తక్కువ జీతాలతో జీవనం కష్టమంటున్న ఉద్యోగులు
విధులు మాత్రం జీహెచ్ఎంసీ స్థాయిలో నిర్వహిస్తున్నా వేతనాలు పాత మున్సిపాలిటీ జీతాలకే పరిమితమవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు…
- జీహెచ్ఎంసిలో ఉద్యోగం.. మున్సిపాలిటీ జీతాలే శరణ్యం
- జీహెచ్ఎంసిలో విలీనంపై ఔట్సోర్స్ సిబ్బందిలో ఆశలు
- మూడు నెలలు గడిచినా జీతాల్లో కానరానిమార్పు
- గోడును వెళ్లబోసుకుంటున్న శివారు ఔట్సోర్స్ సిబ్బంది “
- కార్మిక సంఘాలు, ప్రభుత్వం దృష్టి సారించాలని విజ్ఞప్తి
పేరుకే వారు గ్రేటర్ ఉద్యోగులు.. కానీ వేతనాలు మాత్రం పాత’ పద్ధతిలోనే అందుకుంటున్నారు.. శివారు మున్సిపాలిటీ లను జీహెచ్ఎంసిలో విలీనం చేయగానే.. తమ స్థాయి, వేతనం పెరుగుతుందని, జీహెచ్ఎంసి ఉద్యోగులతో సమానంగా తమ జీతాలు, జీవితాలు మారిపోతాయని ఆశించారు.. కానీ ప్రభుత్వం వారి ఆశలమీద నీళ్లు చల్లేసింది.. పని పెరిగింది.. కానీ వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు జరగలేదు.. నిజానికి జీహెచ్ఎంసి పనిచేసే రెగ్యులర్ ఉద్యోగులకంటే ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే ఎక్కువ బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారు..

మున్సిపాలిటీలు గ్రేటర్ లో కలిసిపోయాక, గ్రేటర్ ఉద్యోగులతో సమానంగా జీతాలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన వుంది.. కానీ వీరి వ్యథలను పట్టించుకునే నాథుడే లేకపోవడం శోచనీయం.. జీహెచ్ఎంసి ఉద్యోగులం అని చెప్పుకోవడం తప్ప ఒరిగింది ఏమీ లేదని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. అదేదో సామెత చెప్పినట్లు పని మూరెడు, ఫలితం మాత్రం జానెడు అన్న చందంగా వీరి పరిస్థితి దాపురించింది.. విలీనం తరువాత స్థాయి పరుగుతుందని భావించారు గానీ, మరింత భారమవుతుందని ఊహించలేక పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
శివారు మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం అవుతాయనే వార్తతో ఔట్‌సోర్స్ సిబ్బందిలో భారీ ఆశలు చిగురించాయి. ఫీల్డ్ స్టాఫ్, బిల్ కలెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, సానిటరీ వర్కర్లు లాంటి చిరు ఉద్యోగులు జీహెచఎంసిలో పని చేస్తున్న సిబ్బందితో సమాన వేతనాలు అందుతాయనే నమ్మకంతో ఎంతగానో సంబరపడిపోయారు.. అయితే మÖడు నెలలు గడిచినా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు.. విధులు మాత్రం జీహెచఎంసి స్థాయిలో నిర్వహిస్తున్నా.. వేతనాలు మాత్రం పాత మున్సిపాలిటీ రేట్లకే పరిమితమయ్యాయని వాపోతున్నారు..

అయితే కార్మిక చట్టాల ప్రకారం ఒకే సంస్థలో ఒకే పనికి సమాన వేతనం చెల్లించాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అదే పనిని చేస్తూ జీహెచఎంసి ఔట్‌సోర్స్ సిబ్బంది పొందుతున్న జీతాలతో పోలిస్తే, విలీనం అయిన మున్సిపాలిటీ ఉద్యోగులు తక్కువ వేతనాలతోనే కొనసాగుతున్నారు. దీంతో “విలీనమంటే వేతనాల పెంపు” అన్న ఆశలు నీరుగారి పోయాయి.
విధులు మాత్రం జీహెచఎంసి, సి.ఎం.సి., ఎం.ఎం.సి.లలో కొనసాగుతున్నా.. జీతం మాత్రం పాత మున్సిపాలిటీ దేనా? అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు.. తాము చేస్తున్నది సమానమైన పనే అయినా.. వారికి ఒకరకంగా వేతనం.. తమకు మరో రకంగా వేతనం.. ఇదేం న్యాయం? విలీనంతో సమానత్వం వస్తుందనుకున్నాం? అసమానతే మిగిలింది అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. చట్టాలు కేవలం పుస్తకాలకే పరిమితం అవుతున్నాయా..? కార్మికుల హక్కులు ఎక్కడ? రోజంతా కష్టపడేది మేమే? గౌరవం, జీతం మాత్రం కనిపించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
తమ సమస్యలపై ప్రభుత్వం, కార్మిక సంఘాల వారు దృష్టి పెట్టాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.. చాలీ చాలని జీతాలతో జీవించడం కష్టంగా మారిందని. వెంటనే వేతనాల్లో సమానత్వం తీసుకురావాలి అని వారు కోరుతున్నారు.. విలీనంతో చిగురించిన ఆశలు ఆచరణలో నెరవేరకపోతే, అది కార్మికుల్లో నిరాశ మాత్రమే కాదు, అసంతృప్తిని కూడా పెంచుతుంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమాన వేతన విధానాన్ని అమలు చేయాలని ఔట్‌సోర్స్ సిబ్బంది ఆవేదనతో వేడుకుంటున్నారు.
