- మెదక్ చారిత్రక కట్టడాలు అపురూప సంపద
- మంచు విష్ణు
పురాతన, వారసత్వ సంపదకు నిలయమైన మెదక్ జిల్లా పర్యాటక రంగంలో విశేష గుర్తింపు పొందే అవకాశాలు ఉన్నాయని మా అసోసియేషన్ అధ్యక్షుడు, సినీ నటుడు, సినీ నిర్మాత మంచు విష్ణు అన్నారు. భవిష్యత్తులో తాను నటించే లేదా నిర్మించే చిత్రాల్లో మెదక్ జిల్లాకు అవకాశం కల్పించి, ఇక్కడి వైభవాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తానని పేర్కొన్నారు.
శనివారం మెదక్ జిల్లా పర్యాటక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పర్యటించిన మంచు విష్ణుకు జిల్లా యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. ఏడుపాయల వనదుర్గ మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మెదక్ ఖిల్లా, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మెదక్ సీఎస్ఐ కేథడ్రల్ చర్చిని సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోని అనేక దేశాలకు లేని గొప్ప చారిత్రక వారసత్వ సంపద మన దేశానికి సొంతమని, దానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. మెదక్ జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి జిల్లా యంత్రాంగం రూపొందించిన ప్రణాళికలు అభినందనీయమన్నారు.
హైదరాబాద్కు అతి సమీపంలో ఉన్న ఇంతటి చారిత్రక ప్రాంతాలను చూడకపోవడం తనకు సిగ్గుగా అనిపించిందని, మెదక్ జిల్లాలోని చారిత్రక, ఆధ్యాత్మిక వైభవాన్ని భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి రమేష్, మున్సిపల్ కమిషనర్ నవీన్, మున్సిపల్ చైర్పర్సన్ రాధిక భూపతి రాజ్, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, డీఎస్పీ ప్రసన్న కుమార్, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
