Thursday, July 2, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంTellapur | నివాస అనుమతులు.. వాణిజ్య నిర్మాణాలు..

Tellapur | నివాస అనుమతులు.. వాణిజ్య నిర్మాణాలు..

  • తెల్లాపూర్‌లో అక్రమ నిర్మాణాలపై ఆరోపణలు..
  • నివాస అనుమతులతో వాణిజ్య భవనాల నిర్మాణం
  • ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలంటూ విమర్శలు..
  • ఫిర్యాదులు చేసినా స్పందన లేదని ఆవేదన..
  • చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న టౌన్ ప్లానింగ్!
  • ప్రేక్షక పాత్రలో డిప్యూటీ కమిషనర్..

పటాన్‌చెరు నియో జకవర్గ పరిధిలోని తెల్లాపూర్ మున్సిపాలిటీలో అక్రమ కట్టడాల పర్వం యథేచ్ఛగా సాగుతోంది. సర్వే నెం.407లో నివాస భవ నాల నిర్మాణానికి అనుమతులు పొంది, నిబంధనలకు విరుద్ధంగా భారీ వాణిజ్య సముదాయాలను నిర్మిస్తున్నా, స్థానిక టౌన్ ప్లానింగ్ విభాగం ఏమీ ఎరగనట్లు వ్యవహరిస్తోంది. “అడిగే వాడు లేకపోతే అడవి పంది ఊరు మీద పడ్డట్టు” అన్న చందంగా, అధికారులు పర్యవేక్షించాల్సిన బాధ్యతను విస్మరించడంతో అక్రమార్కులు యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు.

అధికారుల మౌనం.. అక్రమార్కులకు వరం! : ఆమోదించిన ప్లాన్‌కు, క్షేత్రస్థాయిలో ఉన్న నిర్మాణాలకు ఎక్కడా పొంతన లేదు. అయినప్పటికీ, సంబంధిత అధికారులు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు (ఓ సీ) మంజూరు చేయడం వెనుక ‘పెద్దల’ హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -

చట్టాన్ని కాపాడాల్సిన అధికారులే అవినీతికి పాల్పడుతుండటంతో, “కంచే చేను మేసినట్లు” వ్యవహారం తయారైంది. అక్రమ నిర్మాణాలు బహిరంగంగా కనిపిస్తున్నా, వాటిని అరికట్టడంలో కానీ, జారీ చేసిన సర్టిఫికెట్లను రద్దు చేయడంలో కానీ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు.

ఫిర్యాదు చేసినా శూన్యమే స్పందన! :

ఈ భారీ అక్రమాలపై బాధ్యతాయుత పౌరులు 2025 నవంబర్ 10న స్థానిక మున్సిపల్ కమిషనర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అంది నెలలు గడుస్తున్నా, యంత్రాంగం నుండి కనీస స్పందన లేదు. పైగా, సదరు భవనాల్లో వాణిజ్య కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతుండటం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.

ప్రశ్నార్థకమవుతున్న ప్రభుత్వ నిబంధనలు : నిబంధనలు ఉల్లంఘించిన భవనాలపై చర్యలు తీసుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు? అక్రమాలపై ఇప్పటివరకు ఏ ఒక్క అధికారిపై కూడా విచారణ జరపకపోవడం, క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. చట్టం ముందు అందరూ సమానులేనని చెబుతున్న ప్రభుత్వం, అక్రమాలకు అండగా నిలుస్తున్న అధికారులపై ఎప్పుడు కొరడా ఝుళిపిస్తుందో వేచి చూడాలి.

ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ, అక్రమ కట్టడాలకు ఆజ్యం పోస్తున్న అధికారుల తీరుపై స్థానికులు, ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి, తక్షణమే సదరు ఓసీలను రద్దు చేయాలని మరియు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News