- పరశురాముడు ప్రారంభించిన యాత్ర..
- ఈ నెల 29 నుంచి ప్రారంభం..
- ఉత్తరాఖండ్ ముక్తేశ్వర్ డాం నుంచి పాదయాత్ర..
‘శివో అభిషేక ప్రియః’ అంటుంది శాస్త్రం. ఆడంబరాలకు ఆమడ దూరంలో ఉండే శివయ్యకు కాసిని నీళ్లతో అభిషేకం చేస్తే చాలు కరుణించి వరాలు కురిపిస్తాడు. గంగాజలాభిషేకంతో ప్రీతి చెందే భోళాశంకరుని అభిషేకం కోసం వందల మైళ్లు కాలి నడకన ప్రయాణించి కావిళ్లతో గంగాజలాన్ని మోసుకెళ్లే పవిత్రమైన యాత్రను కన్వర్ యాత్ర అంటారు. ప్రతి సంవత్సరం గురు పూర్ణిమ నుంచి మొదలయ్యే ఈ యాత్ర ఈ ఏడాది జులై 29 బుధవారం నుంచి ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా కన్వర్ యాత్ర విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం. దక్షిణ భారతంలో శివారాధనకు కార్తిక మాసం ఎంత ప్రత్యేకమో, ఉత్తరభారతంలో శివారాధనకు శ్రావణ మాసం అంత విశిష్టమైనది. ఉత్తర భారతంలో పౌర్ణమి నుంచి పౌర్ణమి వరకు నూతన మాసాన్ని గణిస్తారు. ఆ ప్రకారంగా గురు పౌర్ణమి నుంచి ఉత్తర భారతంలో శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. ఉత్తర భారతంలో శ్రావణ మాసం ప్రారంభం కాగానే శివాలయాలన్ని పంచాక్షరీ మంత్రం ఘోషతో మారుమ్రోగుతుంటాయి. ఈ పవిత్ర శ్రావణ మాసంలో చేసే కన్వర్ యాత్ర విశేషాలు గురించి తెలుసుకుందాం.
ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం పరశురాముడు మొట్టమొదటిసారిగా ఈ కన్వర్ యాత్రను ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. పరశురాముడు ఉత్తరాఖండ్‌లోని ముక్తేశ్వర్ ధామ్ నుంచి కాలి నడకన కావిళ్లతో గంగాజలాన్ని తీసుకువచ్చి ఉత్తరప్రదేశ్‌లోని బాగ్పత్ సమీపంలో ఉన్న ‘పుర మహాదేవుడి’ని అభిషేకించాడని నమ్మకం. ఈ కన్వర్ యాత్ర చేసే వారిని కన్వారీలు అంటారు. పురాణాలలో పేర్కొన్న కన్వర్ యాత్రకు సంబంధించిన గాథను ఈ సందర్భంగా ప్రస్తావించుకుందాం.
పురాణాల ప్రకారం, క్షీరసాగర మథన సమయంలో హాలాహలం ఉద్భవించినప్పుడు, పరమశివుడు దానిని సేవించి తన కంఠంలో నిలుపుకుని గరళకంఠుడయ్యాడు. పరమేశ్వరునిపై ఆ విషం ప్రభావాన్ని తగ్గించడానికి శ్రీరాముడు కన్వర్ సహాయంతో గంగాజలాన్ని తీసుకువచ్చి శివలింగానికి అభిషేకం చేశాడని నమ్ముతారు. అప్పటి నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది. అటు తర్వాత త్రేతాయుగానికి చెందిన పరశురాముడు తన తీర్థయాత్రలో భాగంగా ఈ ఆచారాన్ని కొనసాగించాడని పురాణాలు చెబుతున్నాయి.
