- మార్కొని వైజ్ఞానిక యాత్ర
- రేడియో ఆవిష్కరణ: ప్రపంచ సమాచార విప్లవానికి పునాది
- 1897 జూలై 2…రేడియో కోసం పేటెంట్ పొందిన దినం
1897లో ఇటలీకి చెందిన యువ శాస్త్రవేత్త గూగ్లీమొ మార్కొని లండన్‌లో రేడియో కోసం పేటెంట్ పొందిన ఘట్టం ప్రపంచ సమాచార చరిత్రలో విప్లవాత్మక మలుపు తీసుకు వచ్చింది. వైర్లు లేకుండా దూర ప్రాంతాలకు సంకేతాలను పంప గల సాంకేతికతను విజయ వంతంగా అభివృద్ధి చేయడంలో మార్కొని సుస్పష్టమైన ముందడుగు వేసాడు. అతని ఆవిష్కరణ ఆధునిక టెలికమ్యూనికేషన్‌కు పునాది వేసింది.
మార్కొని 1874లో ఇటలీలో జన్మించి, బాల్యం నుంచే విద్యుత్, మాగ్నెటిజం, తరంగాలపై ఆసక్తి పెంచుకున్నాడు. జర్మన్ శాస్త్రవేత్త హెయిన్‌రిచ్ హెర్ట్జ్ నిర్వహించిన ఎలక్ట్రో మాగ్నెటిక్ తరంగాల ప్రయోగాలపై లోతుగా అధ్యయనం చేసి, 1895లో తన స్వగృహంలో వైర్లను ఉపయోగించకుండా సంకేతాలను ప్రసారం చేసే ప్రయోగాలను ప్రారంభించాడు. ప్రారంభంగా కొన్ని మీటర్ల దూరానికే సంకేతాలను పంపగలిగిన ఈ పరికరాలను మరింత మెరుగుపరిచి, కిలోమీటర్ల దూరాన్ని అధిగమించే స్థాయికి చేర్చాడు.

1897 జూలై 2న బ్రిటిష్ పేటెంట్ కార్యాలయం నుండి అతనికి “వైరులేని టెలిగ్రఫీ వ్యవస్థ”కు పేటెంట్ నంబర్ GB189612039A, మంజూరు చేసింది. అదే ఏడాది బ్రిటన్‌లో ‘ది వైర్‌లెస్ టెలిగ్రాఫ్ అండ్ సిగ్నల్ కంపెనీ’ను స్థాపించాడు. ఇది తరువాత “మార్కొనీస్ వైర్‌లెస్ టెలిగ్రాఫ్ కంపెనీ”గా మారింది. ఇదే సంస్థ ద్వారా మార్కొని తన పరిశోధనలకు మరింత గతి కల్పించాడు.
1901లో మార్కొని అట్లాంటిక్ మహా సాగరాన్ని దాటి తొలిసారిగా ఇంగ్లండ్ నుంచి కెనడా న్యూఫౌండ్లాండ్ వరకు తారంగిక సంకేతాన్ని విజయవంతంగా పంప గలిగాడు. ఈ ఘనత ఆయనకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టింది. 1909లో రేడియో కమ్యూనికేషన్ రంగంలో చేసిన విశేష కృషికి గాను ఆయనకు నోబెల్ ఫిజిక్స్ బహుమతి లభించింది. ఈ పురస్కారాన్ని కార్ల్ ఫెర్డినాండ్ బ్రాన్‌తో కలసి పంచుకున్నాడు.
1912లో టైటానిక్ నౌకా ప్రమాద సమయంలో మార్కొని అభివృద్ధి చేసిన తారంగిక పరికరాల ద్వారానే అత్యవసర సమాచారాన్ని ఇతర నౌకలకు, తీర ప్రాంతాలకు పంప గలిగారు. వందలాది ప్రాణాలను రక్షించడంలో ఈ వ్యవస్థ కీలక పాత్ర పోషించింది. ఈ సంఘటన రేడియో ప్రయోజనాలను ప్రపంచానికి పరిచయం చేసింది.
రేడియో అభివృద్ధి తరువాతి దశల్లో మరింత వేగంగా జరిగింది. 1920లో అమెరికాలో మొట్టమొదటి వాణిజ్య రేడియో ప్రసారాలు ప్రారంభమయ్యాయి. 1923లో బ్రిటన్‌లో బీబీసీ (BBC) ఏర్పాటు అయ్యింది. 1936 నాటికి నాటకాలు, సంగీత ప్రదర్శనలతో రేడియో వినోద వేదికగా మారింది. ప్రపంచ యుద్ధాల సమయంలో రేడియోను రాజకీయ ప్రచారాలకు, మానవ హక్కుల ప్రచారానికి వేదికగా వినియోగించారు.
భారతదేశంలో 1927లో మొదటి రేడియో ప్రసార కేంద్రం ముంబయిలో స్థాపించ బడింది. 1936లో ఆకాశవాణి ఏర్పడి, దేశవ్యాప్తంగా సమాచారాన్ని విస్తరించేందుకు పాలు పంచుకుంది. 1957లో ప్రారంభమైన ‘వివిధ భారతి’తో పాటలు, వినోద కార్యక్రమాలు ప్రజల మనసులు గెలుచుకున్నాయి. 2001 తర్వాత ప్రైవేట్ ఎఫ్.ఎం. స్టేషన్లు రంగంలోకి ప్రవేశించి, రేడియో వినికిడి అనుభవాన్ని ఆధునికీకరించాయి.

నేటి డిజిటల్ యుగంలోనూ రేడియో తన ప్రాధాన్యతను కోల్పోలేదు. మొబైల్ ఫోన్లు, కారు స్టీరియోలు, ఆన్‌లైన్ రేడియో యాప్‌లు రేడియో వినికిడికి సులభతరం చేశాయి. నగరాల నుంచే కాదు, గ్రామీణ ప్రాంతాల వరకు కూడా ఇది సముచిత సమాచారం, వినోదం, మరియు సామాజిక అవగాహన కార్యక్రమాల వేదికగా కొనసాగుతోంది.
గూగ్లీమొ మార్కొని 1897లో సాధించిన విజయం కేవలం ఒక శాస్త్రీయ ఘట్టంగా కాక, మానవ సంబంధాల వికాసానికి, ప్రపంచీకరణకు, సమాచార విప్లవానికి పునాది వేసింది. రేడియో రూపంలో ప్రపంచానికి అందించిన సేవ ఆయనను శాశ్వతంగా శాస్త్ర చరిత్రలో నిలిపింది. అతని ఆవిష్కరణలతో ప్రారంభమైన ప్రయాణం ఈ రోజు డిజిటల్ కమ్యూనికేషన్ వరకూ విస్తరించి, సాంకేతిక విజ్ఞాన పరిణామంలో ఒక గాఢమైన అధ్యాయంగా నిలిచి పోయింది.
