- తెలంగాణాలో వెలసిన వినాయకుడు..
- హన్మకొండ జిల్లా, ఖాజీపేట రేల్వే ప్రాంగణంలో మందిరం..
ప్రారంభించిన పనుల్లో విఘ్నాలు తొలగించి విజయాలు ప్రసాదించే గణనాథునికి నమస్కరించకుండా ఏ పని కూడా ప్రారంభించకూడదని శాస్త్రం చెబుతోంది. భక్తవరదుడిగా పేరొందిన గణనాథుని హేరంబుడని, విజయ గణపతి అని, విద్యా గణపతి అని, లంబోదరుడని రకరకాల పేర్లతో పిలుచుకుంటూ ఉంటాము. వినాయకుని ఆలయం లేని ఊరంటూ ఉండదు. అనేక ప్రాంతాల్లో వినాయకుడు స్వయంభువుగా వెలసి పూజలందుకుంటున్నాడు. మాములుగా రాతి విగ్రహ రూపంలో కాకుండా చెట్టు వేరులోనే వినాయకుడు వెలసిన ఓ మహిమాన్విత క్షేత్రం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
వినాయకునికి ప్రీతికరమైనది అర్క పత్రం అంటే జిల్లేడు ఆకు. అందుకే వినాయక చవితి పూజలో ‘అర్క పత్రం సమర్పయామి’ అంటూ పత్రి పూజ చేస్తాం. ఈ జిల్లేడులో తెల్ల జిల్లేడు చాలా విశిష్టమైనది. దీనినే శ్వేతార్కం అంటారు. పురాణాల ప్రకారం తెల్ల జిల్లేడు సాక్షాత్తు గణపతి స్వరూపమని అంటారు. అలాంటిది ఆ చెట్టు మూలమే గణపతి ఆకృతిలో ఏర్పడడం విశేషం. అలాంటి విశిష్టమైన గణపతి ఆలయం ఎక్కడుంది? ఆ విశేషాలేమిటో చూద్దాం.
తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా, కాజీపేటలో రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఉన్న వెలసిన వినాయక దేవాలయం శ్వేతార్క గణపతి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ గణపతికి ప్రతిరూపంగా భావిస్తున్న వంద సంవత్సరాలు దాటిన శ్వేతార్కం అంటే తెల్ల జిల్లేడు చెట్టు వేరు గణపతి ఆకృతిలో ఉండడం వల్ల ఈ గణపతికి శ్వేతార్క గణపతి అనే పేరు వచ్చింది.
