Homeకరీంనగర్Choppadandi | చొప్పదండి యువతకు నైపుణ్య కేంద్రం అవసరం

Choppadandi | చొప్పదండి యువతకు నైపుణ్య కేంద్రం అవసరం

  • బీసీ మహిళా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షురాలు గుంటి స్వరూప

చొప్పదండి మండలంలోని వెనుకబడిన తరగతుల (బీసీ) యువతీ, యువకులకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ మహిళా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షురాలు గుంటి స్వరూప కోరారు. బుధవారం కరీంనగర్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, చొప్పదండి మండల ప్రజాప్రతినిధులు, యువజన సంఘాల తరపున వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా గుంటి స్వరూప మాట్లాడుతూ చొప్పదండి మండలంలో అధిక సంఖ్యలో బీసీ సామాజిక వర్గానికి చెందిన యువత ఉన్నప్పటికీ, సరైన నైపుణ్య శిక్షణ కేంద్రాలు, ఉద్యోగ మార్గదర్శక వ్యవస్థల లేమితో వేలాది మంది నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంత యువతకు కంప్యూటర్ విద్య, సాంకేతిక పరిజ్ఞానం, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ అందించాల్సిన అవసరం ఉందన్నారు.

- Advertisement -
BC Skill Development Center Demand Choppadandi Youth

వినతిపత్రంలో చొప్పదండిలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో బీసీ స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ సెంటర్ను తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కంప్యూటర్, డిజిటల్ నైపుణ్యాలతో పాటు ఆధునిక పరిశ్రమలకు అనుగుణమైన టెక్నికల్ కోర్సుల్లో ఉచిత శిక్షణ అందించాలని కోరారు.మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రత్యేక స్వయం ఉపాధి కోర్సులు నిర్వహించడంతో పాటు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఉచిత కోచింగ్, యువతకు కెరీర్ గైడెన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే స్టార్టప్‌లు, చిన్న వ్యాపారాల స్థాపనపై అవగాహన సదస్సులు నిర్వహించి, నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ పథకాలను చొప్పదండి మండలంలో పూర్తిస్థాయిలో అమలు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గ్రామీణ ప్రాంత యువతకు ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని తెలిపారు. వినతిపత్రంలోని అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల యువజన ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News