- రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు, భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద
ప్రభుత్వం రైతు సంక్షేమంలో భాగంగా రైతుల వద్ద నుండి ఆఖరి గింజ వరకు వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు, భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ మండలం బావురావుపేట గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డి.సి.సి. ప్రతినిధి రఘునాథ్ రెడ్డి, అధికారులతో కలిసి సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం రైతు సంక్షేమంలో భాగంగా అనేక కార్యక్రమాలు చేపడుతుందని, ఈ క్రమంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుల ఖాతాలలో నగదు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరం ఎకరానికి 25 క్వింటాళ్ల ధాన్యం వచ్చేదని, ఈసారి 28 నుండి 32 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందని తెలిపారు. చెన్నూర్, కోటపల్లి ప్రాంతాలలో పంట ఆలస్యంగా వస్తున్నందున జూన్ 15వ తేదీ వరకు కొనుగోలు చేస్తామని తెలిపారు.

2022-23 లో 1 లక్ష 13 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ఈసారి ఇప్పటివరకు 1 లక్ష 27 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, జూన్ 6వ తేదీ వరకు 30 వేల నుండి 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని, మొత్తంగా దాదాపు 1 లక్ష 60 వేల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలిపారు. హమాలీల సమస్యను అధిగమించేందుకు స్థానికంగా హమాలీలను తీసుకొని ధాన్యం ఎగుమతి, దిగుమతులను వేగవంతం చేయడం జరిగిందని తెలిపారు.

లారీలు సమకూర్చడం కొరకు సింగరేణి సంస్థతో మాట్లాడడం జరిగిందని, ఇసుక లారీలను ధాన్యం రవాణాకు మళ్ళించడం జరిగిందని తెలిపారు. కొందరు ఉద్దేశపూర్వకంగా రైతులను ఆందోళన చేపట్టే దిశగా రెచ్చగొడుతున్నారని, పార్టీలకు అతీతంగా రైతుల సంక్షేమం కోసం కలిసి రావాలని తెలిపారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రజా సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, అర్హులైన లబ్ధిదారులకు అందించే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చెన్నూర్ మండలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని, జైపూర్ మండలంలో వచ్చే 3 రోజులలో ధాన్యం ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. పెద్దపల్లి, కరీంనగర్ లలో హమాలీలతో కలిపి 2 గోదాములను ఇచ్చారని, అకాల వర్షాల నేపథ్యంలో రైతులకు నష్టం కలగకుండా ధాన్యం నిల్వ చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని జైపూర్ మండలంలో గల సుముఖ గోదాములోనికి చెన్నూర్ నుండి వచ్చే ధాన్యాన్ని అనుమతించడం జరుగుతుందని తెలిపారు.

చెన్నూర్ నియోజకవర్గ పరిధిలో ఇప్పటివరకు 70 శాతం ధాన్యం ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని, చెన్నూర్, కోటపల్లి మండలాలకు సంబంధించి ధాన్యం ప్రక్రియను 15 రోజులలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. వచ్చే నెల 7వ తేదీ నుండి వర్షాలు వచ్చే అవకాశం ఉందని, ఈలోగా ధాన్యం కొనుగోలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం దాదాపు 10 వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న పంటను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అంతకుముందు జిల్లా కలెక్టర్ చెన్నూరు మండల కేంద్రంలో కొనసాగుతున్న నైపుణ్యాభివృద్ధి కేంద్రం నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
