- అత్యధిక కాలం పనిచేసిన ప్రధానిగా చరిత్ర..
- శుభాకాంక్షలు తెలిపిన భారత ప్రధాని మోడీ..
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆ దేశ రాజకీయ చరిత్రలో ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. యుద్ధానంతర ఇటలీ చరిత్రలో అత్యధిక కాలం నిరంతరాయంగా ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా (Giorgia Meloni) ఆమె నిలిచారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. మెలోనీని ‘నా స్నేహితురాలు’ అని సంబోధిస్తూ, ఆమె నాయకత్వంపై ఇటలీ ప్రజలకు ఉన్న విశ్వాసానికి ఈ మైలురాయే నిదర్శనమని ప్రశంసించారు.
ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా మోదీ స్పందిస్తూ.. “ఇటలీ యుద్ధానంతర చరిత్రలో సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగుతున్న నా స్నేహితురాలు జార్జియా మెలోనీకి అభినందనలు. ఈ విజయం ఆమె నాయకత్వంపై ఇటలీ ప్రజలు ఉంచిన నమ్మకానికి, విశ్వాసానికి ప్రతీక” అని పేర్కొన్నారు. భారత్-ఇటలీ మధ్య ‘ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం’ బలోపేతం కావడంలో మెలోనీ స్నేహం కీలక పాత్ర పోషించిందని మోదీ అన్నారు. భవిష్యత్తులో కూడా ఇరు దేశాల ప్రజల శ్రేయస్సు కోసం కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. 2022 అక్టోబర్ 22న ఇటలీ తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన జార్జియా మెలోనీ, ఇవాళ్టికి 1,413 రోజులు పదవిలో పూర్తి చేసుకున్నారు. తద్వారా మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ రికార్డును ఆమె అధిగమించారు.
గత జులైలో ప్రధాని మోదీ భారత చరిత్రలో అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానిగా నిలిచినప్పుడు మెలోనీ కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల ప్రజలకు కొత్త అవకాశాలు సృష్టించేందుకు కలిసి పనిచేస్తామని ఆమె పేర్కొన్నారు. గత మే నెలలో మోదీ ఇటలీలో పర్యటించినప్పుడు ఇరు దేశాల సంబంధాలను ‘ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచుతూ ఇరు నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఈ పర్యటన సందర్భంగా మోదీ, మెలోనీకి సరదాగా ‘మెలోడీ’ చాక్లెట్ల ప్యాకెట్‌ను బహుమతిగా ఇచ్చారు. సోషల్ మీడియాలో వారిద్దరి పేర్లతో వైరల్ అయిన ‘#Melodi’ ట్రెండ్‌ను ఇది గుర్తుచేసింది. ఈ ఆసక్తికర క్షణాలను మెలోనీ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇరు నేతల మధ్య ఉన్న ఈ స్నేహపూర్వక వాతావరణం ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు
