- అమ్మకాల ఒత్తిడి కారణంగా పరిమిత శ్రేణిలో కదిలిన సూచీలు..
- కొంతమేర తగ్గిన కొనుగోళ్ల నష్టాలు..
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లలో బలహీన ధోరణి, ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంకులు, కెమికల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు రోజంతా పరిమిత శ్రేణిలోనే కదలాడాయి. అయితే ఐటీ షేర్లలో బలమైన కొనుగోళ్లు నష్టాలను కొంత మేర తగ్గించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 69.86 పాయింట్లు తగ్గి 76,765.92 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10.60 పాయింట్లు క్షీణించి 23,985.35 వద్ద స్థిరపడింది.. నిఫ్టీలో హిందుస్థాన్ యూనిలీవర్, భారత్ ఎలక్ట్రానిక్స్ (బీఈఎల్), కోల్ ఇండియా షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. మరోవైపు ఐటీ షేర్లు మంచి ప్రదర్శన కనబరిచాయి.
నిఫ్టీ ఐటీ సూచీ 3 శాతానికి పైగా ఎగసి వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 0.08 శాతం పెరగ్గా, స్మాల్‌క్యాప్ సూచీ 0.22 శాతం తగ్గింది. ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్, కెమికల్ రంగాల షేర్లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మార్కెట్ నిపుణుల ప్రకారం.. నిఫ్టీకి 24,050 స్థాయి కీలక నిరోధంగా ఉండగా, 23,920 వద్ద సమీప మద్దతు ఉంది. 24,050 స్థాయిని దాటితే 24,500 దిశగా కదిలే అవకాశం ఉందని, దిగువన 23,800 వద్ద మరో కీలక మద్దతు ఉన్నట్లు విశ్లేషించారు. దిగుమతి వస్తువుల ధరలు తగ్గడం, బ్యాంకుల నుంచి డాలర్ల సరఫరా కొనసాగడంతో రూపాయి వరుసగా మూడో రోజు బలపడింది.
