాన్, గ్లోబల్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం (Dawood Ibrahim) పాకిస్థాన్‌లోనే ఉన్నాడంటూ వస్తున్న వార్తలకు బలం చేకూర్చేలా ఓ మాజీ ఎఫ్బీఐ ఏజెంట్ సంచలన విషయాలు వెల్లడించారు. దావూద్ నెట్‌వర్క్‌లోకి తాను చొరబడ్డానని చెప్పుకుంటున్న పాకిస్థాన్ సంతతికి చెందిన కమ్రాన్ ఫరీదీ, ‘ఆజ్ తక్’ రేడియోకు ఇచ్చిన పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో దావూద్ జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన అంశాలను బయటపెట్టారు. దావూద్ ఇప్పటికీ కరాచీలోని క్లిఫ్టన్ ప్రాంతంలోనే చురుగ్గా ఉన్నాడని, భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో తన నివాసాన్ని మార్చలేదని స్పష్టం చేశారు. ఫరీదీ కథనం ప్రకారం.. దావూద్‌కు పాకిస్థాన్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ (ఎస్ఎస్‌జీ)కు చెందిన 35 నుంచి 45 మంది కమాండోలు ఆటోమేటిక్ ఆయుధాలతో నిరంతరం భద్రత కల్పిస్తున్నారు. ఈ భద్రతా వ్యవహారాలను ఛోటా షకీల్ పర్యవేక్షిస్తాడని, ప్రతి శుక్రవారం ఐఎస్ఐ ప్రధాన కార్యాలయానికి వెళ్లి నివేదిక సమర్పిస్తాడని ఫరీదీ ఆరోపించారు.
దావూద్, ఛోటా షకీల్ ఇద్దరూ దుబాయ్ నుంచి దిగుమతి చేసుకున్న ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో ప్రయాణిస్తారని, ఈ కార్లు బాంబులు, రాకెట్లు, స్నైపర్ దాడులను కూడా తట్టుకోగలవని వివరించారు. పాకిస్థాన్‌లో దావూద్‌ను ‘ఐఎస్ఐ అతిథి’గా చూస్తారని, లష్కరే తోయిబా, హఫీజ్ సయీద్‌లతో అతనికి వ్యాపార సంబంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
