- మంఖాల్ సర్వే నంబర్ 608/5లో రెండెకరాల భూమి
- 2005లో స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు
- డంపింగ్ యార్డ్ కోసం తుక్కుగూడ మున్సిపాలిటీకి కేటాయింపు..
- భూమి హద్దులు, ప్రస్తుత స్వాధీనంపై స్పష్టత కరువు
- 2005 నాటి స్వాధీన ఉత్తర్వులు, రికార్డులు బయటపెట్టాలి
- ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్
హైదరాబాద్: ప్రభుత్వ భూముల పరిరక్షణపై అధికారుల నిర్లక్ష్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మంఖాల్ గ్రామ(Mankhal Village) పరిధిలోని సర్వే నంబర్ 608/5లో ఉన్న రెండెకరాల ప్రభుత్వ భూమి పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఒకప్పుడు భూమిలేని నిరుపేదలకు కేటాయించిన ఈ భూమిని నిబంధనలకు విరుద్ధంగా విక్రయించేందుకు ప్రయత్నించడంతో 2005లోనే రెవెన్యూ అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అనంతరం తుక్కుగూడ మున్సిపాలిటీకి డంపింగ్ యార్డ్ ఏర్పాటు కోసం కేటాయించి, భౌతిక స్వాధీనం కూడా అప్పగించినట్లు సమాచారం. అయితే ఇన్నేళ్లు గడిచినా అక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు కాకపోవడం, భూమి ప్రస్తుత పరిస్థితిపై స్పష్టత లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

కాగితాలపై కేటాయింపులు.. క్షేత్రస్థాయిలో అమలేది?
అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. సర్వే నంబర్ 608/5 లోని రెండెకరాల భూమిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూమిలేని నిరుపేదలకు ప్రభుత్వం కేటాయించింది. అయితే కేటాయింపు నిబంధనలకు విరుద్ధంగా భూమిని విక్రయించేం దుకు ప్రయత్నాలు జరగడంతో అప్పటి మహేశ్వరం మండల రెవెన్యూ అధికారి 2005లో ప్రొసీడింగ్స్ నంబర్ బి/1696/ 2005 ద్వారా భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం తుక్కుగూడ మున్సిపాలిటీకి డంపింగ్ యార్డ్ నిర్మాణం కోసం కేటాయించి, భౌతిక స్వాధీనం అప్పగించినట్లు సంబంధిత రికార్డుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కేటాయింపు జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు డంపింగ్ యార్డ్ ఎందుకు ఏర్పాటు చేయలేదు? మున్సిపాలిటీకి అప్పగించిన భూమి ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉంది? కేటాయింపు లక్ష్యం నెరవేరకపోవడానికి కారణాలేమిటి? అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

భూమి చుట్టూ ఆక్రమణలున్నాయా?
క్షేత్రస్థాయిలో భూమి పరిస్థితిపై స్పష్టత లేకపోవడంతో ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతమైందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్వే నంబర్ 608/5లోని రెండెకరాల చుట్టూ ప్రహరీ నిర్మాణాలు చేపట్టారా? ప్రైవేటు వ్యక్తులు భూమిపై ఆధిపత్యం చెలాయిస్తున్నారా? అన్న అంశాలపై రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా పరిశీలన జరపాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వ భూమిని ప్రజాప్రయోజనాల కోసం వినియోగించాల్సి ఉండగా, దాని పరిరక్షణపై అధికారులు దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. భూమి స్వాధీనం, కేటాయింపు ప్రక్రియ పూర్తయినప్పటికీ తదుపరి చర్యలు చేపట్టకపోవడానికి కారణాలేమిటో వెల్లడించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
అధికారుల ముందున్న ప్రశ్నలివే!
2005 నాటి రికార్డులు ఏమయ్యాయి? ప్రొసీడింగ్స్ నంబర్ బి/1696/2005 ద్వారా జారీ చేసిన స్వాధీన ఉత్తర్వులు, భౌతిక స్వాధీన పత్రాలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయి?
మున్సిపాలిటీ ఆధీనంలో ఉందా? డంపింగ్ యార్డ్ కోసం కేటాయించిన భూమిని తుక్కుగూడ మున్సిపాలిటీ తన రికార్డుల్లో నమోదు చేసుకుందా? భౌతికంగా స్వాధీనంలోకి తీసుకుందా?
జాయింట్ సర్వే ఎందుకు చేయడం లేదు? తహసీల్దార్, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి హద్దులు నిర్ధారించడానికి చర్యలు తీసుకోవాలి కదా?
బాధ్యులపై చర్యలెప్పుడు? ప్రభుత్వ భూమి పరిరక్షణలో నిర్లక్ష్యం వహించినట్లు తేలితే సంబంధిత అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?

తక్షణ విచారణ జరపాలి!
మంఖాల్ గ్రామంలోని సర్వే నంబర్ 608/5లో ఉన్న రెండెకరాల భూమిపై ఉన్నతాధికారులు తక్షణమే సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ, మున్సిపల్ శాఖలు సంయుక్తంగా సర్వే నిర్వహించి భూమి హద్దులు, ప్రస్తుత ఆక్రమణలు, యాజమాన్య స్థితిని స్పష్టం చేయాలని కోరుతు న్నారు. ఆక్రమణలు ఉన్నట్లు నిర్ధారణ అయితే చట్టప్రకారం తొలగించి భూమిని మున్సిపాలిటీ ఆధీనంలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.
డంపింగ్ యార్డ్ లేదా ఇతర ప్రజాప్రయోజన కార్యక్రమాలకు భూమిని వినియోగించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ రెండెకరాల భూమి ప్రస్తుత పరిస్థితి ఏమిటి? కేటాయింపు తర్వాత జరిగిన పరిణామాలేమిటి? భూమి పరిరక్షణ బాధ్యత ఎవరిది? అన్న అంశాలపై సంబంధిత అధికా రుల వివరణతో మరిన్ని వాస్తవాలను వెలుగులోకి తీసుకు రానుంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
