Homeభక్తిBonalu | బోనాల పండుగ విశిష్టత..

Bonalu | బోనాల పండుగ విశిష్టత..

  • తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబం..
  • ఆషాఢ మాసం ఆరంభం కాగానే జాతర మొదలు..

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ బోనాలు పండుగ. ఆషాఢ మాసం ఆరంభం కాగానే తెలంగాణలోని నగరాల నుంచి, మారుమూల గ్రామాల వరకు జాతర కళతో నిండిపోతాయి. పల్లెల్లో, పట్టణాల్లో వయో లింగ భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, ఆనందంగా జరుపుకునే బోనాలు జాతర గురించిన ప్రత్యేక విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

బోనాలు తెలంగాణ రాష్ట్రం అత్యంత వైభవంగా జరుపుకునే సాంస్కృతిక జాతర. ఆషాఢ మాసంలో మహంకాళి, పోచమ్మ, ఎల్లమ్మ, రేణుక ఎల్లమ్మ, గండి మైసమ్మ మొదలైన గ్రామ దేవతలకు భక్తిశ్రద్ధలతో బోనం అంటే నైవేద్యం సమర్పించి, అంటువ్యాధులు రాకుండా కాపాడమని అమ్మవారిని ప్రార్థిస్తారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన బోనాలు జాతర తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ‘భోజనం’ అనే పదానికి మరో రూపమే బోనం. ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో ప్రబలిన ప్లేగు మహమ్మారిని అమ్మవారు పారద్రోలిందంట! అందుకు కృతజ్ఞతగా అమ్మవారికి బోనాలు సమర్పించే ఆచారం అనాదిగా కొనసాగుతోంది.

- Advertisement -

సాధారణంగా తెలుగువారి సంప్రదాయం ప్రకారం కొత్తగా పెళ్లైన అమ్మాయి ఆషాఢ మాసంలో పుట్టింటికి రావడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే నిత్య పెళ్లికూతురైన అమ్మవారు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో పుట్టింటికి వస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే ఈ మాసం మొత్తం పుట్టింటికి వచ్చే శక్తి స్వరూపిణికి ప్రేమతో, భక్తి శ్రద్ధలతో బోనంతో పాటు సారెను కూడా సమర్పించడం వలన ఆ తల్లి తన చల్లని చూపులతో అనుగ్రహిస్తుందని విశ్వాసం. అంతేకాదు అమ్మవారికి బోనాలు సమర్పించడం వలన ఈ కాలంలో ప్రబలే అంటువ్యాధుల నుంచి ఆ జగదాంబిక రక్షించి ఆయురారోగ్యాలు ప్రసాదిస్తుందని విశ్వాసం.

తెలంగాణ ప్రజలు అత్యంత భక్తి విశ్వాసాలతో జరుపుకునే బోనాలు వేడుకలు తొలుత గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయంలో మొదలవుతాయి. అటు తర్వాత వరుసగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో, లాల్ దర్వాజా సింహవాహిని ఆలయాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనేక అమ్మవారి ఆలయాల్లో ఘనంగా జరుగుతాయి. చివరగా గోల్కొండ కోటలోనే ఈ ఉత్సవాలు ముగుస్తాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News