- నిధుల కేటాయింపు, అదనపు టార్గెట్లపై అనుమానాలు
- పాలనాపరమైన ప్రక్రియలను పక్కనబెట్టిన వైనం
- 17 ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలకు పాత టార్గెట్లు
- మూడు సంస్థలకు మాత్రమే అదనపు టార్గెట్లు
- ప్రాజెక్ట్ అప్రూవల్ కమిటీ అనుమతి ఎక్కడ..?
- సామర్థ్యానికి మించిన కేటాయింపుల ఆంతర్యమేమిటి?
- ఆమోదం ఎవరిది? బాధ్యత ఎవరిది? తెలియాలి
- స్వతంత్ర విజిలెన్స్ విచారణ చేయాలని డిమాండ్స్
ఎం.ఓ.ఆర్.డి. నిబంధనలు ఉల్లంఘించిన ఈజీఎంఎం – తెలంగాణ.. అప్పనంగా అదనపు టార్గెట్లు.. నిధుల కేటాయింపుల్లో గోల్మాల్
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయాల్సిన ‘దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన’ పథకం తెలంగాణలో తీవ్ర వివాదాస్పదమైంది. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాల్సిన పవిత్ర లక్ష్యాన్ని పక్కనపెట్టి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ అధికారులు నిబంధనలను తుంగలో తొక్కారనే ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.
అప్పనంగా లబ్ధి.. అక్రమాల సుడిగూడులో ఈజీఎంఎం! నిబంధనలకు నీళ్లొదురుతూ.. కొందరికి మాత్రమే పెద్దపీట.. కేంద్రం ఒకలా.. తెలంగాణ ఈజీఎంఎం మరోలా నిర్ణయాలు.. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయాల్సిన ‘దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన’ పథకం తెలంగాణలో తీవ్ర వివాదాస్పదమైంది. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాల్సిన పవిత్ర లక్ష్యాన్ని పక్కనపెట్టి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ అధికారులు నిబంధనలను తుంగలో తొక్కారనే ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. పాలనాపరమైన పారదర్శకతను గాలికి వదిలేసి, కొద్దిమందికి మాత్రమే అప్పనంగా భారీ ప్రాజెక్టు నిధులు, అదనపు టార్గెట్లు కట్టబెట్టడం వెనుక పెద్దఎత్తున అవకతవకలు జరిగాయన్న విమర్శలు తీవ్రతరం అవుతున్నాయి.
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం(DDU-GKY) అమలులో తెలంగాణ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ అధికారుల తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. నిబంధనలు, పాలనాపరమైన ప్రక్రియలను పక్కనపెట్టి కొన్ని నిర్దిష్ట సంస్థలకు అప్పనంగా లబ్ధి చేకూర్చేలా అదనపు టార్గెట్లు, భారీ ప్రాజెక్ట్ నిధులు కేటాయించారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

కేంద్ర నిబంధనలు ఒకలా.. క్షేత్రస్థాయి నిర్ణయాలు మరోలా :
డీడీయూ-జీకేవై(DDU-GKY) ప్రాజెక్టులకు సంబంధించి ఎం.ఓ.ఆర్.డీ. (భారత ప్రభుత్వం) 2025 ఏప్రిల్ 7న స్పష్టమైన మార్గదర్శకాలతో ఒక ఆదేశాన్ని విడుదల చేసింది. ఆ ఉత్తర్వు ప్రకారం తెలంగాణలోని 17 ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలకు మాత్రమే పాత బ్యాలెన్స్ టార్గెట్లను 31 డిసెంబర్ 2025 నాటికి పూర్తి చేయడానికి కేంద్రం అనుమతించింది. కేంద్ర ఉత్తర్వులకు అనుగుణంగా తెలంగాణ ఈజీఎంఎం 09/04/2025న ఆ 17 ఏజెన్సీలకు లేఖలు జారీ చేసింది.
తదనంతరం, అదనపు టార్గెట్లకు సంబంధించి నాగాలాండ్, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల కోసం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ 2025 ఆగస్టు 18న ఒక సర్క్యులర్‌ను విడుదల చేసింది. అయితే, కేంద్రం నుంచి అధికారిక సర్క్యులర్ ఆగస్టు 18న వెలువడక ముందే, జూన్ 13, 2025 నాడే తెలంగాణ ఈజీఎంఎం ఒక అంతర్గత నోట్ ఆమోదంతో మూడు నిర్దిష్ట సంస్థలకు అదనపు టార్గెట్లను గుట్టుచప్పుడు కాకుండా కట్టబెట్టడం తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది.
ఆ మూడు సంస్థలు :
- సరిత విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ సొసైటీ..
- స్ఫూర్తి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ..
- స్పార్క్ రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ..
కేటాయింపుల వివరాలు :
ఎం.ఓ.ఆర్.డీ. జీ.ఓ.ఐ. సర్క్యులర్‌ను లెక్క చేయకుండా, ఎటువంటి ఆమోదం లేకుండా టార్గెట్ల రెట్టింపు! ఈ మూడు సంస్థలకు జరిగిన కేటాయింపుల వివరాలు తీవ్ర అనుమానాలకు తావిస్తున్నాయి. గత 2019 నుండి 2025 వరకు ఆరేళ్ల కాలంలో సరిత విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ సొసైటీకి 400 టార్గెట్ (రూ. 4.10 కోట్ల ప్రాజెక్ట్) ఉండగా, 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా అంతే మొత్తంలో మరో 400 అదనపు టార్గెట్ మంజూరు చేయడంతో మొత్తం టార్గెట్ 800కు, ప్రాజెక్ట్ బడ్జెట్ రూ. 8.20 కోట్లకు చేరింది.
అదేవిధంగా, స్ఫూర్తి రూరల్ డెవలప్మెంట్ సొసైటీకి గతంలో 479 టార్గెట్ (రూ. 4.76 కోట్ల ప్రాజెక్ట్) ఉండగా, తిరిగి 479 అదనపు టార్గెట్‌ను కట్టబెట్టడంతో మొత్తం టార్గెట్ 1051కి, ప్రాజెక్ట్ విలువ రూ. 9.52 కోట్లకు పెరిగింది.
స్పార్క్ రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సొసైటీకి గతంలో ఉన్న 251 టార్గెట్ (రూ. 3.31 కోట్ల ప్రాజెక్ట్) కు తోడుగా మరో 251 అదనపు టార్గెట్ కేటాయించడంతో మొత్తం టార్గెట్ 570కు చేరగా, ప్రాజెక్ట్ విలువ రూ. 7.62 కోట్లకు విస్తరించింది.
గత ఆరు సంవత్సరాల్లో పూర్తి చేయలేకపోయిన సంఖ్యకు సమానమైన టార్గెట్లను కేవలం ఒక్క సంవత్సరానికే రెట్టింపు చేయడం గమనార్హం.
పాలనాపరమైన ప్రక్రియలపై వెల్లువెత్తుతున్న ప్రధాన ప్రశ్నలు :
ఈ వ్యవహారంలో పారదర్శకత పూర్తిగా లోపించిందనడానికి పలు కీలక అంశాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి..
- ప్రాజెక్ట్ అప్రూవల్ కమిటీ అనుమతి ఏదీ? :
ప్రాజెక్ట్ నిధులు, లక్ష్యాల పెంపుదలకు అత్యున్నత ప్రాజెక్ట్ అప్రూవల్ కమిటీ అధికారిక ఆమోదం తప్పనిసరి అయినప్పటికీ, ఎటువంటి పీఏసీ అనుమతి లేకుండానే ఇంత భారీ మొత్తంలో అదనపు టార్గెట్లను ఏ ప్రాతిపదికన కేటాయించారు - సామర్థ్యానికి మించిన కేటాయింపుల ఆంతర్యమేమిటి? :
గత ఆరు సంవత్సరాల సుదీర్ఘ కాలంలో కేవలం 251 నుండి 479 మంది అభ్యర్థులకు మాత్రమే శిక్షణ పరిమితమైన సంస్థలు, కేవలం 6 నెలల స్వల్ప వ్యవధిలో రెట్టింపు సంఖ్యలో శిక్షణ పూర్తి చేయగలవని ఎలా నిర్ధారించారు? - ఆమోదం ఎవరిది? బాధ్యత ఎవరిది? :
కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి ఆమోదం లేకుండా నోట్ ఫైల్ ద్వారా ఈ ప్రత్యేక కేటాయింపులు చేయడానికి ఎవరి ఆదేశాలు లేదా ఆమోదాలు కారణం?
స్వతంత్ర విజిలెన్స్ విచారణకు పెరుగుతున్న డిమాండ్ :
ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడటంతో పాటు నిరుద్యోగ యువతకు నాణ్యమైన నైపుణ్య శిక్షణ, నిజమైన ఉపాధి లభించేలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉంది. ఈ నేపథ్యంలో, సంబంధిత మూడు సంస్థలు గతంలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమాలు, అభ్యర్థులకు కల్పించిన ఉపాధి వివరాలు, అలాగే వాటి ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలపై నిష్పాక్షికమైన, స్వతంత్ర విజిలెన్స్ విచారణ జరిపించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై సమగ్ర దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు.. మరిన్ని వివరాలు ఆధారాలతో సహా వరుస కథనాలతో వెలుగులోకి తీసుకుని రానుంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
