- ఉప్పల్ పారిశ్రామిక భూమిలో కమర్షియల్ నిర్మాణం(Uppal Industrial Land)
- పాత ఒప్పందాలు.. కొత్త వాణిజ్య అనుమతులు
- పెట్రోల్ బంక్ అనుమతులతో కాంప్లెక్స్ నిర్మాణం?
- యాజమాన్య బదిలీల వెనుక అసలు కథేంటి?
- షెల్ ఇండియా నుంచి వాసవి ఎకో స్పేసెస్ వరకు..
- మధ్యలో ఇండూ ప్రాజెక్ట్స్ పేరు.. బదిలీలపై ఆరా
- అధికారుల అనుమతులపై విచారణకు డిమాండ్
యాజమాన్య బదిలీలు, భూ వినియోగ మార్పులు, అనుమతుల మంజూరులో నిబంధనలు పాటించారా? పారిశ్రామిక భూమిలో వాణిజ్య నిర్మాణానికి అధికారుల అనుమతి ఎలా లభించింది? ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత మరిచారా?
ప్రభుత్వ లక్ష్యం పరిశ్రమల స్థాపన.. కానీ తెరపైకి వస్తున్నది వాణిజ్య నిర్మాణాల వ్యవహారం. ఉప్పల్‌లో బిస్కెట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం 1968లో కేటాయించిన భూమి నేడు బహుళ అంతస్తుల వాణిజ్య భవన నిర్మాణానికి వేదికగా మారిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పన లక్ష్యంగా ప్రభుత్వం కేటాయించిన భూములు ప్రైవేటు వాణిజ్య ప్రయోజనాలకు వేదికలుగా మారుతున్నాయా? ఉప్పల్‌లో వెలుగుచూసిన ఓ భూవ్యవహారం ఇప్పుడు ఈ ప్రశ్నలను లేవనెత్తుతోంది. పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన భూమిలో నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల వాణిజ్య భవన నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. దశాబ్దాలుగా మారిన యాజమాన్యాలు, భూ బదిలీల వెనుక ఉన్న వ్యవహారాలు, పారిశ్రామిక భూమి వాణిజ్య వినియోగంలోకి ఎలా వెళ్లిందన్న అంశాలపై అధికారుల సమాధానాలు కోరుతున్నారు.
1968 – బిస్కెట్ ఫ్యాక్టరీ కోసం కేటాయింపు: జనవరి 23న సేల్ డీడ్ నంబర్ 376/68 ద్వారా అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారు 6.88 ఎకరాల భూమిని బిస్కెట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ‘జివన్ ఫుడ్స’ సంస్థకు విక్రయించింది. ఈ భూమిని పారిశ్రామిక అవసరాలకే వినియోగించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే తిరిగి స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని షరతులు విధించినట్లు పత్రాల్లో పేర్కొన్నట్లు సమాచారం.
2005 – షెల్ ఇండియాకు విక్రయం: జూలై 4న జివన్ ఫుడ్స్ సంస్థ ప్లాట్ నంబర్ పి-5/1ను షెల్ ఇండియా మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.5.20 కోట్లకు విక్రయించినట్లు సేల్ డీడ్ వివరాలు సూచిస్తున్నాయి. ఈ లావాదేవీలో ఎస్బీఐ తనఖాకు సంబంధించిన ప్రస్తావన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
2006 – సబ్ డివిజన్, పెట్రోల్ బంక్ అనుమతులు: అప్పటి ఏపీఐఐసీ అధికారులు భూమి సబ్ డివిజన్‌కు ఉత్తర్వులు జారీ చేస్తూ, పారిశ్రామిక అవసరాలకే వినియోగించాలనే షరతును కొనసాగించారు. అదే ఏడాది అక్టోబర్ 26న పెట్రోల్ బంక్ ఏర్పాటుకు భవన నిర్మాణ ప్రణాళికను ఆమోదించారు. అయితే భవన వినియోగంలో మార్పులు చేయాలంటే ఏపీఐఐసీ అనుమతి తప్పనిసరి అని కండిషన్ నంబర్ 16లో పేర్కొన్నట్లు సమాచారం.

2024 – భారీ వాణిజ్య భవనానికి అనుమతి: డిసెంబర్ 4న తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ పరిధిలోని ఐఏఎలఏ అధికారులు ‘వాసవి ఎకో స్పేసెస్ ఎలఎల్‌పీ’ సంస్థకు ‘వాసవి వన్ ఈస్ట్ ప్రాజెక్ట’ పేరుతో రెండు సెల్లార్లు, గ్రౌండ్ ఫ్లోర్, మూడు పై అంతస్తులతో కూడిన వాణిజ్య భవన నిర్మాణానికి బిల్డింగ్ పర్మిట్ నంబర్ ఐఐసి/1361/2024 జారీ చేసినట్లు పేర్కొంటున్నారు.
పారిశ్రామిక జోన్లో వాణిజ్య భవనమెలా?
పారిశ్రామిక అభివృద్ధి కోసం కేటాయించిన భూమిలో 2024 నాటి భవన నిర్మాణ అనుమతిలో పారిశ్రామిక వినియోగాన్ని ‘సున్నా (0.00)’గా చూపిస్తూ, 4,599.90 చదరపు మీటర్ల విస్తీర్ణంలో వాణిజ్య భవనానికి అనుమతి ఎలా ఇచ్చారన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. ఇందుకు అవసరమైన భూ వినియోగ మార్పిడి అనుమతులు చట్టబద్ధంగా పొందారా? సంబంధిత శాఖల ఆమోదం ఉందా? అన్నది తేలాల్సి ఉంది.
పెట్రోల్ బంక్ అనుమతులతో వాణిజ్య నిర్మాణమా?
2006లో పెట్రోల్ బంక్ కోసం ఇచ్చిన నిరభ్యంతర పత్రాలు, భవన నిర్మాణ అనుమతుల ఆధారంగా ఇప్పుడు బహుళ అంతస్తుల వాణిజ్య కాంప్లెక్స్ నిర్మాణానికి మార్గం సుగమమైందా? ఈ మార్పునకు టీజీఐఐసీ లేదా సంబంధిత పారిశ్రామిక సంస్థ ప్రత్యేక అనుమతులు జారీ చేసిందా? జారీ చేసి ఉంటే ఆ ఉత్తర్వులు ఏమిటన్నది వెల్లడించాల్సిన అవసరం ఉంది.

యాజమాన్య బదిలీల వెనుక ఏముంది?
2005లో షెల్ ఇండియాకు బదిలీ అయిన భూమి, మధ్యలో ఇండూ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ పేరుతో ప్రస్తావనకు వచ్చి, 2024 నాటికి వాసవి ఎకో స్పేసెస్ ఎలఎల్‌పీ చేతికి ఎలా చేరిందన్నది మరో కీలక అంశం. ఈ బదిలీలకు ముందస్తు అనుమతులు తీసుకున్నారా? ఎస్బీఐ తనఖా విడుదల పత్రాలు, బ్యాంకు సమ్మతిని అధికారులు పరిశీలించారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
భూమి విస్తీర్ణంలో తేడాలెందుకు?
సేల్ డీడ్, సబ్ డివిజన్ పత్రాల్లో నమోదైన విస్తీర్ణాలకు, 2024 భవన నిర్మాణ అనుమతిలో చూపిన వివరాలకు మధ్య వ్యత్యాసాలున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా రోడ్డు ప్రభావిత ప్రాంతం పేరుతో 604.01 చదరపు మీటర్లు చూపించడం, అది మొత్తం ప్లాట్ విస్తీర్ణంలో సుమారు 24 శాతంగా ఉండటంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ భూమి రోడ్డు విస్తరణకు కేటాయించారా? అందుకు పరిహారం చెల్లించారా? అన్న వివరాలు బయటపెట్టాలని కోరుతున్నారు.
అనుమతులు నిలిపివేయాలి.. సమగ్ర విచారణ జరపాలి!
ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పన కోసం కేటాయించిన భూములు ప్రైవేటు రియల్ ఎస్టేట్, వాణిజ్య కార్యకలాపాలకు వేదికలుగా మారుతున్నాయనే ఆరోపణలపై ప్రభుత్వం స్పందించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో అధికారుల బాధ్యతను కూడా నిర్ధారించాలని కోరుతున్నారు.
- బిల్డింగ్ పర్మిట్ నంబర్ ఐఐసి/1361/2024 అనుమతిని విచారణ పూర్తయ్యే వరకు తాత్కాలికంగా నిలిపివేయాలి.
- అనుమతుల మంజూరుకు సంబంధించిన పూర్తి ఫైళ్లు, నోట్షీట్లు, సంబంధిత ఉత్తర్వులను బహిర్గతం చేయాలి.
- భూమి యాజమాన్య బదిలీలు, తనఖా విడుదల, భూ వినియోగ మార్పిడి అంశాలపై సమగ్ర విచారణ జరపాలి.
- నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే బాధ్యులైన అధికారులపై శాఖాపరమైన చర్యలతో పాటు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి.
ప్రభుత్వ భూముల పరిరక్షణలో పారదర్శకత, అధికారుల జవాబుదారీతనం అత్యంత కీలకం. ఉప్పల్‌లోని(Uppal Industrial Land) ఈ భూవ్యవహారానికి సంబంధించి అసలు అనుమతులు ఏమిటి? నిబంధనలు పాటించారా? యాజమాన్య బదిలీలకు చట్టబద్ధమైన ఆమోదం ఉందా? అన్న ప్రశ్నలకు సంబంధిత అధికారులు స్పష్టమైన సమాధానాలు ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో అధికారులు బాధ్యత వహించే వరకు ఈ అక్రమాలపై వాస్తవాలు వెలుగులోకి తెస్తుంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
