Sunday, June 14, 2026
HomeసినిమాVD | ప్రతిభ గల పేద విద్యార్థులకు స్కాలర్ షిప్స్

VD | ప్రతిభ గల పేద విద్యార్థులకు స్కాలర్ షిప్స్

  • సొంత ఊరికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో విజయ్ దేవరకొండ
  • అచ్చంపేట డివిజన్ లోని 45 ప్రభుత్వ పాఠశాలల 180 మంది మెరిట్ స్టూడెంట్స్ కు స్కాలర్ షిప్స్ అందజేత
  • 9,10వ తరగతుల్లో ఫస్ట్, సెకండ్ ర్యాంకర్స్ కు ఉపకార వేతనం అందించిన విజయ్ దేవరకొండ
  • ఏటా ఈ స్కాలర్ షిప్స్ అందిస్తాం, తెలంగాణ వ్యాప్తంగా ప్రతిభ గల పేద విద్యార్థులకు అండగా నిలవాలనేది నా కల
  • విజయ్ దేవరకొండ

హీరో విజయ్ దేవరకొండ తన సొంతూరికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రశ్మిక మందన్నతో వివాహం అనంతరం తన సొంతూరు నాగర్ కర్నూలు జిల్లాలోని బల్మూరు మండలంలో ఉన్న తుమ్మన్ పేటకు సతీసమేతంగా వెళ్లిన విజయ్ అక్కడ రిసెప్షన్ జరుపుకున్నారు. అదే సందర్భంలో అచ్చంపేట డివిజన్ లో ఉన్న 45 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 9, 10వ తరగతి మెరిట్ విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందిస్తామని ప్రకటించారు.

ఆ మాటను నిలబెట్టుకుంటూ ఈ రోజు అచ్చంపేట డివిజన్ లోని 9, 10వ తరగతిలో ప్రతిభ కనబర్చి ఫస్ట్, సెకండ్ ర్యాంక్స్ సాధించిన 180 మంది పేద మెరిట్ విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో రశ్మిక మందన్న, విజయ్ దేవరకొండ మాతృమూర్తి మాధవి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, జిల్లా విద్యాధికారి రమేష్, ఇతర విద్యాశాఖ అధికారులు, స్థానిక నాయకులు, విద్యార్థినీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో

- Advertisement -

అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ – జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా విజయ్ దేవరకొండ తన సొంత ఊరును మర్చిపోలేదు. అది ఆయన గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం. ఆయన పేరెంట్స్ గోవర్థన్ , మాధవి గారు కూడా సొంతూరును ఎంతో ప్రేమిస్తారు. విజయ్ మన అచ్చంపేట వాసి కావడం మనందరికీ గర్వకారణం. ఆయన ఇండస్ట్రీలో ఇంకా గొప్ప స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నా.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారంతా పేద విద్యార్థులే. వారికి ది దేవరకొండ ఫౌండేషన్ ద్వారా స్కాలర్ షిప్స్ ఇవ్వడం అభినందనీయం. పిల్లల విద్య కోసం ఎంత చేసినా తక్కువే. ఏటా ఈ కార్యక్రమంలే చేస్తామని విజయ్ చెప్పడం సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రశ్మిక గారికి నా అభినందనలు తెలియజేస్తున్నా. ఈ విద్యార్థినీ విద్యార్థులంతా జీవితంలో గొప్ప స్థాయికి వెళ్లాలి. అన్నారు.

హీరోయిన్ రశ్మిక మందన్న మాట్లాడుతూ – ది దేవరకొండ ఫౌండేషన్ తరుపున పేద మెరిట్ స్టూడెంట్స్ కు స్కాలర్ షిప్స్ ఇవ్వాలని అనుకున్నప్పుడు ఫస్ట్ మామయ్య పుట్టినఊరు తుమ్మన్ పేట్, అచ్చంపేటలోనే చేయాలని అనుకున్నాం. ఇక్కడ ఇంతమంది స్టూడెంట్స్ ను చూస్తుంటే హ్యాపీగా ఉంది. నేను మీ క్లాస్ చదివేప్పుడు మీఅంత మెరిట్ స్టూడెంట్ ని కాదు.

చదువులో నన్ను మీరు దాటేశారు. ఎంతో కష్టపడి చదివి ఫస్ట్, సెకండ్ ర్యాంక్స్ తెచ్చుకుని మీ పేరెంట్స్, టీచర్స్ గర్వపడేలా చేశారు. జీవితంలో కొన్నిసార్లు గెలుస్తాం, మరికొన్నిసార్లు ఓడిపోతాం. కానీ ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటాం. మీరు మీ టీచర్స్ నుండి నేర్చుకోండి, మీ పేరెంట్స్ కు రెస్పెక్ట్ ఇవ్వండి. మీ జీవితాల్లో గొప్పవాళ్లుగా ఎదగండి.

విజయ్ మాతృమూర్తి మాధవి మాట్లాడుతూ – మాకు సొంత ఊరి మీద ప్రేమతో పాటు పిల్లల మీద ఉన్న ప్రేమతో ఈ మంచి కార్యక్రమం చేపట్టాం. పిల్లలకు ఫీజులు చెల్లించడం ఎంత కష్టమో మాకు తెలుసు. పిల్లలు తమ తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివిస్తున్నారో తెలుసుకోవాలి. అలాగే పిల్లల కలల్ని నిజం చేసేలా తల్లిదండ్రులు ప్రయత్నించాలి. కష్టపడితే జీవితంలో తప్పకుండా ఫలితం ఉంటుంది. పిల్లలు మీరంతా డ్యూటీ, డిసిప్లెయిన్, డివోషన్, డెడికేషన్, డిటెర్మినేషన్…ఈ ఐదు డి లు మన జీవితంలో పాటించాలి. జీవితంలో గొప్ప వాళ్లుగా ఎదగాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – 9,10వ తరగతిలో ఫస్ట్, సెకండ్ ర్యాంక్స్ సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు నా అభినందనలు. మీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు, పురస్కరించుకునేందుకు ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎమ్మెల్యే వంశీకృష్ణగారు, జిల్లా విద్యాశాఖాధికారుల సహకారం వల్లే ఈ కార్యక్రమం సక్సెస్ ఫుల్ గా చేయగలుగుతున్నాం. మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం కంటే ఆ మార్కులు సాధించేందుకు పడిన శ్రమ, పెట్టిన ఏకాగ్రత చాలా గొప్పవి. మీరు ఫోకస్ గా, డిసిప్లిన్ గా ఉండి ప్రయత్నించడం వల్లే ఫస్ట్, సెకండ్ ర్యాంక్స్ సాధించగలిగారు.

ఒక్కోసారి మార్కులు తక్కువ రావొచ్చు, ఎక్కువ రావొచ్చు కానీ జీవితంలో ఫోకస్, క్రమశిక్షణ చాలా ముఖ్యం. అవి ఉంటే ఏ రంగంలో అయినా గొప్ప స్థాయికి వెళ్తాం. నేను, రశ్మిక స్టూడెంట్ లైఫ్ లో ర్యాంకర్స్ కాదు. మీ విజయాన్ని సెలబ్రేట్ చేయడానికి మేమంతా ఇక్కడికి వచ్చాం. ఈసారి రిజల్ట్స్ లో నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణలో సెకండ్ ప్లేస్ లో నిలిచిందని డీయీవో రమేష్ గారు చెప్పడం హ్యాపీగా ఉంది. నాగర్ కర్నూలు టీచర్స్ అందరికీ ఈ క్రెడిట్ దక్కుతుంది.

పిల్లల జీవితాల్లో టీచర్స్, తల్లిదండ్రుల పాత్ర చాలా గొప్పది. పేరెంట్స్ ఎలా ప్రవర్తిస్తే పిల్లలు అలా నేర్చుకుంటారు. మీరు గొప్ప వ్యాల్యూస్ నేర్పిస్తే వాళ్లు గొప్పగా ఎదుగుతారు. నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటే పుట్టపర్తి స్కూల్లోని మంచి వాతావరణం. మా ఇంట్లో పేరెంట్స్ నేర్పించిన మంచి నడవడికే కారణం. మా నాన్న అమ్మ ఈ ఊరితో పెంచుకున్న అనుబంధం వల్లే నేను ఈ రోజు ఈ ఛారిటీ కార్యక్రమం చేయగలుగుతున్నా.

మీ అందరి జీవితాల్లో నేనూ ఒక ముఖ్య భాగం కావాలనే ఈ స్కాలర్ షిప్స్ కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పుడు అచ్చంపేటలో స్టార్ట్ చేశాం, నెక్ట్స్ నాగర్ కర్నూల్ లో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా పేద మెరిట్ విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందించాలని అనుకుంటున్నాం. ఇది మా కల. ఈ కార్యక్రమం చూసి నెక్ట్స్ ఇయర్ కూడా పిల్లలు విజయ్ అన్న వస్తాడు, స్కాలర్ షిప్స్ ఇస్తాడు అనే ఉత్సాహం కలిగించాలనే ప్రయత్నం చేస్తున్నాం.

ఈ ఛారిటీ కార్యక్రమం నిజమైన అర్హులకు మాత్రమే వెళ్లేలా చూడాలని నేను విద్యాశాఖ అధికారులను, టీచర్స్ ను రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది మిస్ యూజ్ అయితే నేను చాలా బాధపడతా. నాతో పాటు టీచర్స్ అంతా ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమవుతోంది. విద్యార్థులందరికీ గుడ్ లక్ చెబుతున్నా. బాగా చదువుకోండి. విజేతలైన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News