- పదేళ్ల అధికారంలో రిజర్వాయర్లు ఎందుకు నిర్మించలేదు?.
- మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును లక్ష కోట్ల తో నిర్మించారు.
- పాలమూరు రైతుల కష్టాలకు గత ప్రభుత్వ మే కారణం.
- పాలమూరు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదు.
- మంత్రి జూపల్లి కృష్ణారావు..
వనపర్తి: పాలమూరు ప్రాంతంపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం సవతి ప్రేమ చూపించిందని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) విమర్శించారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పటికీ పాలమూరు ప్రాంతంలో అవసరమైన రిజర్వాయర్లను ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. మూడేళ్ల వ్యవధిలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలు ఎలా ఖర్చు చేశారని నిలదీశారు. రైతుల సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదని ఆయన అన్నారు. వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. మాజీ మంత్రి హరీశ్‌రావు వనపర్తి పర్యటనలో ఇష్టానుసారంగా మాట్లాడారని, మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని జూపల్లి(Jupally Krishna Rao) ఆరోపించారు. ప్రకృతి వైపరీత్యాలను సైతం రాజకీయాలకు ఉపయోగించుకోవడం బీఆర్ఎస్ నాయకులకే చెల్లిందని విమర్శించారు.
రిజర్వాయర్లు ఎందుకు పూర్తి చేయలేదు?..
కృష్ణా జలాల విషయంలో జూరాల ప్రాజెక్టులో అందుబాటులో ఉన్న నీటి సామర్థ్యం 10 టీఎంసీలేనని హరీశ్‌రావుకు తెలియదా అని మంత్రి ప్రశ్నించారు. జూరాల నుంచి రామన్‌పాడుకు నిర్మించాల్సిన సమాంతర కాలువ పనుల్లో సాంకేతిక లోపాలు ఉన్నాయని, వాటిని సరిచేయాలని అప్పట్లోనే సూచించినప్పటికీ పట్టించుకోలేదన్నారు. గూడెం దొడ్డి రిజర్వాయర్‌ను 15 టీఎంసీల సామర్థ్యంతో పూర్తి చేసి ఉంటే వేలాది ఎకరాలకు సాగునీరు అందేదని, మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం ద్వారా 4.60 లక్షల ఎకరాలకు నీరు అందించే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. ఈ పనులను గత ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేసి ఉంటే ప్రస్తుత పరిస్థితి వచ్చేది కాదని వ్యాఖ్యానించారు.

మోటార్లు ఎందుకు ప్రారంభించలేదు?.
2012 నుంచే కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో ఐదు మోటార్లు ఉన్నప్పటికీ గత ప్రభుత్వం వాటిని సకాలంలో ఎందుకు ప్రారంభించి రైతులకు నీరందించలేదని ప్రశ్నించారు. శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో మోటార్లు మునిగి దెబ్బతిన్నాయని, వాటిని ప్రారంభిస్తే మిషన్ భగీరథకు నీటి సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని వివరించారు. ప్రస్తుతం రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నార్లాపూర్ నుంచి నీటిని విడుదల చేసినట్లు తెలిపారు.
90 శాతం పనులు పూర్తయ్యాయన్నది అవాస్తవం.
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 90 శాతం పూర్తయిందని హరీశ్‌రావు చెప్పడం ఆశ్చర్యంగా ఉందని జూపల్లి అన్నారు. సుమారు రూ.60 వేల కోట్లతో పూర్తికావాల్సిన ప్రాజెక్టుకు రూ.25 వేల కోట్లు ఖర్చు చేసి 90 శాతం పనులు ఎలా పూర్తిచేశారని ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును పూర్తిచేయడానికి సుమారు రూ.80 వేల కోట్ల వరకు ఖర్చు కావచ్చని పేర్కొన్నారు. మరో మూడు నెలల వరకు ఏదుల రిజర్వాయర్‌కు నీటిని అందించలేని పరిస్థితి ఉందన్నారు. కల్వకుర్తి ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని తెలిపారు.
నీటి వాటాలపై గత ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మంత్రి.
కాంగ్రెస్ నాయకులు ఆంధ్రప్రదేశ్‌కు నీటిని తరలిస్తున్నారంటూ హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆంధ్రప్రదేశ్‌కు నీటి తరలింపునకు అవకాశం కల్పించారని ఆరోపించారు. 2014 – 15 సంవత్సరానికి సంబంధించి 375 టీఎంసీల నీటిని వినియోగించుకున్నామని, ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్, హరీశ్‌రావులు కలిసి 511 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించారని విమర్శించారు.
కరువు మండలాలపై ప్రభుత్వ ప్రణాళికలు.
గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే నేడు పాలమూరు ప్రాంత రైతులు సాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జూపల్లి కృష్ణారావు అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, ఇప్పటికే కరువు మండలాలను గుర్తించి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. అబద్ధాలను పదేపదే ప్రచారం చేసినంత మాత్రాన అవి నిజాలు కావని, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు కదిరే రాములు తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
