కురుమ సంఘం పేరుతో 18 ఏళ్లుగా పదవులను అనుభవిస్తూ, ఇతర నాయకులు ఎదగకుండా అణిచివేస్తున్నారని కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దొడ్డి శ్రీనాథ్ ఆరోపించారు. శుక్రవారం రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… సంఘం పేరుతో కోట్ల రూపాయల ఆస్తులు, భూములు, టెండర్లు, భవనాల పేరుతో జరుగుతున్న వ్యవహారాలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన కులగణనలో కురుమ కులానికి సంబంధించిన జనాభా లెక్కలు వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా నమోదయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కురుమల సంఖ్యను కావాలనే తగ్గించి చూపించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. 3 ఎకరాల 20 గుంటల స్థలంలో నిర్వహించిన కారు, లారీ పార్కింగ్ టెండర్ ద్వారా వచ్చిన డబ్బులు ఎక్కడికి వెళ్లాయో చెప్పాలని ప్రశ్నించారు. దొడ్డి కొమరయ్య ఆత్మగౌరవ భవనాన్ని వ్యక్తిగతంగా ఎవరో నిర్మించినట్లు ప్రచారం చేసుకుంటున్నారని, వాస్తవానికి ఆ భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వమే మంజూరు చేసిందని స్పష్టం చేశారు.

రాజకీయంగా ఎదిగిన తర్వాత సంఘాన్ని వ్యక్తిగత ఆస్తిలా ఉపయోగించుకుంటూ, సభ్యత్వ నమోదు పత్రాలు కూడా ప్యానెల్–2 నాయకులకు ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారని విమర్శించారు. సోషల్ మీడియాలో ఎవరైనా ప్రశ్నిస్తే వారిని దూషించేందుకు ప్రత్యేకంగా మనషులను పెట్టి తిట్టిస్తున్నారని ఆరోపించారు. సేవ చేసిన వారికి పదవులు ఇవ్వకుండా డబ్బులు ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తున్నారని, విమర్శించారు.ఈ సమావేశంలో ప్రవీణ్, చల్లపల్లి సురేష్, మాదారం కృష్ణ, అడికే సంతోష్, మోహన్, శివ తదితరులు పాల్గొన్నారు.
