బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్ధాపక అధ్యక్షుడు దాసు సురేశ్
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(JubileeHills Bye Election)లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) నుంచి బరిలో నిలిచిన బీసీ నాయకుడు (Bc Leader) నవీన్ యాదవ్ గెలుపే బీసీల భవిష్యత్ రాజకీయ ఎదుగుదలకు మలుపు అవుతుందని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్ధాపక అధ్యక్షుడు దాసు సురేశ్ (Dasu Suresh) పేర్కొన్నారు. ఇందుకోసం అన్ని బీసీ కులాల నాయకులు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నవీన్ యాదవ్ గెలుపు కోసం స్వచ్చందంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు..
బుధవారం బాగ్‌లింగంపల్లిలోని బీసీ రాజ్యాధికార సమితి కేంద్ర కార్యాలయంలో నవీన్ యాదవ్‌కు మద్దతు కూడగట్టడానికి నిర్వహించిన ఆంతరంగిక సమావేశంలో పలు జిల్లాల బీసీ నాయకులు పాల్గొన్నారు. అన్ని జిల్లాల నుంచి 500 మంది బీసీ రాజ్యాధికార సమితి నాయకులు ప్రచార నిమిత్తం గురువారం నుంచి జూబ్లీహిల్స్‌లోని 7 డివిజన్లకు చేరుకొని ప్రచారం నిర్వహించనున్నారని దాసు సురేశ్ తెలిపారు..
తదనంతరం దాసు సురేశ్ మీడియాతో మాట్లాడుతూ.. అగ్రవర్ణాల అహంకారానికి, బలహీనవర్గాల ఆత్మగౌరవానికి మధ్య జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరుగుతోందని వెల్లడించారు. లక్ష ఓటర్లు ఉన్న ముస్లిం, మెజారిటీ ఓటు బ్యాంకుగా ఉన్న యాదవులు, మున్నూరు కాపులు, గౌడ్స్, పద్మశాలీలు, ముదిరాజ్‌లు, ఎస్సీలు, రజకులు పెద్దఎత్తున తమ ఓటును నవీన్ యాదవ్‌కు వేసి బీసీ బిడ్డను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు..
రాష్ట్రంలో బీసీ ఉద్యమం (Bc Movement) ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న వేళ ఉద్యమాన్ని, బీసీల ఆకాంక్షను గౌరవించి జూబ్లీహిల్స్‌లో బీసీ అభ్యర్థికి కేటాయించిన సీటును గెలిపించుకుంటేనే బీసీల నినాదం, బీసీ ఉద్యమం బలపడుతుందని పేర్కొన్నారు. అసెంబ్లీలో నవీన్ యాదవ్ రూపంలో బీసీల సంఖ్య, ప్రాతినిధ్యం పెరిగితేనే బీసీల హక్కులు, రిజర్వేషన్లు సాధ్యపడతాయన్నారు. బీసీల ఆత్మగౌరవానికి ప్రతీకగా నవీన్ యాదవును గెలిపించుకోవాల్సిన చారిత్రాత్మక అవసరం నేడు రాష్ట్రంలోని ప్రతి బీసీపైనా ఉందని తెలిపారు..
ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గండి వీరేందర్ గౌడ్, యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ మడత కిషోర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వంగ రవి యాదవ్, వివిధ జిల్లాల బీసీ ప్రముఖులు పాల్గొన్నారు.

