ప్రచారంలో పవన్ కల్యాణ్ పాల్గొనే అవకాశం
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో (JubileeHills Bye Election) కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ(Bjp)కి జనసేన పార్టీ (Janasena Party) సంపూర్ణ మద్దతు (Support) ప్రకటించింది. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి (Lankala Deepak Reddy) మద్దతుగా జనసేన పార్టీ నాయకులు ప్రచారంలో పాల్గొననున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సైతం జూబ్లీహిల్స్‌లో బీజేపీకి సపోర్ట్‌గా ప్రచారం నిర్వహించే అవకాశం ఉంది. ఈ మేరకు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలతో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్, పలువురు రాష్ట్ర నాయకులు మంగళవారం భేటీ అయ్యారు.

రెండు పార్టీల నాయకులు రేపు బుధవారం జాయింట్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఆ సమావేశంలో తమ భవిష్యత్ కార్యాచరణను వివరించనున్నారు. హైదరాబాద్‌లోని సాగర్ సొసైటీలో జరిగిన ఈ భేటీలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డితోపాటు పార్టీ ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రెండు పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జరిగినట్లు నాయకులు తెలిపారు.

