Thursday, May 14, 2026
Homeమెదక్‌Trafficking | మెదక్ లో మరో ఆడ శిశువు విక్రయం

Trafficking | మెదక్ లో మరో ఆడ శిశువు విక్రయం

  • వారం గడవక ముందే ఘటన
  • మెదక్ కేంద్రంగా వరుస ఘటనలు కలకలం
  • మానవత్వాన్ని మరిచిన దారుణం
  • ఆసుపత్రులపై కొరవడిన పర్యవేక్షణ

మెదక్ జిల్లాలో మరోసారి శిశువు విక్రయ ఘటన వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది. మెదక్ పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో (కేర్ ఆసుపత్రి) నర్సులు అప్పుడే పుట్టిన ఆడ శిశువును తల్లికి తెలియకుండా రూ.1.5 లక్షలకు విక్రయించిన ఘటన సంచలనం సృష్టించింది. వారం రోజుల వ్యవధిలోనే మరో ఆడ శిశువును తల్లిదండ్రులు డబ్బు కోసం విక్రయించిన ఘటన బయటపడటం ఆందోళనకు గురిచేస్తుంది. పసికందులను సైతం డబ్బు కోసం విక్రయించే స్థాయికి పరిస్థితులు దిగజారడం సమాజంలో పెరుగుతున్న నిర్లక్ష్యానికి, దిగజారుతున్న మానవత్వానికి నిదర్శనంగా మారిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మార్చి 27న మెదక్ ప్రభుత్వ మాత శిశు ఆసుపత్రి (ఎంసిహెచ్) ఆస్పత్రిలో కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన ఓ మహిళ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం మధ్యవర్తుల సహకారంతో ఆ శిశువును సిద్దిపేట జిల్లా అలీనగర్‌కు చెందిన దంపతులకు రూ.3 లక్షలకు విక్రయించినట్లు తేలింది. ఈ వ్యవహారం రహస్యంగా సాగినప్పటికీ, సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో పోలీసులు శిశువు విక్రయానికి పాల్పడిన ముఠాను ఛేదించారు.

- Advertisement -

ఈ కేసులో మొత్తం 9 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ ప్రసన్న కుమార్ వెల్లడించారు. కేసు దర్యాప్తులో ఇన్స్పెక్టర్ మహేశ్ కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. నిందితుల నుంచి పలు వివరాలను సేకరిస్తున్నామని, ఈ వ్యవహారానికి మరెవరైనా సంబంధం ఉన్నారా అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.ఇటీవల వరుసగా శిశువుల విక్రయ ఘటనలు వెలుగులోకి వస్తుండటంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పర్యవేక్షణపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ప్రసవాల అనంతరం శిశువుల భద్రత, తల్లిదండ్రుల వివరాల నిర్ధారణ, ఆసుపత్రులలో మధ్యవర్తుల సంచారం వంటి అంశాలపై దృష్టి పెట్టడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు శిశువుల అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి అమానుష ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News