Homeఆదాబ్ ప్రత్యేకంShloka International School | భవన నిర్మాణం పూర్తికాకముందే పూర్తి అనుమతులా?

Shloka International School | భవన నిర్మాణం పూర్తికాకముందే పూర్తి అనుమతులా?

  • శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవహారంపై వికారాబాద్‌లో చర్చ!
  • వసతులు లేకుండానే అడ్మిషన్లు, పాఠశాలలోనే పుస్తకాల విక్రయాలపై విమర్శలు!

వికారాబాద్ జిల్లా కేంద్రంలో కొత్తగా ఏర్పాటు అవుతున్న శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవహారం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పాఠశాల భవన నిర్మాణ పనులు ఇంకా పూర్తిస్థాయిలో ముగియకముందే విద్యాశాఖ నుంచి పూర్తి అనుమతులు లభించాయనే ఆరోపణలు, వసతులు పూర్తిగా అందుబాటులోకి రాకముందే అడ్మిషన్లు ప్రారంభించడం, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ తదితర విద్యా సామగ్రిని పాఠశాల ప్రాంగణంలోనే విక్రయించడం వంటి అంశాలు వివాదానికి కేంద్రబిందువుగా మారాయి.

విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు, స్థానికులు, ప్రైవేట్ విద్యాసంస్థల ప్రతినిధులు పలు ప్రశ్నలు లేవనెత్తుతూ ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. విద్యారంగానికి సంబంధించిన నిబంధనలు అందరికీ సమానంగా అమలవుతున్నాయా లేదా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -
Shloka International School Vikarabad Approval Controversy Education Department Allegations

భవన నిర్మాణం పూర్తికాకముందే గుర్తింపు ఎలా?

వికారాబాద్ పట్టణంలో స్థానిక ప్రజల ఆరోపణల ప్రకారం, పాఠశాల భవన నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతుండగానే విద్యాశాఖ నుంచి గుర్తింపు ప్రక్రియ పూర్తయిందని ప్రచారం జరుగుతోంది. సాధారణంగా ఒక విద్యాసంస్థకు అనుమతులు మంజూరు చేయడానికి ముందు భవన నిర్మాణం, తరగతి గదుల లభ్యత, తాగునీటి సదుపాయాలు, పారిశుద్ధ్య వ్యవస్థ, విద్యార్థుల భద్రత, అగ్నిమాపక ఏర్పాట్లు, ఆట స్థలం వంటి మౌలిక వసతులను అధికారులు పరిశీలించాల్సి ఉంటుంది.

అయితే శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ విషయంలో ఈ ప్రక్రియ పూర్తిగా అమలైందా లేదా అనే అంశంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భవన నిర్మాణం పూర్తి కాకముందే పూర్తి గుర్తింపు ఎలా లభించింది. అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారా నిర్దేశిత ప్రమాణాలు నెరవేర్చకుండానే అనుమతులు ఇచ్చారా అనే ప్రశ్నలు ఇప్పుడు పట్టణ వ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి.

Shloka International School Vikarabad Approval Controversy Education Department Allegations2

వసతులు పూర్తికాకముందే అడ్మిషన్లు

విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పాఠశాలలో అడ్మిషన్ల ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని సమాచారం. భవన నిర్మాణం, మౌలిక వసతుల పరిస్థితిపై స్పష్టత లేకుండానే విద్యార్థుల నమోదు చేపట్టడం పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పూర్తిస్థాయి విద్యా వాతావరణం, భద్రతా ప్రమాణాలు, తరగతి గదుల లభ్యత, ఆట స్థలాలు, ఇతర సౌకర్యాలపై స్పష్టమైన సమాచారం ఇవ్వకుండా అడ్మిషన్లు నిర్వహించడం సరైన విధానం కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలోనే పుస్తకాల విక్రయాలు పాఠశాల ప్రాంగణంలోనే పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, , ఇతర విద్యా సామగ్రిని విక్రయిస్తున్నారనే అంశం మరో వివాదానికి దారితీసింది. తల్లిదండ్రులు తమకు నచ్చిన దుకాణాల్లో అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసుకునే అవకాశాన్ని లేకుండా చేసి ఒకే కేంద్రంలో కొనుగోలు చేయాల్సిన పరిస్థితిని సృష్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ అంశంపై స్పందించిన ఎసఎఫఐ నాయకులు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు పాఠశాల వద్ద తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న బుక్ సేల్స్ కేంద్రాన్ని అధికారులు సీజ్ చేసినట్లు విద్యార్థి సంఘ నాయకులు పేర్కొన్నారు.తల్లిదండ్రుల ఎంపిక హక్కును హరించే విధంగా పాఠశాలలు వ్యవహరించకూడదని, పుస్తకాల విక్రయాలను బలవంతంగా ఒకే చోట పరిమితం చేయడం వల్ల అదనపు ఆర్థిక భారం పడుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

విద్యను వ్యాపారంగా మార్చారంటూ ఎసఎఫఐ ఆరోపణ

ఈ వ్యవహారంపై విద్యార్థి సంఘం ఎసఎఫఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యను సేవారంగంగా కాకుండా పూర్తిస్థాయి వ్యాపారంగా మార్చి తల్లిదండ్రుల నుంచి భారీ మొత్తాలు వసూలు చేస్తున్నారని ఆరోపించింది.పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, ఇతర విద్యా సామగ్రి పేరుతో వేలాది రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు తమకు అందాయని ఎసఎఫఐ సంఘం నాయకులు తెలిపారు.

లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ మధ్యతరగతి, పేద కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నారని విమర్శించారు.కార్పొరేట్ విద్య పేరుతో జరుగుతున్న ఈ తరహా వ్యవహారాలను ప్రభుత్వం అరికట్టకపోతే విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.వికారాబాద్ పట్టణంలోని కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు కూడా ఈ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు.

విద్యాశాఖ అధికారులు అందరికీ ఒకే విధమైన నిబంధనలు అమలు చేయాల్సి ఉండగా, కొన్ని సంస్థలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.నిబంధనల అమలులో సమానత్వం పాటించకపోవడం వల్ల విద్యారంగంలో అసమాన పోటీ పరిస్థితులు ఏర్పడుతున్నాయని కొందరు విద్యాసంస్థల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.

రాజకీయ అండదండల ప్రచారం

ఈ శ్లోక పాఠశాల వెనుక కొందరు రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయనే ప్రచారం కూడా జిల్లా కేంద్రంలో జోరుగా సాగుతోంది. రాజకీయ పలుకుబడి కారణంగానే అనుమతుల ప్రక్రియ వేగంగా పూర్తైందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అయితే ఈ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు బయటకు రాలేదు. పాఠశాల యాజమాన్యం గానీ, విద్యాశాఖ అధికారులు గానీ ఈ ఆరోపణలపై అధికారికంగా స్పందించలేదు.

సమగ్ర విచారణకు డిమాండ్

ప్రస్తుతం శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్‌కు మంజూరైన గుర్తింపు, అనుమతుల ప్రక్రియ, భవన నిర్మాణ స్థితి, అధికారుల తనిఖీ నివేదికలు, పాఠశాల ప్రాంగణంలో విద్యా సామగ్రి విక్రయాలు, ఫీజుల నిర్మాణం, విద్యార్థులకు అందుబాటులో ఉన్న మౌలిక వసతులు వంటి అంశాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన ఈ అంశంపై జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి పూర్తి వివరాలు వెల్లడించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

భవన నిర్మాణం పూర్తికాకముందే అనుమతులు ఎలా లభించాయి. వసతులు పూర్తిగా అందుబాటులోకి రాకముందే అడ్మిషన్లు ఎందుకు ప్రారంభించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలల్లోనే పుస్తకాల విక్రయాలు ఎలా కొనసాగాయి.వంటి ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉందని విద్యావర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారి పూర్తి విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎసఎఫఐ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News