- రెడీమిక్స్ ప్లాంట్ స్థలంపై కడ్తాల్ తహసీల్దార్ జయశ్రీ నోటీసులు
- అసైన్డ్ భూముల్లో భూ బదలాయింపు చట్ట విరుద్ధమంటున్న అధికారులు
- మేము బటర్‌ఫ్లై సిటీకి లీజు ఇవ్వలేదంటున్న బాధిత గిరిజన రైతులు
- బౌన్సర్లను అడ్డం పెట్టుకొని మా భూములు లాక్కున్నారనిగిరిజనుల ఆవేదన…
- ఏళ్ల తరబడి పోరాడుతున్నా రైతులకు అందని న్యాయం
- పల్లె ప్రగతి వనంలోని చెట్లను నరికి రోడ్డు వేసినా పట్టించుకోని అధికారులు
- ప్రభుత్వ స్థలాలకు దిక్కేది అంటూ స్థానికుల ప్రశ్న
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో వివాదాస్పదంగా మారిన ఫార్చ్యూన్ బటర్‌ఫ్లై సిటీ భూముల వ్యవహారంలో రెవెన్యూ శాఖ కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. టాకురాజుగూడ తండాకు చెందిన గిరిజన రైతులకు ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్ భూములు చట్టవిరుద్ధంగా బదలాయింపు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో కడ్తాల్ తహసీల్దార్ జయశ్రీ షోకాజ్ నోటీసులు జారీ చేయడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
రెవెన్యూ రికార్డుల ప్రకారం టాకురాజుగూడ తండాకు చెందిన వడ్త్యావత్ నేజి,వడ్త్యావత్ సంగ్యా, వడ్త్యావత్ ఠాగూర్, వడ్త్యావత్ రూప్‌సింగ్ కుటుంబాలకు ప్రభుత్వం గతంలో భూ సీలింగ్ చట్టం కింద భూములను కేటాయించింది. సర్వే నంబర్ 790/39లో ఉన్న 4.19 ఎకరాల భూమిని ఫార్చ్యూన్ బటర్‌ఫ్లై సిటీ సంస్థకు రిజిస్ట్రేషన్ లేని లీజు పత్రాల ద్వారా అప్పగించినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు నోటీసుల్లో పేర్కొన్నారు.
తెలంగాణ అసైన్డ్ ల్యాండ్స్ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్స్) చట్టం – 1977 ప్రకారం అసైన్డ్ భూములను అమ్మడం, లీజుకు ఇవ్వడం, బదిలీ చేయడం లేదా ఇతరుల వినియోగానికి అప్పగించడం నేరంగా పరిగణించబడుతుంది. ఈ నేపథ్యంలో రైతులు, సంస్థ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసిన అధికారులు 15 రోజులలోపు వివరణ సమర్పించాలని ఆదేశించారు. సరైన వివరణ అందించని పక్షంలో అసైన్మెంట్ రద్దు చేసి భూములను ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు.
రైతుల వాదన పూర్తిగా భిన్నం :
అయితే రెవెన్యూ శాఖ ఆరోపణలను బాధిత గిరిజన రైతులు తీవ్రంగా ఖండిస్తున్నారు.తాము ఎప్పుడూ బటర్‌ఫ్లై సిటీ సంస్థతో ఎలాంటి లీజు ఒప్పందం చేసుకోలేదని, తమ అనుమతి లేకుండానే భూములను స్వాధీనం చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. “మాకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని మేమెందుకు లీజుకు ఇస్తాం? ఎలాంటి రిజిస్ట్రేషన్ జరగలేదు.ఎలాంటి ఒప్పందాలపై సంతకాలు చేయలేదు. బౌన్సర్లను అడ్డం పెట్టుకుని మా భూములను ఆక్రమించారు. ఇప్పుడు మేమే లీజు ఇచ్చామని చెప్పడం బాధాకరం” అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెడీమిక్స్ ప్లాంట్‌పై అనుమానాలు :
వివాదాస్పద భూమిలో ప్రస్తుతం రెడీమిక్స్ కాంక్రీట్ (ఆరఎంసీ) ప్లాంట్ కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. భూముల యాజమాన్య వివాదం కొనసాగుతుండగానే వాణిజ్య కార్యకలాపాలకు అనుమతులు ఎలా లభించాయి? అసైన్డ్ భూమిలో పరిశ్రమల కార్యకలాపాలకు అనుమతులు ఎవరు ఇచ్చారు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
పల్లె ప్రకృతి వనం ధ్వంసంపై ఆరోపణలు :
బటర్‌ఫ్లై సిటీ ప్రాజెక్టు కోసం గ్రామపంచాయతీ పరిధిలోని పల్లె ప్రగతి వనంలో ఉన్న చెట్లను నరికి రహదారి నిర్మాణం చేపట్టినప్పటికీ స్థానిక అధికారులు పట్టించు కోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు, పంచాయతీ ఆస్తుల పరిరక్షణ విషయంలో అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏళ్లుగా సాగుతున్న పోరాటం :
ఈ భూముల వివాదం నిన్న మొన్నటి విషయం కాదని గ్రామస్తులు చెబుతున్నారు. తమ భూములను కాపాడుకోవడానికి బాధిత కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా రెవెన్యూ కార్యాలయాలు, జిల్లా అధికారుల కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లి వినతిపత్రాలు సమర్పించినప్పటికీ న్యాయం జరగలేదని వాపోతున్నారు. కొందరు రైతులు న్యాయస్థానాలను కూడా ఆశ్రయించినట్లు సమాచారం.
“లీజ” అంశమే ఇప్పుడు కీలకం :
తహసీల్దార్ నోటీసులో “లీజ” అనే అంశాన్ని స్పష్టంగా ప్రస్తావించడం ప్రస్తుతం వివాదంలో కీలకంగా మారింది. ఒకవైపు లీజు పత్రాలు ఉన్నాయని అధికారులు చెబుతుండగా, మరోవైపు అలాంటి ఒప్పందాలే లేవని రైతులు వాదిస్తున్నారు. దీంతో అసలు లీజు పత్రాలు ఉన్నాయా? ఉంటే వాటిపై సంతకాలు ఎవరివి? అవి చట్టబద్ధమైనవేనా? అనే ప్రశ్నలకు సమాధానం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.
అధికారుల తదుపరి చర్యలపై ఉత్కంఠ :
ఈ నోటీసుల ప్రతులను కందుకూరు ఆర్డీవో,రంగారెడ్డి జిల్లా కలెక్టర్,సంబంధిత గ్రామపంచాయతీ అధికారులకు పంపినట్లు తెలిసింది. రైతులు,సంస్థ యాజమాన్యం సమర్పించే వివరణల ఆధారంగా రెవెన్యూ శాఖ తదుపరి నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ అసైన్డ్ భూముల బదిలీ జరిగినట్లు తేలితే భూములను తిరిగి ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకునే అవకాశం ఉంది.
మరోవైపు రైతులు చేస్తున్న బలవంతపు ఆక్రమణ ఆరోపణలపై కూడా సమగ్ర విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం బటర్‌ఫ్లై సిటీ భూముల వివాదం కడ్తాల్ మండలంతో పాటు మొత్తం రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. రెవెన్యూ శాఖ విచారణ,రైతుల వాదనలు, సంస్థ యాజమాన్యం స్పందన నేపథ్యంలో ఈ వ్యవహారం ఎటువైపు మలుపు తిరుగుతుందనే ఆసక్తి నెలకొంది.
