ఇందిరాపార్క్ వద్ద భారీగా రెడ్డి సంఘాల సమీకరణ
ఐదు ప్రధాన డిమాండ్లతో ఆందోళన
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రెడ్డి సంఘాల (Reddy Communities) ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన రెడ్డి నిరసన దీక్ష (Reddy’s Protest) ఘనంగా జరిగింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ దీక్ష సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వేలాది మంది రెడ్డి సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, ఉద్యోగ అభ్యర్థులు, మహిళలు, వృద్ధులు పాల్గొని కార్యక్రమంలో ఉత్సాహం నింపారు.

ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలుగా రెడ్డి వర్గానికి సంబంధించి సంక్షేమం(Welfare), రిజర్వేషన్లు(Reservations), విద్య, ఉద్యోగ అవకాశాల పరంగా నిర్లక్ష్యం చోటుచేసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రెడ్డి వర్గ సమస్యలపై చిత్తశుద్ధితో వ్యవహరించాలని డిమాండ్ చేశారు. రెడ్డి సమాజం కూడా రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా ఉన్నా, పాలనలో, ప్రణాళికల్లో సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రెడ్డి సంఘాల ఐదు ప్రధాన డిమాండ్లు(Demands):
- ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్) విద్యార్థులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)లో కటాఫ్ మార్కులను 90 నుంచి 75కి తగ్గించాలి.
- ఈడబ్ల్యూఎస్ వర్గాలకు కేటాయించిన మిగిలిపోయిన పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. బ్యాక్‌లాగ్ పోస్టులను న్యాయంగా పూరించాలి.
- అన్ని పోటీ పరీక్షల్లో వయోపరిమితి సడలింపు ఇవ్వాలి. అనేక మంది అభ్యర్థులు వయసు మీరిన కారణంగా అవకాశాలు కోల్పోతున్నారు కాబట్టి దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
- ఈడబ్ల్యూఎస్ కమిషన్‌ను చట్టబద్ధంగా ఏర్పాటు చేసి, వర్గాల హక్కులను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలి.
- విద్య, ఉద్యోగ పరీక్షల రుసుములు తగ్గించి, పేద అభ్యర్థులకు సౌకర్యాలు కల్పించాలి.
- అదే విధంగా రెడ్డి కార్పొరేషన్‌కు తగిన నిధులు మంజూరు చేయాలి. పాలక వర్గాన్ని వెంటనే నియమించాలి.
ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెడ్డి సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. ఈడబ్ల్యూఎస్ వర్గానికి సముచిత న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తేల్చిచెప్పారు. దీక్షలో పాల్గొన్నవారు ‘హలో రెడ్లు–ఛలో ఇందిరా పార్క్’ అని నినాదాలు చేస్తూ సమాజ ఐక్యతను ప్రదర్శించారు. దీక్షా ప్రాంగణం రెడ్డి సంఘాల జెండాలతో, ప్లకార్డులతో నిండిపోయింది. దీక్షలో ప్రముఖ సామాజిక నాయకులు, యువజన ప్రతినిధులు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై వెంటనే స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా మరింత పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని రెడ్డి సంఘాల నాయకులు హెచ్చరించారు.
ఈ నిరసన దీక్షలో రెడ్డి సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఏనుగు సంతోష్ రెడ్డి, రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు పిట్ట శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంధి తిరుపతి రెడ్డి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు వంచ సుదర్శన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చింతల శ్రీనివాస్ రెడ్డి, పెండ్యాల రాంరెడ్డి, కర్ర అశోక్ రెడ్డి, గోగూరి బాపురెడ్డి, ధ్యావ భాస్కర్ రెడ్డి, రేకులపల్లె రవీందర్ రెడ్డి, ఏరు గోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

