పొద్దున్నే నిద్ర లేవగానే లోకం చూడరు ఎవరూ, అరచేతిలో ఫోను ఉంటే చాలు, ఇంక ఏమీ పట్టవు వీరికి! పక్కవాడి కష్టాన్ని పలకరించే తీరిక లేదు గానీ, ఫేస్బుక్ లైవ్లో సానుభూతి మాత్రం ఉప్పొంగిపోతుంది..రోడ్డు మీద గుంతలు ఉంటే ఎవరూ పట్టించుకోరు, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే దేశం మారిపోతుందనే ధీమా..!
చదువుకున్న వాళ్లంతా డిగ్రీలు పట్టుకుని తిరుగుతుంటే, రీల్స్ చేసే వాళ్లు మాత్రం కోట్లు సంపాదిస్తూ మురిసిపోతున్నారు. ధరలు ఆకాశాన్ని అంటుతున్నా నోరు మెదపరు జనం, ఉచిత పథకాలు వస్తే చాలు. అది అప్పు అని కూడా అడగరు! పర్యావరణం గురించి పదే పదే ఉపన్యాసాలు ఇస్తారు, కానీ దానికి హాని కలిగే పనులు చేయకుండా ఒక్క క్షణం కూడా గడపలేరు వీరు.. నీతి మాటలు చెప్పడానికి వేదికల మీద క్యూ కడతారు, ఆచరణ దగ్గరికి వచ్చేసరికి దొడ్డి దారులు వెతుకుతారు! నిజం నిప్పులాంటిదని అందరికీ తెలిసిన విషయమే, అందుకే ఆ నిప్పు తగలకుండా అబద్ధాల మేడల్లో దాక్కుంటున్నారు..
- ఖాన్ సాబ్
