Homeఆదిలాబాద్Tummala Nageswara Rao | వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం

Tummala Nageswara Rao | వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం

  • రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

వ్యవసాయ రంగాన్ని మరింత సులభతరం చేసి, రైతులకు లాభదాయకంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన ‘రైతు నేస్తం’ 100వ ఎపిసోడ్ ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి పాల్గొని రాష్ట్రవ్యాప్తంగా రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. అన్ని జిల్లాల మండల కేంద్రాల్లోని రైతు వేదికల ద్వారా అధికారులు, రైతులు ఈ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్నారు.

Tummala Nageswara Rao Rythu Nestham Program01 1

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటల సాగులో మార్పులు చేసుకోవాలని సూచించారు. ఆరుతడి పంటలు, ఉద్యానవన పంటలు, ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తూ, నేల స్వభావం, నీటి లభ్యత, మార్కెట్ అవకాశాలను దృష్టిలో ఉంచుకుని పంటల మార్పిడి విధానాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రసాయన ఎరువులను మోతాదుకు మించి వినియోగించకుండా శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలని కోరారు.

- Advertisement -

‘రైతు నేస్తం’ కార్యక్రమం ద్వారా ప్రపంచ స్థాయి వ్యవసాయ సాంకేతికత, శాస్త్రీయ సూచనలను రైతులకు అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, మండల స్థాయి వ్యవసాయ అధికారులు రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయిలో మార్గనిర్దేశం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో పంట మార్పిడి ద్వారా విజయాలు సాధించిన ఆదర్శ రైతులను మంత్రి సన్మానించారు.

సోన్ మండల రైతు వేదిక నుంచి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులు ‘రైతు నేస్తం’ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని సూచించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా పంటల సాగు చేపట్టాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

అనంతరం ఉత్తమ సేవలందించిన రైతులు, వ్యవసాయ అధికారులను అభినందించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారి రమణ, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణప్రసాద్ రెడ్డి, తహశీల్దార్ సంతోష్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News