పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం వెల్లడి
100 లేదా 8712670759 నంబర్‌లకు కాల్ చేయాలని సూచన
కరీంనగర్: మహిళలు, యువతులు, బాలికల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని పోలీస్ కమిషనర్(Commissioner of Police-CP) గౌష్ ఆలం(Gaush Alam) చెప్పారు. ఆకతాయిలు(Brats), ఇతర వేధింపుల(Harassment)తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు ఏమాత్రం భయపడకుండా పోలీసు(Police)లకు ఫిర్యాదు(Complaint) చేయాలని సూచించారు. జిల్లాలో మహిళల భద్రత కోసం షీటీమ్స్‌తోపాటు యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ టీం(Anti-Women Trafficking Team)లు నిరంతరం పనిచేస్తున్నాయని తెలిపారు. అన్యాయానికి గురైనవారు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కళాశాలలు, పాఠశాలల్లో ర్యాగింగ్(Ragging), ఈవ్ టీజింగ్(Eve Teasing)లకు గురైనా, పని చేసే ప్రదేశాల్లో వేధింపులు ఎదురైనా లేదా బాలికలపై ఎవరైనా లైంగిక వేధింపులకు పాల్పడినా వెంటనే షీ టీమ్ పోలీసులను ఆశ్రయించాలని కోరారు. వారికి సత్వర న్యాయం చేకూరుస్తామని భరోసా ఇచ్చారు. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల వినియోగంలో మహిళలు తప్పనిసరిగా వ్యక్తిగత భద్రతకు సంబంధించిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నేరుగా పోలీసులను సంప్రదించలేనివారు తమ వివరాలు గోప్యంగా ఉండేలా డయల్ 100కు లేదా 8712670759 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని చెప్పారు. ఒంటరిగా ప్రయాణిస్తున్నవారు భద్రత కోసం టీ సేఫ్ యాప్‌ను తప్పకుండా వాడాలని అన్నారు.
