- కొనుగోలు కేంద్రాల్లో దళారుల ప్రవేశం
- ట్రక్ చిట్ లేకుండానే ధాన్యం తరలింపు!
- కొనుగోళ్ల వద్ద ముద్ర లేని కాంటాలు..?
- స్టేట్ మెంట్లకే పరిమితమైన అధికారులు
- ఒక్క కేసూ నమోదు చేయని వైనం
పాపన్నపేట: తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు (Grain Purchasing Centers) రైతులకు రక్షణ కవచంగా ఉండాలి. కానీ అక్కడ దళారుల దందా(Brokerage Business) రోజురోజుకు విస్తరిస్తోంది. రైతుల (Farmers) కష్టార్జిత ధాన్యం మీదే ఈ దళారులు వేటాడుతున్నారు. ఓ వైపు అకాల వర్షాలతో పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతులకు కొనుగోలు కేంద్రాల్లో దళారుల ప్రవేశంతో మరింత నష్టం వాటిల్లుతోంది.
ట్రక్ చిట్ లేకుండానే ధాన్యం తరలింపు
పాపన్నపేట మండలం(Papannapet Mandal)లో కొంతమంది దళారులు ట్రక్ చిట్ (Truck Chit) లేకుండానే ధాన్యం తరలిస్తున్నట్లు సమాచారం. కొన్నిచోట్ల కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, దళారుల మధ్య కుమ్మక్కుతో ఈ అక్రమ ధాన్యం రవాణా జరుగుతోంది. అధికారుల కళ్ల ముందే ఈ దందా సజావుగా నడుస్తోందన్న ఆరోపణలు రైతు వర్గాల నుండి వినిపిస్తున్నాయి.
తూనికల్లో మోసం…!
కొనుగోలు కేంద్రాల వద్ద సొసైటీలు(Societies), ఐకేపీల (IKP) ఆధ్వర్యంలో తూకం వేసే డిజిటల్ కాంటాలను ప్రతి సంవత్సరం తూనికలు మరియు కొలతల శాఖ అధికారులు తనిఖీలు చేసి అధికారికంగా ముద్ర వేస్తారు. కానీ దళారులు ఉపయోగించి కాంటాలను తనిఖీ చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దళారులు ముద్రవేయని కాంటాలు ఉపయోగిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇదే జరిగితే రైతులు భారీ మొత్తంలో నష్టపోయే అవకాశం ఉంది. గింజ గింజ కాపాడుతూ అమ్మకానికి తీసుకువచ్చే తమకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవలసిన బాధ్యత సంబంధిత అధికారులదే అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూకంలో తగ్గించి, తరుగులో దొంగతనం చేస్తున్నారు. తాము ఎవరికి చెప్పాలో కూడా తెలియడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రకటనలకే పరిమితమైన అధికారులు
సంబంధిత అధికారులు (Officers) ఈ వ్యవహారంపై చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొనుగోలు కేంద్రాలలో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు (Criminal Cases) పెడతామని హెచ్చరిస్తున్న అధికారులు క్షేత్రస్థాయిలో మాత్రం నిలువరించలేకపోతున్నారు. అధికారులు కేవలం స్టేట్మెంట్లకి పరిమితమవుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు పరోక్షంగా దళారులకు వత్తాసు పలుకుతున్నారని రైతు వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు కొనుగోలు కేంద్రాల వద్ద సంపూర్ణమైన దృష్టి సారించాలని, కొనుగోలు కేంద్రాల వద్ద దళారుల ప్రవేశాన్ని అరికట్టి రైతుల పక్షాన నిలవాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. లేకపోతే కొనుగోలు కేంద్రాలే దళారుల చేతుల్లోకి పూర్తిగా వెళ్లిపోతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
