అక్టోబర్ 31న ప్రపంచ పొదుపు దినోత్సవాన్ని (World Savings Day) జరుపుకుంటారు. మన దేశంలో మాత్రం అక్టోబర్ 30నే జరుపుకుంటారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ (Indira Gandhi) అక్టోబర్ 31న హత్యకు గురయ్యారు కాబట్టి ఇండియా(India)లో అక్టోబర్ 31న ఈ దినోత్సవాన్ని జరుపుకోరు. ప్రజలు చాల మంది డబ్బు(Money)ను పోపుల డబ్బాల్లోనో, పరుపు కిందో, ఇంట్లోనో ఉంచుతారు. కానీ దాని వల్ల ప్రయోజనం లేదు. ఆ పొదుపును ఇతర మార్గాల్లో చేస్తే అదనపు ఆదాయం (Additional Income) వస్తుంది. దీర్ఘకాలిక ప్రయోజనాలూ పొందుతారు. పొదుపుపై ప్రజలను చైతన్యపరిచేలా, అవగాహన పెంచే ఉద్దేశంతో ఈ దినోత్సవాన్ని స్థాపించి నిర్వహిస్తున్నారు.
పొదుపు అనేది వ్యక్తులకే కాక దేశ ఆర్థిక వ్యవస్థ(Economy)ను స్థిరపరచడానికి అవసరం. ప్రపంచ పొదుపు దినోత్సవం ముఖ్య ఉద్దేశాలు.. ఉజ్వల భవిష్యత్తు(Future)కు పునాది (Foundation) వేయడం. డబ్బును ఆదా చేసినా, ఇతర మార్గాల్లో పెట్టుబడి పెట్టినా మంచి రాబడి వస్తుంది. తద్వారా భవిష్యత్తు బాగుంటుంది. పొదుపు చేయడానికి అందుబాటులో ఉన్న పలు రంగాలపై సమాచారాన్ని సామాన్యులకు చేరవేయడం కూడా ఈ పొదుపు దినోత్సవ ముఖ్య లక్ష్యాల్లో ఒకటి. పొదుపు అంటే వనరులన్నింటినీ ఒకేసారి ఖాళీ చేయకుండా తెలివిగా అవసరాలకు తగ్గట్లుగా జాగ్రత్తగా ఉపయోగించడం.
దేశంలో ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (Jan Dhan Yojana) అనే ప్రత్యేక పథకాన్ని అందించింది. వారితో జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్‌లను తెరిపించి ఆదా గురించి అవగాహనా కల్పించారు. విద్యా వ్యవస్థలో పొదుపు గురించి ముఖ్యమైన భావనలు చాలా ఉన్నాయి. కానీ క్షేత్రస్థాయిలో నుంచి భావాలకు బలం అందిస్తేనే పొదుపు పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన వస్తుంది. జీవితంలో స్థిరమైన ఆదాయాన్ని పొందాలన్నా, వారసులకు ఉజ్వల భవిష్యత్తు అందించాలన్నా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి. కచ్చితమైన రాబడుల కోసం పొదుపు సూత్రాలను పాటించాలి.
డబ్బు నిర్వహణ లోపిస్తే జీవిత చరమాంకంలో బతుకు దుర్లభంగా మారుతుంది. చుట్టూ ఉండే సమాజాన్ని పరిశీలిస్తే పొదుపు విలువ తెలుస్తుంది. కష్టపడి సంపాదించాలనే ఆలోచన రానీయకుండా ఉచితాల పేరుతో అవసరం లేకపోయినా పథకాలు అందించటం సరికాదు. దీనివల్ల దేశాలు దివాళా తీస్తాయి తప్ప మరొకటి జరగదు. ఉచితాల వల్ల ప్రజలకు పొదుపు చేయాలనే ఆలోచన రాదు. కాబట్టి ప్రభుత్వాలు ప్రజలకు పొదుపు అలవాటు చేసి బతకడం నేర్పించాలి. పొదుపు ఒక మదుపు (Investment ) అనే సూత్రాన్ని చిన్నతనం నుంచే అలవాటు చేయాలి. పొదుపు జీవితాన్ని క్రమపద్ధతిలో నడిపిస్తుంది. ఆదమరిస్తే అగాధంలోకి తోసేస్తుంది.
డాక్టర్ వై.సంజీవ కుమార్,
ఫౌండర్ & ప్రెసిడెంట్,
స్కై ఫౌండేషన్
