- తప్పుదోవ పట్టించడం సరికాదు..
- తీవ్ర విమర్శలు చేసిన ప్రధాని మోడీ..
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ఆ అంశంపై విపక్షాలు ప్రజల్ని భయాందోళలనలకు గురి చేశాయని, ప్రజల్ని తప్పుదోవ పట్టించారని ప్రధాని మోడీ అన్నారు. రాజకీయ క్రీడలు ఆడారని విమర్శించారు. కానీ చెడు ప్రయత్నాలు చేసిన వాళ్లు సక్సెస్ కాలేదన్నారు. చిన్న చిన్న అవరోధాలు తప్ప, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంధన సరఫరాలో పెద్దగా సవాళ్లు ఎదురు కాలేదని మోడీ అన్నారు. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో.. వివిధ ఇంధన కంపెనీలు డీజిల్, పెట్రోల్‌పై సుమారు 75 వేల కోట్ల నష్టాన్ని చవిచూశాయని అన్నారు.
అయితే ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరించిందన్నారు. లీటరుపై ఎక్సైజ్ సుంకాన్ని రూ.10 తగ్గించినట్లు మోదీ తెలిపారు. ప్రజలపై ఎటువంటి అదనపు భారం పడకుండా చూశామన్నారు. ఇవాళ రాజస్థాన్‌లోని బలోత్రాలో పెట్రోకెమికల్ రిఫైరీని ప్రారంభించిన తర్వాత మోడీ ప్రసంగించారు. పశ్చిమాసియా యుద్ధ సమయంలో..వివిధ దేశాలతో ఉన్న స్నేహసంబంధాలు భారత్‌కు కలిసి వచ్చినట్లు ప్రధాని మోదీ తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభానికి ముందు కేవలం 26 దేశాల నుంచి మాత్రమే భారత్ ఇంధనాన్ని దిగుమతి చేసుకునేదని, కానీ సంక్షోభ సమయంలో భారత్ తన దౌత్య బలాన్ని ప్రదర్శించిందని, వార్ జరుగుతున్నా..
సుమారు 40 దేశాల నుంచి భారత్ ఇంధనాన్ని దిగుమతి చేసుకున్నట్లు చెప్పారు. దేశ ప్రయోజనాలు, ప్రజల సంక్షేమమే కీలకమన్న విషయాన్ని ప్రభుత్వం చాటి చెప్పిందన్నారు. తీవ్రమైన ఇంధన సంక్షోభం ఉన్నా.. అమితమైన అనుభవం వల్ల ఆ సంక్షోభం నుంచి బయటపడినట్లు ఆయన చెప్పారు.గత దశాబ్ధ కాలం నుంచి విజయవంతమైన విధానాల అమలు ద్వారా ఆ సంక్షోభ పరిస్థితి నుంచి గట్టెక్కినట్లు ఆయన తెలిపారు.
