Homeభక్తిSri-krishna| కృష్ణాష్టమి వైశిష్టం..

Sri-krishna| కృష్ణాష్టమి వైశిష్టం..

  • లోకాలకు జ్ఞానబోధ చేసిన జగద్గురువు..
  • జీవన గమ్యాన్ని చూపిన (Sri-krishna) శ్రీకృష్ణుడు..

శ్రీకృష్ణ (Sri-krishna) భక్తులు ఏడాది మొత్తం ఎదురు చూసే కృష్ణాష్టమి వచ్చేస్తోంది. కృష్ణుడంటే బాల్యక్రీడలతో అల్లరి చేసిన చిలిపికృష్ణుడు మాత్రమే కాదు! లోకాలకు జ్ఞానబోధ చేసిన జగద్గురువు! అందుకే శ్రీకృష్ణుడు గురువులకే గురువు ఆదిగురువు.

నడిచే దైవంగా ఖ్యాతి చెందిన శ్రీ ఆదిశంకరాచార్యులు తాను రచించిన కృష్ణాష్టకంలో “కృష్ణం వందే జగద్గురుమ్” అని కీర్తిస్తూ, సమస్త సృష్టికి ఆయనే మార్గదర్శకుడని పేర్కొన్నారు. శ్రీకృష్ణుడిని ‘జగద్గురువు‘ అని పిలవడానికి ప్రధాన కారణం ఆయన సమస్త మానవాళికి ఆచరణాత్మకమైన జ్ఞానాన్ని, ధర్మ మార్గాన్ని బోధించడమే! కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి అందించిన భగవద్గీత ద్వారా జీవిత పరమార్థాన్ని, కర్తవ్యాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పాడు. అసలు శ్రీకృష్ణుని జగద్గురువని ఎందుకు అంటారు? ఆ పరమార్థం ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం. లౌకిక, ఆధ్యాత్మిక చింతనలను సమన్వయం చేస్తూ జీవన గమ్యాన్ని చూపిన పరమ గురువుగా శ్రీకృష్ణుని సనాతన ధర్మం కీర్తిస్తుంది.

- Advertisement -

శ్రీకృష్ణుడి మాటలు ఏ ఒక్క కాలానికో, ప్రాంతానికో పరిమితం కాకుండా అన్ని కాలాల మానవులకు, అన్ని ప్రాంతాల వారికి వర్తిస్తాయి. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునునికి భగవద్గీత బోధించడం ద్వారా శ్రీకృష్ణుడు ఒక మనిషి ఎలా బ్రతకాలో, కర్మను ఎలా ఆచరించాలో, సుఖదుఃఖాలను ఎలా ఎదుర్కోవాలో గీతాసారం ద్వారా సమస్త లోకానికి మార్గదర్శనం చేశాడు. అందుకే అయన జగద్గురువు అయ్యాడు.

“కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన|
మా కర్మఫలహేతుర్భూః మా తే సంగో స్త్వకర్మణి”
అంటే మనం చేయాల్సిన కర్తవ్యాన్ని ఎలాంటి ఫలితం ఆశించకుండా నిష్కామంగా నిర్వర్తించాలి. ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మలు ఆచరించాలి. ప్రతిఫలం గురించి ఆశ లేదు కదా అని పని పట్ల నిర్లక్ష్యం తగదు. మనసా వాచా కర్మణా మన శక్తులన్నీ కేంద్రీకరించి కర్మను శ్రద్ధతో నిర్వహించాలి. అప్పుడు ఆ కర్మకు ఇవ్వాల్సిన ఫలితం గురించి భగవంతుడే చూసుకుంటాడు అని అర్ధం. ఆత్మకు పుట్టుక, మరణం లేవు. శరీరం మాత్రమే పుడుతుంది, నశిస్తుంది. ఆత్మ ఎన్నటికీ నశించదు. ఆత్మ అగ్నిలో కాలదు, నీటిలో తడవదు. శరీరం అశాశ్వతం. అందుకే చనిపోయిన వారికోసం బాధపడకూడదు. మరణం శరీరానికే కానీ ఆత్మకు కాదు. అందుకే సత్యమైన ఆత్మను పరమాత్మతో అనుసంధానం చేసి సత్కర్మలు ఆచరించడం ద్వారా మనిషి జీవన్ముక్తుడవుతాడని కృష్ణ పరమాత్మ గీతలో బోధించాడు.

మనిషి వినాశనానికి మూలం కోరికలు. విపరీతమైన కోపం మనిషి పతనానికి మూలం. అందుకే మానవుడు కామక్రోధాలను త్యజించడం ద్వారా సాధకుడుగా మారవచ్చు. ఆచరణీయమైన, అనుసరణీయమైన ధర్మాలను ఆచరిస్తూనే సకల ధర్మాలకు మూలమైన పరమాత్మను శరణాగతి చేయాలి. భక్తిమార్గంలో పయనించే వారు అంతిమంగా సర్వ ధర్మాలను విడిచి భగవంతుని శరణు వేడితే ముక్తి లభిస్తుందని భగవద్గీత చెబుతోంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News