- తీవ్ర దుమారం రేపుతున్న కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..
- తీవ్రంగా స్పందించిన బీజేపీ శ్రేణులు..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఆరెస్సెస్ సంస్థ ‘దేశద్రోహులు’ అని ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలకు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రజలకు సూచించడం తీవ్ర దుమారం రేపింది. ఆర్థిక సంక్షోభం వల్ల దేశ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రధాని మాత్రం ఇటలీలో చాక్లెట్లు పంచుకుంటూ బిజీగా ఉన్నారని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. పొదుపు కోసం పిలుపునిచ్చిన ప్రధానియే వాటిని పాటించడం లేదని విమర్శించారు. రాహల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది.
రాహుల్ గాంధీ వాడిన భాష పాకిస్థాన్, ఆ దేశానికి మద్దతిచ్చే ఉగ్రవాదుల భాషను పోలి ఉందని బీజేపీ మండిపడింది. ఆయన వ్యాఖ్యల వెనుక పాక్ హస్తం ఉందని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఆరోపించారు. అక్కడి నేతలు చెప్పినట్లుగానే రాహుల్ గాంధీ మాట్లాడుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రిని అవమానించడం అతడికి అలవాటుగా మారిందని అన్నారు.
రాహుల్ గాంధీ భాష పాకిస్థాన్ నాయకుల్లా ఉందని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రపంచానికి తెలుసని, రాహుల్ గాంధీ నుంచి ప్రశంసలు అవసరం లేదని విమర్శించారు. దేశంలో అశాంతిని రగుల్చాలని రాహుల్ గాంధీ కోరుకుంటున్నారని అన్నారు. కానీ మోదీ, అమిత్ షాలకు ప్రజలు అండగా ఉన్నారని అన్నారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ మరిచిపోకూడదని వ్యాఖ్యానించారు.
