ప్రభుత్వ పాఠశాలల్లోని టెన్త్ విద్యార్థుల ఎగ్జామ్ ఫీజు ఇచ్చేందుకు ముందుకొచ్చిన కేంద్ర సహాయ మంత్రి
తన వేతనం నుంచి ఇవ్వాలని బండి సంజయ్ నిర్ణయం
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని జిల్లాల కలెక్టర్లకు లేఖ
కరీంనగర్, నవంబర్ 5 (ఆదాబ్ హైదరాబాద్): కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ (Karimnagar Parliament Constituency) పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో (Government Schools) పదో తరగతి (Tenth) చదువుకునే విద్యార్థులందరికీ (Students) శుభవార్త (Good News). ఈ ఏడాది ఎగ్జామ్ ఫీజు (Exam Fees) చెల్లించేందుకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి (Union Minister of State for Home Affairs) బండి సంజయ్ కుమార్ ముందుకొచ్చారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖ రాశారు. అధికార వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 12,292 మంది విద్యార్థినీవిద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. వీరిలో కరీంనగర్ జిల్లాలో 4847 మంది, సిరిసిల్ల జిల్లాలో 4059 మంది, సిద్దిపేట జిల్లాలో 1118 మంది, జగిత్యాల జిల్లాలో 1135 మంది, హన్మకొండ జిల్లాలో 1133 మంది విద్యార్థులున్నారు. వీరందరి పరీక్ష ఫీజు కలిపితే రూ.15 లక్షలకు పైగా అవుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులంతా దారిద్ర్య రేఖకు దిగువన (BPL) ఉన్నవారే. వారిలో చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు కూలి పని చేసి బతికేటోళ్లే. పిల్లలకు పరీక్ష ఫీజు కూడా చెల్లించే పరిస్థితి వారికి లేదని తెలుసుకున్న బండి సంజయ్ తన నియోజకవర్గ పరిధిలోని విద్యార్థుల ఫీజు మొత్తం చెల్లించాలని నిర్ణయించుకున్నారు. ఆ మొత్తాన్ని తన వేతనం (Salary) నుంచి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖలు పంపారు.

