- నిబంధనలకు నీళ్లు వదిలిన అధికారులు..?
- అక్రమ నిర్మాణానికి అధికార ముద్ర..?
- అధికారులపై ముడుపుల ఆరోపణలు..
- విజిలెన్స్, ఏసీబీ విచారణ కోరుతున్న స్థానికులు..
- బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న విజ్ఞప్తి..
- భవన అనుమతులపై సమగ్ర విచారణకు డిమాండ్..
స్వార్థ ప్రయో జనాలే పరమావధిగా, ముడుపుల మత్తులో మునిగి తేలుతూ, నిబంధనలను నడిరోడ్డుపై నిలువునా పాతేయడంలో హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచఎండీఏ) ప్లానింగ్ విభాగం మరోసారి తన “మార్కు” చూపించింది. చట్టాలను చుట్టాలుగా మార్చుకుంటూ, అక్రమ నిర్మాణాలకు యథేచ్ఛగా ‘ఆక్యుపెన్సీ సరి ్టఫికెట్లు’ (భవన వినియోగ ధృవీకరణ పత్రాలు) జారీ చేస్తూ ఈ విభాగం అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. రంగారెడ్డి జిల్లా, గండిపేట్ గ్రామంలోని సర్వే నెంబర్ 9/1లో వెలిసిన “హంటర్స్ స్పోర్ట్స్ అకాడమీ” భవన ఉదంతమే ఇందుకు సజీవ సాక్ష్యం.
కళ్లు మూసుకున్న ప్లానింగ్ సిబ్బంది – నిబంధనలు బలి! :
ఈ భవనానికి సంబంధించి హెచఎండీఏ ప్లానింగ్ అధికారులు కనబరిచిన అత్యుత్సాహం చూస్తుంటే సామాన్యుడికి ముక్కున వేలేసుకోవడం ఒక్కటే తక్కువైంది. 29.01.2026 నాటి ప్రొసీడింగ్స్ నెంబర్ 011938/ హెచఎండీఏ /03511/ ఎస్డబ్ల్యూఓసి/ ఎస్ కేపీ 1/2025 ద్వారా ఈ భవనానికి చట్టబద్ధత కల్పిస్తూ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చేశారు. అయితే అసలు కథ ఇక్కడే ఉంది! మునుపు ఇచ్చిన బిల్డింగ్ పర్మిట్ నెంబర్ 004211/ బిపి/ హెచఎండీఏ /0869/ఎస్ కే పీ/2023 (తేదీ: 24.06.2023) నిబంధనలను ఈ నిర్మాణం పూర్తిగా కాలరాసింది.

కనీస రూల్స్ పాటించకుండా, చుట్టూ వదిలిపెట్టాల్సిన సెట్‌బ్యాక్‌లను పూర్తిగా నమిలేసి, దాదాపు ‘జీరో సెట్‌బ్యాక’తో భవనాన్ని లేపేశారు. ఇంతటి ఘోర ఉల్లంఘన జరుగుతుంటే, ప్లానింగ్ సిబ్బంది కళ్లకు గంతలు కట్టుకున్నారా? లేక ముడుపుల నోట్ల కట్టలు కళ్లను కప్పేశాయా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం చుట్టూ స్థలం వదలకుండా నిర్మిస్తుంటే.. క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన అధికారులు ఏ మొహం పెట్టుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు?
అదనపు అంతస్తుల దందా.. కేవలం 10 శాతం డివియేషనా? ఎంత విచిత్రం! : అక్రమాలు అంతటితో ఆగితే అది హెచఎండీఏ ఎందుకు అవుతుంది? అనుమతి ఇచ్చిన అంతస్తుల కంటే అదనంగా ఏకంగా రెండు అంతస్తులను అక్రమంగా నిర్మించారు. భవనం ఆమోదిత ప్లాన్‌కు పూర్తి విరుద్ధంగా, కండ్ల ముందే అడ్డగోలుగా వెలిసినా, సదరు అధికారులు మాత్రం కాసుల కక్కుర్తితో దానిని కేవలం ‘10 శాతం డివియేషన’గా చూపిస్తూ దొంగ కాగితాలు సృష్టించారు. క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితు లను పూర్తిగా పక్కనబెట్టి, అక్రమ నిర్మాణాన్ని సమర్థించేలా తప్పుడు నివేదికలు తయారు చేసి, తమ చేతివాటాన్ని ప్రదర్శించారు.

ఇది లంచగొండితనానికి పరాకాష్ట కాదా? వాణిజ్య అవసరాలకు వినియోగం – చట్టాల ఉల్లంఘన : ఈ భవనంలో జరుగుతున్న దందా ఇంతటితో ఆగలేదు. అనుమతించిన వినియోగానికి విరుద్ధంగా ఏకంగా వాణిజ్య (కమర్షియల్) అవసరాలకు వాడుతున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా ఇలా ‘చేంజ్ ఆఫ్ యూజ’ (భవన వినియోగ మార్పు) చేయడం ముమ్మాటికీ చట్టవిరుద్ధం. మున్సిపల్ చట్టాలు, బిల్డింగ్ రూల్స్, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన జీఓ నెంబర్ 168 (తేదీ 07.04.2012) నిబంధనలను ఈ భవన నిర్మాణం పూర్తిగా ఖూనీ చేసింది.
అధికార దుర్వినియోగం పరాకాష్ట.. విజిలెన్స్ విచారణకు డిమాండ్! : ఇన్ని స్పష్టమైన ఉల్లంఘనలు, అక్రమాలు కండ్లముందే కనిపిస్తున్నా.. సదరు బిల్డర్లకు హెచఎండీఏ అధికారులు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ చేయడం వారి అధికార దుర్వినియోగానికి, అవినీతికి నిదర్శనం. ఈ సర్టిఫికేట్ ద్వారా అక్రమ నిర్మాణానికి పరోక్షంగా హెచఎండీఏ అధికారులే చట్టబద్ధత కల్పించినట్లయింది. గండిపేట్‌లోని ప్లాట్ నెంబర్ 1-ఏ, 1-బీ మరియు 1-సీ (ప్లాట్ నెంబర్ 1, సర్వే నెంబర్ 9/1)లో జరిగిన ఈ భారీ కుంభకోణంపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలి.
నిబంధనలు ఉల్లంఘించి జారీ చేసిన సదరు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్‌ను వెంటనే రద్దు చేయాలి. భారీగా ముడుపులు నొక్కి, జేబులు నింపుకున్న సదరు హెచఎండీఏ ప్లానింగ్ అధికారులు, బిల్డర్ మరియు లబ్ధిదారులపై విజిలెన్స్, ఏసీబీ విచారణ జరిపి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఈ ‘అవినీతి అకాడమీ’ పై చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి.
